‘నన్నే ఆపుతావా?’.. పోలీసు అధికారిణిపై ఎమ్మెల్యే కుమార్తె దాడి | Karnataka BJP MLA Daughter Slaps Woman Police Officer | Sakshi
Sakshi News home page

‘నన్నే ఆపుతావా?’.. పోలీసు అధికారిణిపై ఎమ్మెల్యే కుమార్తె దాడి

Aug 15 2026 12:04 AM | Updated on Aug 15 2026 12:06 AM

Karnataka BJP MLA Daughter Slaps Woman Police Officer

సాక్షి,బెంగళూరు: కర్ణాటకలోని మాండ్య జిల్లాలో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. తుమకూరు రూరల్ బీజేపీ ఎమ్మెల్యే బి. సురేష్ గౌడ కుమార్తె ఐశ్వర్య, శ్రీరంగపట్టణంలోని ప్రసిద్ధ ఆరతి ఉక్కడ ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిణిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. భీమన అమావాస్య సందర్భంగా చోటుచేసుకుంది.

ఆగస్టు 12న భీమన అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరంగపట్టణంలోని ఆరతి ఉక్కడ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో తీవ్రమైన రద్దీ నెలకొన్న తరుణంలో గర్భాలయంలోకి ప్రవేశించడానికి అందరూ నిబంధనల ప్రకారం కొంత సమయం వేచి ఉండాలని అధికారులు సూచించారు.

ఈ క్రమంలో ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే కుమార్తె ఐశ్వర్యను నిబంధనల ప్రకారం వేచి ఉండాలని అక్కడ విధి నిర్వహణలో ఉన్న మహిళా పీఎస్ఐ సవిత కోరారు. ఒక్కసారిగా అందరినీ లోపలికి అనుమతిస్తే భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని ఆమె వివరించడానికి ప్రయత్నించారు.

అయితే, దీనిపై ఐశ్వర్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే కుమార్తెనని చెబుతూ పోలీస్ అధికారిణితో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, అనుచిత పదజాలం ఉపయోగించినట్లు పీఎస్ఐ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విధులు నిర్వర్తిస్తున్న తనను అడ్డుకుంటున్నారనే కోపంతో ఐశ్వర్య పీఎస్ఐ సవితను చెంపదెబ్బ కొట్టారని, అంతేకాకుండా ఆమె కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించారని సమాచారం.

పోలీసుల కేసు నమోదు 
ఈ ఘటనపై బాధితురాలైన పీఎస్ఐ సవిత మాండ్య మహిళా పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా  యాతనహళ్ళి పోలీస్ స్టేషన్‌లో ఐశ్వర్యపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్  నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై ప్రతిస్పందించిన ఐశ్వర్య కూడా పోలీస్ అధికారిణి తనతో అసభ్యంగా,దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులకు తిరుగు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యురాలు పోలీసులపై దాడి చేశారనే ఆరోపణలు రావడంతో ఈ ఉదంతం కర్ణాటక రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement