జనాభా లెక్కల్లో తొలిసారిగా కుల వివరాల సేకరణ
నలభై ప్రశ్నలతో జాబితా
నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారత్‌లో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఇందుకు సంబంధించిన 40 ప్రశ్నలను అధికారికంగా నోటిఫై చేసింది. మొట్టమొదటిసారి కులంతోపాటు కోవిడ్ టీకా వేయించుకున్న ప్రదేశం వివరాలను కూడా సేకరించనున్నారు.
జమ్మూ కశ్మీర్, లడాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని మంచుతో కూడిన ప్రాంతాల్లో వచ్చే సెపె్టంబరు ఒకటవ తేదీ నుంచే పాపులేషన్ ఎన్యూమరేషన్ దశ మొదలవుతుందని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు స్పష్టం చేసింది.
రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ సారి జనాభా లెక్కల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ లేదా ఇతర కులాల వివరాలు తెలుసుకోనున్నారు. ప్రజలు తమంతట తామే వివరాలు సమరి్పంచేందుకు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ఆగస్టు 17 నుంచి 31 వరకు అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జనాభా లెక్కింపు (పీఈ) వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది.
తాజా జనాభా లెక్కల్లో భాగంగా తొలిసారి కులం వివరాలు సేకరిస్తున్నప్పటికీ అడిగే ప్రశ్నల్లో కులాల జాబితా ఏదీ ఉండే అవకాశం లేదు. ప్రజలు ఇచ్చే సమాధానాన్ని నేరుగా నమోదు చేస్తారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. గత ఏడాది ఏప్రిల్ 30న కులాల వారీ జనాభా వివరాలు సేకరించాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ సమావేశం తీర్మానించిన సంగతి తెలిసిందే.
వచ్చే ఏడాది జరగనున్న సెన్సస్–2027కు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇళ్ల జాబితా, లెక్కల సేకరణ కోసం అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపారు. ఎన్యూమరేటర్లు అన్ని రకాల ఇళ్లు, నిర్మాణాల వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంలోనే అధికారులు ఒక్కో ఇల్లు/భవనాన్ని సందర్శించి మౌలిక సదుపాయాలకు సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు. పదేళ్లకు ఒకసారి జరిపే జనాభా లెక్కలు వాస్తవానికి 2021లోనే మొదలు కావాల్సి ఉన్నా అప్పట్లో కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం సెన్సస్–2027 కోసం రూ.11,718 కోట్లు కేటాయించింది.
ప్రభుత్వ ఉద్దేశాలపై అనుమానాలు: కాంగ్రెస్
జనాభా లెక్కల్లో భాగంగా కులాల వివరాలు కూడా సేకరించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఆక్షేపణ తెలిపింది. కులాల జాబితా ఆధారంగా కాకుండా స్పందనలను మాత్రమే నమోదు చేయడం అనుమానాలు రేకెత్తిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఎక్స్ వేదికగా విమర్శించారు. ఈ అంశంపై అధికార పక్షం ఏ రాజకీయ పారీ్టతోనూ చర్చించలేదని ఆరోపించింది. బిహార్, తెలంగాణల్లో మాదిరిగానే సిద్ధంగా ఉన్న కులాల జాబితా సాయంతో జనాభా లెక్కలు నిర్వహిస్తారని ఆశించామని అందుకు భిన్నంగా జరుగుతూండటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా గత ఏడాది ప్రధాని మోదీకి రాసిన లేఖలో తెలంగాణ మోడల్‌ను అనుసరించాలని, అన్ని రాజకీయ పారీ్టలతో చర్చించాలని కోరారని, ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదని విమర్శించారు.
ఇవీ ప్రశ్నలు..
→ వ్యక్తిగత, జనాభా వివరాలు
వ్యక్తి పేరు
ఇంటి యజమాని
స్త్రీ లేదా పురుషుడు?
పుట్టిన తేదీ, వయసు (పూర్తయిన సంవత్సరాల్లో)
ప్రస్తుత వైవాహిక స్థితి
వివాహమై ఎంత సమయం? (పూర్తయిన సంవత్సరాల్లో)
భార్య/భర్త పేరు
జాతీయత (ప్రకటించిన విధంగా)
మతం
షెడ్యూల్డ్ కులం (ఎస్సీ)/షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ)/కులం
తండ్రి వివరాలు
తల్లి వివరాలు
వైకల్యం స్థితి (ఏదైనా ఉంటే)
మాతృభాష, తెలిసిన ఇతర భాషలు
→ విద్య
అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత స్థితి
విద్యాసంస్థలో హాజరు (ప్రస్తుత స్థితి)
సాధించిన అత్యున్నత విద్యా స్థాయి
విద్యా శాఖ/విభాగం
→ ఉపాధి, ఆర్థిక కార్యకలాపాలు
గత ఏడాదిలో ఏ సమయంలోనైనా పనిచేశారా
ఆర్థిక కార్యకలాపాల వర్గం
వృత్తి
పరిశ్రమ/వ్యాపారం/సేవల స్వభావం
కారి్మక వర్గం
ఆర్థికేతర కార్యకలాపం (మార్జినల్, సెమీ మార్జినల్, నాన్‌వర్కింగ్)
పని కోసం చూస్తున్నారా?/అందుబాటులో ఉన్నారా (మార్జినల్, సెమీ మార్జినల్, నాన్‌వర్కింగ్)
పని చేసే చోటికి ప్రయాణం అవసరమా?
→ వలసలు, నివాసం
పుట్టిన స్థలం
చివరి నివాస ప్రదేశం
వలసకు కారణం
ప్రస్తుత గ్రామం/పట్టణంలో ఉన్న కాలం
శాశ్వత నివాస చిరునామా
→ సంతాన సాఫల్యం,
కుటుంబం (మహిళలకు)
ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల సంఖ్య
ఇప్పటి వరకు పుట్టిన మొత్తం పిల్లల సంఖ్య
(వివాహిత, వితంతువు, విడాకులు తీసుకున్న, వేరుపడిన మహిళలకు)
గత ఏడాదిలో జని్మంచిన శిశువుల సంఖ్య
(వివాహిత మహిళలకు మాత్రమే)
→ ఆరోగ్యం, గుర్తింపు
కోవిడ్–19 టీకా వేయించుకున్న ప్రదేశం
మొత్తం బ్యాంకు ఖాతాల సంఖ్య
మొబైల్ నంబర్ (ఉంటే)
ఆధార్ నంబర్ (ఉంటే)
ఓటర్ ఐడీ నంబర్ (ఉంటే)
పాస్‌పోర్ట్ నంబర్ (భారత పాస్‌పోర్ట్ ఉంటే), డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా?


