అవి మరింత ఆలస్యమవుతాయని తేల్చేసిన ఏపీపీఎస్సీ.. వెంటనే విడుదల చేయాలని అభ్యర్థుల డిమాండ్
కమిషన్ కార్యాలయం ముట్టడికి యత్నం..అధికారుల బెదిరింపు.. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చిన మూడు నెలల్లో ప్రిలిమ్స్ పూర్తి
చంద్రబాబు ప్రభుత్వంలో ఏడాది తర్వాత మెయిన్స్ నిర్వహణ
ఫలితాలపై హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చినా కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకుండా కుట్ర
సాక్షి, అమరావతి: గ్రూప్–1, గ్రూప్–2 అభ్యర్థులతో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చెలగాటమాడుతున్నాయి. తాము రేయింబవళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాసినా ఫలితాలు ఇచ్చేందుకు చంద్రబాబు సర్కారు మొగ్గు చూపకపోవడం.. ఫలితాలిస్తామని ఏపీపీఎస్సీ పైకి చెబుతున్నప్పటికీ అది ఎప్పుడో తెలీక అభ్యర్థులు రెండింటి మధ్య నలిగిపోతున్నారు. ఎందుకంటే.. ఫలితాలు ప్రకటించుకోవచ్చని న్యాయస్థానం చెప్పినా మరికొంత సమయం పడుతుందని ఏపీపీఎస్సీ ప్రకటించడంతో అభ్యర్థుల్లో కలవరం మొదలైంది.
గత ప్రభుత్వం 2023 డిసెంబరులో ఇచ్చిన గ్రూప్–2 నోటిఫికేషన్‌కు మూడునెలల్లో ప్రిలిమ్స్ పూర్తిచేసి మేలో మెయిన్స్ నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. అయితే, సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో పరీక్షలు నిర్వహించొద్దని నాటి ప్రతిపక్ష నేతలు హైకోర్టులో కేసులు వేయించారు. అనంతరం 2024 జూన్‌లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
కానీ, గత ప్రభుత్వంపై కక్షగట్టి హైకోర్టులో పిటిషన్లు వేయించిన ప్రస్తుత అధికార పక్షం.. ఇప్పుడు కూడా అదే పంధాను అనుసరించడం చూస్తుంటే 2026లో కూడా గ్రూప్–2 ఫలితాలు వస్తాయన్న ఆశలేదని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పోర్ట్సు కోటాతో ఫలితాలను ముడిపెట్టి అడ్డుపడుతోందని వారు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద నిరసనకు యతి్నంచిన అభ్యర్థులను కార్యాలయానికి రాకుండానే బెదిరించి వెనక్కి పంపేసినట్లు తెలిసింది.
మూడు నెలల్లో ప్రిలిమ్స్.. ఏడాది తర్వాత మెయిన్స్..
నిజానికి.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో 2023 డిసెంబరులో 905 పోస్టులతో గ్రూప్–2 నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ 2024 ఫిబ్రవరి 25న నిర్వహించింది. మెయిన్స్ అదే ఏడాది మే/జూన్‌లో జరుగుతాయని ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించి నెలరోజుల్లో ఫలితాలు ప్రకటించారు. అనంతరం 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసి మేలో మెయిన్స్‌కు ఏర్పాట్లుచేశారు. అలాగే, గ్రూప్–1కి కూడా 2023 డిసెంబరులోనే దాదాపు 90 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి మార్చిలో ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి పేరు వస్తుందన్న అక్కసుతో కొందరు టీడీపీ నాయకులు అభ్యర్థులతో హైకోర్టులో పిటిషన్లు వేయించారు.
ముఖ్యంగా గ్రూప్–1పై ఈ కేసులు వేయడంతో పాటు గ్రూప్–2పైనా అదనపు పిటిషన్లు వేయించారు. దీంతో 2024 మే, జూన్‌లో జరగాల్సిన మెయిన్స్‌కు బ్రేకులు పడ్డాయి. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడడంతో అడ్డంకులు తొలగిపోతాయని అభ్యర్థులు ఆశించారు. కానీ, కూటమి ప్రభుత్వం రాగానే ఏపీపీఎస్సీని అస్తవ్యస్థం చేసింది. అనేక రకాల డ్రామాల నడుమ 2025 ఫిబ్రవరి 23న గ్రూప్–2 మెయిన్స్.. నిర్వహించి గతనెలలో సరి్టఫికెట్ల పరిశీలన, కంప్యూటర్ నైపుణ్య పరీక్షలు పూర్తిచేశారు. అదే ఏడాది మేలో గ్రూప్–1 మెయిన్స్ నిర్వహించారు.
హైకోర్టు అడ్డంకులు తొలగినా సరే..
ఇక గ్రూప్–1, 2 ఫలితాల విడుదలకు హైకోర్టులో అడ్డంకులు తొలగినప్పటికీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ రెండూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్సు కోటా పోస్టులను పక్కనబెట్టి, మిగిలిన పోస్టులకు ఫలితాలు ప్రకటించుకోవచ్చని హైకోర్టు స్పష్టతనిచ్చింది. అయితే, ఫలితాలు మరింత ఆలస్యమవుతాయని ఏపీపీఎస్సీ ఇటీవల ప్రకటించడం అభ్యర్థుల్లో ఆందోళనను రెట్టింపు చేసింది. ఇప్పుడు ఫలితాలు ప్రకటించకపోతే మెయిన్స్ రాసి సీపీటీకి ఎంపికగాని అభ్యర్థులు మళ్లీ డివిజనల్ బెంచ్, సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ నోటిఫికేషన్ పూర్తికావడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. ఈ నోటిఫికేషన్ పూర్తికాకుండా కొత్త జాబ్ కేలండర్ ఇవ్వడం కుదరదని ప్రభుత్వం పరోక్షంగా చెబుతోంది. దీంతో ఎంపికగాని అభ్యర్థులు మరోసారి డివిజనల్ బెంచ్‌కు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు.
జగన్ పాలనలో దేశంలోనే నం.1గా ఏపీపీఎస్సీ..
ఇదిలా ఉంటే.. వైఎస్ జగన్ హయాంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్విస్ కమిషన్ల పనితీరుపై విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకోగా.. వివాదరహిత కమిషన్‌గా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. కానీ, ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఏపీపీఎస్సీని తిరిగి వివాదాల్లోకి నెట్టి నిరుద్యోగ యువత ఆశలను ఛిద్రం చేస్తోంది. 2018 డిసెంబరులో నాటి టీడీపీ ప్రభుత్వం 32 నోటిఫికేషన్లు ఇచ్చి ఒక్కదానికి కూడా పరీక్షలు నిర్వహించలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వంలో 2018 నాటి పరిస్థితే కనిపిస్తుండడం యువతను ఆందోళనకు గురిచేస్తోంది.


