పిరికిపందలు.. మా గొంతు నొక్కాలని చూశారు: దీప్కే సంచలన వ్యాఖ్యలు | CJP claims Instagram account Related Issue after being taken down | Sakshi
Sakshi News home page

పిరికిపందలు.. మా గొంతు నొక్కాలని చూశారు: దీప్కే సంచలన వ్యాఖ్యలు

Aug 15 2026 8:07 AM | Updated on Aug 15 2026 8:07 AM

CJP claims Instagram account Related Issue after being taken down

ముంబై: కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే శనివారం సంచలన ఆరోపణలు చేశారు. సీజేపీ ఉద్యమానికి సంబంధించిన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను మెటా తొలగించిందని ఆయన ఆరోపించారు. ఖాతా అందుబాటులో లేదని చూపిస్తున్న స్క్రీన్‌షాట్లను కూడా సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

ఈ సందర్భంగా అభిజీత్‌ దీప్కే ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘కాక్రోచ్‌ జనతా పార్టీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌ను తొలగించారు. పిరికిపందలు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన షేర్‌ చేసిన స్క్రీన్‌షాట్లలో సీజేపీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ అందుబాటులో లేదని, ‘User not found’ అనే సందేశం కనిపించింది. దీంతో మెటానే తమ ఖాతాను తొలగించిందని ఆయన ఆరోపించారు.

ఈ పరిణామంపై సీజేపీ అధికారిక ఎక్స్‌ ఖాతా కూడా స్పందించింది. తమ ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌ను ఉదయం తొలగించారని, అయితే కొద్దిసేపటికే ఖాతాను విజయవంతంగా తిరిగి పొందామని వెల్లడించింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజునే తమ గొంతును నొక్కేందుకు ప్రయత్నించారని పార్టీ ఆరోపించింది. తమను వ్యతిరేకించే వారు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించింది. ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని స్పష్టం చేసింది. అయితే సీజేపీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తాత్కాలికంగా ఎందుకు అందుబాటులో లేకుండా పోయిందనే విషయంపై మెటా నుంచి అధికారిక వివరణ వెలువడినట్లు సమాచారం లేదు.

అభిజీత్‌ దీప్కే సోషల్‌ మీడియా ఖాతాలకు సంబంధించిన వివాదం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మేలో తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా హ్యాక్‌ అయిందని ఆయన ఆరోపించారు. తన ఖాతాలోకి ప్రవేశించలేకపోతున్నానని, తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదని అప్పట్లో ఎక్స్‌లో పేర్కొన్నారు. సీజేపీ కోసం ఉపయోగిస్తున్న బ్యాకప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను కూడా మెటా తొలగించిందని ఆయన ఆరోపించారు.

‘స్కూల్‌ ఠీక్‌ కరో’ 
ఇదిలా ఉండగా, గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, జవాబుదారీతనాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో సీజేపీ ‘స్కూల్‌ ఠీక్‌ కరో’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలోని దీప్కే స్వగ్రామం సంతుక్‌ పింప్రిలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. శనివారం ఉదయం ఈ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది. తన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను మరమ్మతులు చేయించి, విద్యార్థులకు బెంచీలు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని సర్పంచ్‌ను కోరనున్నట్లు దీప్కే తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇతర గ్రామాలకూ విస్తరించేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామస్థులు, సర్పంచ్‌ల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుతున్న పాఠశాలలను స్వయంగా సందర్శించి, అక్కడ ఏవైనా సౌకర్యాల కొరత ఉంటే CJPకి సమాచారం ఇవ్వాలని దీప్కే పిలుపునిచ్చారు. దీంతో సోషల్‌ మీడియా ఖాతా వివాదం మధ్యే గ్రామీణ పాఠశాలల సమస్యలపై ‘స్కూల్‌ ఠీక్‌ కరో’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లేందుకు CJP సిద్ధమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement