ఒకప్పుడు బ్యాంకులో డబ్బు కోసం క్యూ.. ఇప్పుడు ఫోన్‌లోనే డబ్బు. ఒకప్పుడు ఉత్తరం కోసం రోజులు.. ఇప్పుడు క్షణాల్లో వీడియో కాల్. కానీ.. సామాన్యుడి జేబులో మిగిలేది ఎంత?
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటికి ఒక సాధారణ భారతీయుడి జీవితాన్ని ఊహించుకుంటే.. మట్టి ఇల్లు, కిరోసిన్ దీపం, ఎద్దుల బండి, రేషన్ దుకాణం, ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాలకు వెళ్లే కొద్దిమంది పిల్లలు కనిపిస్తారు. దేశం ముందున్న లక్ష్యం ఒక్కట.. ఎలాగైనా బతకాలి, దేశాన్ని నిలబెట్టాలి.
80 ఏళ్ల తర్వాత అదే దేశాన్ని చూస్తే దృశ్యం పూర్తిగా మారిపోయింది.
ఒకప్పుడు ఇంట్లో టెలిఫోన్ ఉండటం గొప్ప విషయం. ఫోన్ చేయాలంటే పక్కింటికో, పోస్టాఫీసుకో వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు చేతిలో ఉన్న చిన్న మొబైల్‌నే బ్యాంకు, టీవీ, కెమెరా, పుస్తకం, టికెట్ కౌంటర్.. అన్నీ అయిపోయాయి. డబ్బు పంపడానికి బ్యాంకు క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. కొన్ని సెకన్లలోనే చెల్లింపు పూర్తవుతోంది.
ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయంలో ఒక సర్టిఫికెట్ కోసం రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అదే పని చాలావరకు ఇంట్లో కూర్చునే చేయగలుగుతున్నాం. రైల్వే టికెట్ కోసం స్టేషన్ క్యూలో నిలబడిన రోజులు పోయాయి. పిల్లల చదువు నుంచి ఉద్యోగ దరఖాస్తుల వరకు.. డిజిటల్ ప్రపంచం సామాన్యుడి చేతిలోకి వచ్చింది. కానీ కథ ఇక్కడితో పూర్తికాదు.
దేశం ఎదిగింది.. మరి సామాన్యుడి జేబు కూడా అదే స్థాయిలో ఎదిగిందా?.ఇదే అసలు ప్రశ్న. నగరాల్లో జీతాలు పెరిగాయి. కానీ ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, వైద్యం, ప్రయాణ ఖర్చులు కూడా పెరిగాయి. ఒకప్పుడు నెల జీతంతో కుటుంబాన్ని నడిపిన తండ్రి.. ఇప్పుడు ఇద్దరి సంపాదన వచ్చినా నెలాఖరుకు లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి. మధ్యతరగతి కుటుంబానికి ‘సొంత ఇల్లు’ ఇప్పటికీ పెద్ద కలగానే ఉంది.
గ్రామాల్లోనూ మార్పు వచ్చింది. రోడ్లు వచ్చాయి. కరెంట్ వచ్చింది. మొబైల్ వచ్చింది. ఇంటర్నెట్ వచ్చింది. కానీ వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబానికి వాతావరణం, పంట ధర, అప్పులు ఇంకా పెద్ద సవాళ్లే. చదువుకున్న యువకుడికి గ్రామంలో ఉద్యోగం లేకపోతే.. నగరానికి వెళ్లాల్సిందే.
అయినా 80 ఏళ్ల ప్రయాణాన్ని తక్కువ చేసి చూడలేం. ఒకప్పుడు ఆకలితో పోరాడిన దేశం.. నేడు ప్రపంచానికి ఆహారం, ఔషధాలు, సాంకేతిక సేవలు అందించే స్థాయికి వచ్చింది. ఒకప్పుడు విదేశాలపై ఆధారపడిన దేశం.. నేడు అంతరిక్షంలో తన జెండాను ఎగురవేస్తోంది. ప్రపంచంలోని పెద్ద దేశాలతో భారత్ సమానంగా మాట్లాడుతోంది.
అయితే స్వాతంత్ర్యానికి అసలు కొలమానం జీడీపీ కాదు. స్టాక్ మార్కెట్ కాదు. భారీ భవనాలు కాదు. ఒక పేద తల్లి తన పిల్లాడిని మంచి స్కూల్లో చదివించగలుగుతుందా? ఒక రైతు తన పంటకు గిట్టుబాటు ధర పొందుతున్నాడా?. ఒక సాధారణ కుటుంబం అనారోగ్యం వస్తే అప్పులపాలు కాకుండా చికిత్స పొందగలుగుతుందా?. ఒక యువకుడికి తన ఊర్లోనే గౌరవంగా బతికే ఉద్యోగం దొరుకుతుందా?
ఈ ప్రశ్నలకు సమాధానమే.. రాబోయే భారతదేశం ఎలా ఉండాలో చెబుతుంది. 80 ఏళ్ల క్రితం మన పెద్దలు దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం తెచ్చారు. వచ్చే తరాల బాధ్యత మాత్రం మరో స్వాతంత్ర్యం తీసుకురావడం.. పేదరికం నుంచి, నిరుద్యోగం నుంచి, ఆకలి నుంచి, అన్యాయం నుంచి సామాన్యుడికి స్వేచ్ఛ. అప్పుడే ఆగస్టు 15న ఎగిరే జెండా.. ప్రతి ఇంటి జీవితంలోనూ నిజమైన అర్థాన్ని సంతరించుకుంటుంది.


