తిరువనంతపురం: కేరళ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అటు అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించడంతో పాటు పార్టీ (బీజేపీ) కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. నేడు (ఆదివారం) పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించిన అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి కేరళ చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం రాష్ట్ర బీజేపీ నాయకులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్ల్రాలు ధరించిన అమిత్ షాకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఆరేళ్లకు ఒకసారి జరిగే ‘లక్షదీపం’ ఉత్సవానికి ఆలయం సిద్ధమవుతున్న తరుణంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 14న ఆలయంలో లక్ష దీపాలను వెలిగించే మహోత్సవం జరగనుంది.
ఆలయ దర్శనం అనంతరం అమిత్ షా రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా గడపనున్నారు. ఇటీవల కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త ప్రతినిధులతో ఆయన సమావేశమై, వారికి దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ఒక ప్రత్యేక సదస్సులో పాల్గొన్న అనంతరం, సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్‌డీఏ కూటమి నాయకులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీ శ్రేణులకు ఆయన మార్గనిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కేరళ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అమిత్ షా ‘మిషన్ 2026’ను ఈ పర్యటన ద్వారా లాంఛనంగా ప్రారంభించనున్నారు. 2025లో ఆయన ప్రారంభించిన ‘మిషన్ 2025’ వ్యూహం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో 2026 శాసనసభ ఎన్నికల్లో చారిత్రాత్మక మార్పు తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీతో అమిత్ షా జరిపే చర్చలు అత్యంత కీలకం కానున్నాయి. కేరళలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది.
ఇది కూడా చదవండి: ‘మకర జ్యోతి’కి సర్వం సిద్ధం.. భక్తుల నియంత్రణ ఇలా..


