ప్యూ రీసెర్చ్ వెల్లడి
ప్రమాదమన్న భావనే ఎక్కువ
పాక్‌లో మిత్రదేశంగా చైనా
భారత్ మిత్రదేశంగా రష్యా
వాషింగ్టన్: భారతీయ, పాకిస్థానీ ప్రజలు ఒకరినొకరు అతిపెద్ద ప్రమాదంగా పరిగణిస్తారని, ఇరు దేశాల ప్రజల మధ్య లోతైన అపనమ్మకం గూడుకట్టుకుని ఉందని అమెరికా థింక్‌ట్యాంక్ ప్యూ రీసెర్చ్ చేసి సర్వే స్పష్టం చేసింది. భారత్‌లో సర్వే చేసిన వారిలో 54% మంది పాకిస్థాన్‌ను పెద్ద శత్రువుగా భావిస్తూంటే.. చైనా అతిపెద్ద శత్రువని అనుకుంటున్న వారు 21% మంది ఉన్నారు.
పాకిస్థాన్ విషయానికి వస్తే...ఇక్కడ సర్వే చేసిన వారిలో 43 % మంది మాత్రమే భారత్‌తో తమకు ముప్పు అన్న భావనతో ఉన్నారు ఇజ్రాయెల్, చైనాలతో ప్రమాదం అనే వారు చెరో 24% మంది ఉండటం గమనార్హం. అదే సమయంలో చైనా తమకు అత్యంత ముఖ్యమైన దేశంగా భావిస్తున్నా పాకిస్థానీలు 75% వరకూ ఉండగా, సౌదీ అరేబియా 12% రెండో స్థానంలో ఉంది.
మిత్రదేశాల విషయంలో భారత్ ఇప్పటికీ రష్యాపై విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 36% మంది రష్యాను టాప్ మిత్రదేశంగా పరిగణిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాను ‘ఫ్రెండ్’గా భావిస్తున్నది 16% మంది మాత్రమే. మడొంతుల మంది భారత్‌కు అతిపెద్ద మిత్రదేశం ఏదన్న ప్రశ్నకు సమాధానమే ఇవ్వకపోవడం విశేషం.
ట్రంప్‌పై పాక్‌లో నమ్మకం తక్కువే...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్‌ల మధ్య స్నేహ సంబంధాలు బాగానే ఉన్నా పాకిస్తానీలలో కేవలం 15% మంది మాత్రమే అమెరికా పట్ల సదభిప్రాయం కలిగి ఉన్నట్లు ఈ సర్వే తెలిపింది. తొంభై శాతం ఆమోదంతో చైనా మొదటి స్థానంలో ఉంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో ట్రంప్ సరైన పని చేస్తారని 88% మంది పాకిస్థానీలు నమ్మడం లేదు. అదే సమయంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అనుకూలంగా 83% మంది మాట్లాడారు.
భారతీయుల్లో రష్యా హవా...
భారతీయులు రష్యా (58%), అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (51%)పై ఎక్కువ నమ్మకం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌తో పోలిస్తే చాలా ఎక్కువ మంది రష్యాకు అనుకూలంగా ఉన్నట్లు తెలిసింది. ఇక భారత్‌లో చైనాకు అనుకూలంగా ఉన్న వారు 23% మంది మాత్రమే కాగా.. 25% మంది షీ జిన్‌పింగ్ ప్రపంచ నాయకత్వంపై నమ్మకం ఉంచారు. భారతీయుల్లో అమెరికాపై విశ్వాసం ఉన్న వారు 45% కాగా.. ట్రంప్‌పై నమ్మకం వ్యక్తం చేసినవారు 39% మంది మాత్రమే.
దక్షిణాసియాలోని నాలుగు దేశాల్లో సర్వే: వైవిధ్యమైన ఫలితాలు
భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలలో నిర్వహించిన ఈ సర్వే వైవిధ్యమైన ఫలితాలిచి్చంది. శ్రీలంకలో 79% మంది భారత్‌పై సానుకూల అభిప్రాయం ఉండగా బంగ్లాదేశ్‌లో ఈ సంఖ్య 42%, పాకిస్తాన్‌లో ఏడు% మాత్రమే. లంకేయుల్లో 63% మంది భారత్‌ను తమ మిత్రదేశంగా చెప్పుకుంటే బంగ్లాదేశ్, పాకిస్తానీల్లో అధికులు భారత్‌తో తమకు ప్రమాదం అన్న భావనను వ్యక్తం చేశారు.
అమెరికాలో ఏమంటున్నారు?
అమెరికాలో 45% మంది మన దేశంపై సానుకూల అభిప్రాయం కలిగి ఉన్నట్లు ప్యూ రీసెర్చ్ నిర్వహించిన ఈ సర్వే ద్వారా స్పష్టమైంది. అయితే సుమారు 50% మంది వ్యతిరేక అభిప్రాయంతో ఉండటం గమనార్హం. డెమోక్రాట్ల మద్దతుదారులు, సానుభూతిపరుల్లో సగం మంది భారత్‌పై సదభిప్రాయం ఉంది. రిపబ్లికన్ల విషయానికి వస్తే ఈ సంఖ్య 42% మాత్రమే. అంతర్జాతీయంగా భారత్ ప్రభావం కొన్నేళ్లుగా ఒకేస్థాయిలో ఉందని 54% మంది అమెరికన్లు చెబితే 30% మంది పెరుగుతోందని, 13% మంది తగ్గుతోందని చెప్పారు.


