breaking news
Ananta Padma Nabha Swamy
-
కేరళలో అమిత్ షా.. ‘స్వామి కార్యం.. స్వకార్యం’
తిరువనంతపురం: కేరళ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అటు అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించడంతో పాటు పార్టీ (బీజేపీ) కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. నేడు (ఆదివారం) పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించిన అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి కేరళ చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం రాష్ట్ర బీజేపీ నాయకులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్ల్రాలు ధరించిన అమిత్ షాకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఆరేళ్లకు ఒకసారి జరిగే ‘లక్షదీపం’ ఉత్సవానికి ఆలయం సిద్ధమవుతున్న తరుణంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 14న ఆలయంలో లక్ష దీపాలను వెలిగించే మహోత్సవం జరగనుంది.ఆలయ దర్శనం అనంతరం అమిత్ షా రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా గడపనున్నారు. ఇటీవల కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త ప్రతినిధులతో ఆయన సమావేశమై, వారికి దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ఒక ప్రత్యేక సదస్సులో పాల్గొన్న అనంతరం, సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీ శ్రేణులకు ఆయన మార్గనిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.కేరళ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అమిత్ షా ‘మిషన్ 2026’ను ఈ పర్యటన ద్వారా లాంఛనంగా ప్రారంభించనున్నారు. 2025లో ఆయన ప్రారంభించిన ‘మిషన్ 2025’ వ్యూహం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో 2026 శాసనసభ ఎన్నికల్లో చారిత్రాత్మక మార్పు తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీతో అమిత్ షా జరిపే చర్చలు అత్యంత కీలకం కానున్నాయి. కేరళలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది.ఇది కూడా చదవండి: ‘మకర జ్యోతి’కి సర్వం సిద్ధం.. భక్తుల నియంత్రణ ఇలా.. -
అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో షాకింగ్ ఘటన!
కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి అందరికీ తెలిసిందే. అత్యంత ధనిక ఆలయం అందులోని నేలమాళిగల్లో రాశుల కొద్ది బంగారు, వజ్రవైఢూర్యాలు, స్వర్ణ విగ్రహాలు ఉన్నాయంటూ వార్తల్లో నిలిచింది కూడా. ఈ గుడికి మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. దేవస్థానానికి సంబంధించిన సరస్సులో 'బబియా' అనే శాకాహార మొసలి ఉంటుందని, అది భక్తులు ఇచ్చే పండ్లు, ఫలాహారాలు తప్ప ఇంకేదీ తినదని చెబుతుంటారు. గుడికి వచ్చే పర్యాటకులు ఈ మొసలిని చూసేందుకు తెగ ఆసక్తి కనబరిచేవారు. ఎన్నో ఏళ్లుగా ఆ చెరువులో ఉంటోన్న 'బబియా'.. గత ఏడాది అక్టోబర్ 9, 2022న మరణించిన సంగతి తెలిసిందే. అయితే విచిత్రంగా.. చనిపోయిన 'బబియా' స్థానంలో మరో కొత్త మొసలి ప్రత్యక్షమైందన్న వార్త ఇప్పుడూ హాట్ టాపిక్‌గా మారింది. ఓ మిస్టరీలా మరో మొసలి.. బబియా' మరణించిన ఏడాది తర్వాత మరో మొసలి 4 రోజుల క్రితం అనూహ్యంగా కనపడింది. నవంబర్ 8న సరస్సు వెంబడి ఉన్న ఒక గుహలో ఈ కొత్త మొసలిని కొందరు భక్తులు గుర్తించారు. ఈ విషయం కాస్తా అధికారులకు వరకు చేరడంతో వారు శనివారం ఆ మొసలిని గుర్తించి.. ఆలయ ప్రధాన పూజారికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఐతే ఇది చిన్న మొసలని, ఆలయ పూజారికి విషయం తెలియజేశాం కాబట్టి తదుపరి ఏ చెయ్యాలో ఆయనే నిర్ణయిస్తారని అన్నారు. ఇలా ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి కనబడటం అనివార్యంగా జరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందనేది నేటికి మిస్టరీగానే ఉంది. కాగా, ఇంతకు ముందు చనిపోయిన బబియా అనే మొసలి మూడోది. దీని వయసు 70 ఏళ్లకు పైనే ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఒకప్పుడూ ఈ సరస్సులో పెద్ద మొసలి ఉండేదని దాన్ని ఆంగ్లేయులు కాల్చి చంపేయగా తదుపది ఆ సరస్సులో మరో మొసలి ప్రత్యక్షమైనట్లు ప్రజలు తెలిపారు. అది కూడా చనిపోయాక ఈ బబియా వచ్చింది. అయితే ఈ బబియా శాకాహారి, ఆలయ పూజారి పెట్టే ప్రసాదంతోనే జీవించేది. ఎవరికి హాని తలపెట్టేది కాదు. పైగా ఆ సరస్సులో ఉండే చేపలను కూడా ముట్టదు బబియా. దీనికి "బబియా" అని పేరు ఎవరూ పెట్టారో కూడా ఎవ్వరికీ తెలియదు. అత్యంత గమ్మత్తైన విషయం ఏంటంటే.. . ఈ బబియా అంత్యక్రియలు చూడటానికి రాజకీయ నాయకులతో సహా వేలాది మంది భక్తులు తరలిరావడం కూడా చర్చనీయాంశమయ్యింది. మళ్లీ ఆ మొసలి స్థానంలో మరో మొసలి రావడం అందర్నీ సంబ్రమాశ్చర్యాలకు గురి చేయడమే గాక భాగవత పురాణంలోని గజేంద్ర మోక్ష కథను గుర్తు చేస్తోంది. నిజానికి మొసళ్లు ఉన్నాయనేలా ఆ ఆలయం సమీపంలో నది లేదా సరస్సు కూడా లేదు. కేవలం ఆలయం కోనేరులోనే కనపించడం విచిత్రం అయితే ఎవరికి హాని తలపెట్టకుండా ఉండటం మరో విచిత్రం. (చదవండి: దీపావళిని హిందువుల తోపాటు ఎవరెవరూ జరుపుకుంటారంటే..?) -
రాష్ట్రపతికి రంగరాజన్ లేఖ
సాక్షి, మొయినాబాద్ : కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం కేసు విషయమై చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం సంధానకర్త రంగరాజన్ భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్‌కు లేఖరాశారు. సోమవారం ఈ విషయాన్ని ఆయన విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతపద్మనాభ స్వామి దేవాలయం కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు వాయిదా వేస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికే శబరిమల ఆలయం తీర్పును కోర్టు ధర్మానికి విరుద్ధంగా ఇచ్చిందని మండిపడ్డారు. అదేవిధంగా పూరీ జగన్నాథ్ రథయాత్ర నిర్వహించొద్దని తీర్పు ఇచ్చి.. తర్వాత ప్రజల ఆగ్రహాన్ని గమనించి పరిమిత సంఖ్యలో భక్తులతో రథయాత్ర తీయొచ్చని తన తీర్పును తానే మార్చుకుందన్నారు. ఇలాంటి వాటితో న్యాయస్థానంపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం సన్నగిల్లుతుందని తెలిపారు. హిందూ దేవతల విషయంలో సుప్రీంకోర్టు వ్యవహారశైలి సరిగా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం దేవాలయాల్లో కొలువుండే దైవుళ్లకు అధికారాలు ఏమీ లేవని ఉందని, అందుకే భగవంతుడు కోవిడ్–19 నుంచి భక్తులను కాపాడే అధికారాన్ని కోల్పోయాడేమో అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి తన విశిష్ట అధికారాన్ని వినియోగించుకుని అనంత పద్మనాభ స్వామి దేవాలయం తీర్పును హిందువుల మనోభావాలకు అనుగుణంగా వెలువరించే విధంగా సుప్రీంకోర్టును ఆదేశించాలని కోరుతూ లేఖ రాశానని వెల్లడించారు. -
అనంతుని సేవలో ఏసీబీ డెరైక్టర్
అనంతగిరిగుట్టలోని శ్రీ అనంతపద్మనాభస్వామి వారిని ఆదివారం రాష్ట్ర ఏసీబీ డెరైక్టర్ ప్రసాద్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రసాద్‌రావుకు తీర్థప్రసాదాలను అందించి స్వామివారి మహిమను, ఆలయ చరిత్రను ఆయనకు వివరించి శాలువాతో సన్మానించారు. ప్రసాద్‌రావు వెంట జిల్లా ఎస్పీ రాజకుమారి, డీఎస్పీ నర్సింలు, సీఐ లచ్చీరాంనాయక్, ఎస్ఐ రమేష్, ఆలయ ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు, మేనేజర్ శేఖర్‌గౌడ్ తదితరులున్నారు.


