గదగ్: కర్ణాటకలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గదగ్ జిల్లా, లక్కుండి గ్రామంలో ఒక ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా కూలీలు పునాదుల కోసం భూమిని తవ్వుతుండగా అనూహ్యంగా బంగారు నిధి లభ్యమయ్యింది. పునాదుల్లో పసిడి ఆభరణాలు బయటపడటంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది. పాతకాలపు రాగి బిందెలో దాచి ఉంచిన ఈ విలువైన సంపదను చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ నిధిని స్థానికంగా ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రజ్వల్ రిత్విక్ అనే విద్యార్థి గుర్తించాడు. భూమిలో కనిపిస్తున్న రాగి బిందెను గమనించిన ఆ బాలుడు, వెంటనే గ్రామ పెద్దలకు ఆ సమాచారం అందించాడు. ఆ రాగి బిందెను తెరిచి చూడగా, అందులో వివిధ రకాల బంగారు ఆభరణాలు కనిపించాయి. బాలుడి నిజాయితీని గ్రామస్తులు మెచ్చుకున్నారు. విషయం తెలుసుకున్న గదగ్ జిల్లా ఎస్పీ రోహన్ జగదీష్ నేతృత్వంలో పోలీసుల బృందం, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అధికారులు ఆ బంగారాన్ని పరిశీలించి, అది సుమారు 470 గ్రాముల బరువు ఉన్నట్లు నిర్ధారించారు. ఆ రాగి బిందెలో మొత్తం 22 రకాల బంగారు వస్తువులు ఉన్నాయని, వాటిలో గొలుసులు, చెవి కమ్మలు వంటి విలువైన ఆభరణాలు ఉన్నట్లు ఎస్పీ మీడియాకు తెలిపారు. అధికారులు ఈ బంగారు నిధిని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం లభ్యమైన 470 గ్రాముల బంగారాన్ని ప్రభుత్వ ట్రెజరీకి తరలించారు. పురావస్తు శాఖ నిపుణులు ఈ ఆభరణాల చారిత్రక నేపథ్యాన్ని పరిశీలించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: కేరళలో అమిత్ షా.. ‘స్వామి కార్యం.. స్వకార్యం’


