టాప్‌ 100 పోలీస్‌ చీఫ్‌లలో ఇద్దరు తెలుగు అధికారులు | India Asia Post Names 100 Best Police Chiefs of India: Telugu Officers Featured | Sakshi
Sakshi News home page

టాప్‌ 100 పోలీస్‌ చీఫ్‌లలో ఇద్దరు తెలుగు అధికారులు

Aug 14 2026 12:40 PM | Updated on Aug 14 2026 1:08 PM

india asia post names 100 best police chiefs of india

న్యూఢిల్లీ: దేశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్‌ నాయకత్వాన్ని గుర్తిస్తూ ఫేమ్‌ ఇండియా, ఏషియా పోస్ట్‌ సంయుక్తంగా  100 మంది ఉత్తమ పోలీస్‌ చీఫ్‌ల జాబితాను విడుదల చేశాయి. వీరిలో వి.వి.రాకేష్ రెడ్డి పి.(ఎస్.పి.గోల్పారా).. అసోం, గుండాలరెడ్డి రాఘవేంద్ర (ఎస్పీ ఝార్సుగూడ), ఒడిషా ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు చోటు దక్కించుకున్నారు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు అనుకూలమైన పోలీసింగ్‌, సాంకేతికత వినియోగం, పారదర్శక పరిపాలన, సంక్షోభ సమయాల్లో వేగవంతమైన నిర్ణయాలు, ప్రజలతో విశ్వాసపూర్వక సంబంధాలు వంటి అంశాల్లో విశేషంగా పనిచేసిన అధికారులను ఈ జాబితాకు ఎంపిక చేశారు.

ఒక సమాజం నిజమైన అభివృద్ధి సాధించాలంటే ప్రజలు సురక్షితంగా ఉన్నామనే భావన కలిగి ఉండాలని, ఆ భద్రతే విద్య, వ్యాపారం, పరిశ్రమలు, సామాజిక జీవితం సజావుగా ముందుకు సాగేందుకు పునాదిగా నిలుస్తుందని ఫేమ్‌ ఇండియా పేర్కొంది. చట్టవ్యవస్థను కాపాడటం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన వెన్నుముకగా పనిచేస్తుందని తెలిపింది. జిల్లా పోలీస్‌ చీఫ్‌లు, ప్రధాన పోలీస్‌ విభాగాల అధిపతులు ఎస్పీ, ఎస్‌ఎస్‌పీ, డీసీపీ, కమిషనర్‌ వంటి హోదాల్లో ఉన్నప్పటికీ వారి బాధ్యతలు అత్యంత విస్తృతంగా ఉంటాయంది. 

నేరాలను నియంత్రించడం, మహిళలు-పిల్లలకు రక్షణ కల్పించడం, సైబర్‌ నేరాలు-సంఘటిత నేరాలను అరికట్టడం, ట్రాఫిక్‌ను నిర్వహించడం, సంక్షోభ పరిస్థితుల్లో వేగంగా స్పందించడం వంటి బాధ్యతలతో పాటు ప్రజల విశ్వాసాన్ని కూడా వారు సంపాదించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఫేమ్‌ ఇండియా ఎడిటర్‌ ధీరజ్‌ కుమార్‌ మాట్లాడుతూ, నిర్మాణాత్మక జర్నలిజాన్ని ప్రోత్సహించడం తమ సంస్థ లక్ష్యాల్లో భాగమని, సమాజంపై సానుకూల ప్రభావం చూపుతున్న పరిపాలకులు, ప్రజాసేవకుల పనితీరును వెలుగులోకి తీసుకురావడంలో ఫేమ్‌ ఇండియా చాలాకాలంగా కృషి చేస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా చట్టవ్యవస్థను పర్యవేక్షిస్తున్న అనేక మంది జిల్లా పోలీస్‌ చీఫ్‌లు, యూనిట్‌ అధిపతుల నుంచి 100 మందిని ఎంపిక చేయడం కష్టమైన ప్రక్రియని పేర్కొన్నారు.

ఫేమ్‌ ఇండియా మేనేజింగ్‌ ఎడిటర్‌ అనిల్‌ సింగ్‌ మాట్లాడుతూ, ఈ సర్వే నిరంతర ప్రక్రియ అని, అధికారుల పనితీరు, ప్రజాసేవా రికార్డును భవిష్యత్తులోనూ పరిశీలిస్తామని చెప్పారు. తదుపరి దశలో ఈ 100 మంది నుంచి భారత్‌లోని టాప్‌ 25 పోలీస్‌ చీఫ్‌లను ఎంపిక చేసి, ఫేమ్‌ ఇండియా రాబోయే సంచికలో ప్రచురించనుంది. ఎంపికయ్యే ఆ 25 మంది అధికారులకు ప్రత్యేక సన్మానాలు కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

కాగా ఈ గౌరవంపై గుండాలరెడ్డి రాఘవేంద్ర స్పందించారు. “ఇది మొత్తం జార్సుగూడ పోలీసు కుటుంబం సాధించిన సమిష్టి విజయం. వృత్తి నైపుణ్యం, సున్నితత్వం, సాంకేతికత, వినూత్న ఆలోచనలతో ప్రజలకు సేవ చేయడంతో పాటు నేరాలపై ఏమాత్రం సహనం లేకుండా పనిచేయడమే మా లక్ష్యం” అని రాఘవేంద్ర తెలిపారు.

గుండాల రెడ్డి రాఘవేంద్ర నేపథ్యం
జార్సుగూడ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న , ఐపీఎస్‌ దేశవ్యాప్తంగా అత్యుత్తమంగా పనిచేస్తున్న టాప్‌ 100 ఐపీఎస్‌ అధికారులలో గుర్తింపు పొందారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సాంకేతికత ఆధారిత దర్యాప్తు, ముందస్తు నేర నియంత్రణ, మాదకద్రవ్యాల కట్టడి, సైబర్‌ నేరాల ఛేదన, కేసుల వేగవంతమైన దర్యాప్తు, బలహీన వర్గాల రక్షణతో పాటు పోలీసులపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంపై రాఘవేంద్ర ప్రత్యేక దృష్టి సారించారు.  ఆయన నాయకత్వంలో జార్సుగూడ పోలీసులు రాష్ట్రంలోని జిల్లా వారీ ప్రగతి డ్యాష్‌బోర్డ్‌లో మొదటి స్థానం, తప్పిపోయిన చిన్నారులను గుర్తించడంలో 95.7 శాతం ట్రేసింగ్‌ రేటు సాధించడంతో పాటు హత్యలు, దోపిడీలు, ఏటీఎం కేసులను విజయవంతంగా ఛేదించారు. అలాగే భారీగా మాదకద్రవ్యాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు పోక్సో, ఇతర కీలక క్రిమినల్‌ కేసుల్లో దోషులకు శిక్షలు పడేలా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement