బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె పేరుతో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న అశ్లీల, అభ్యంతరకర, డీప్‌ఫేక్, ఏఐ ఆధారిత కంటెంట్‌పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసినప్పటికీ.. సోషల్ మీడియాలోని అన్ని ఫ్యాన్ క్లబ్‌లు, అభిమానుల పేజీలను ఒకేసారి తొలగించాలన్న అభ్యర్థనకు మాత్రం అంగీకరించలేదు.
ప్రతి ఫ్యాన్ పేజీని నిషేధించలేం
జాన్వీ కపూర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం.. ఆమె పేరు, ఫొటోలు, రూపాన్ని ఉపయోగించి అభ్యంతరకర వ్యాఖ్యలు, ఆన్‌లైన్ దూషణలు, మార్ఫింగ్ చేసిన చిత్రాలు, డీప్‌ఫేక్ వీడియోలు, ఏఐ ద్వారా రూపొందించిన అశ్లీల కంటెంట్ వివిధ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం అవుతున్నట్లు ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి వేలాది వెబ్ లింకులను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 5,000 ఆన్‌లైన్ పేజీలకు సంబంధించిన అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించే దిశగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అయితే ఇదే సమయంలో జాన్వీ కపూర్‌కు సంబంధించిన ప్రతి ఫ్యాన్ పేజీని చట్టవిరుద్ధమైనదిగా పరిగణించడం సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. అభిమానుల కోసం, వారి అభిమానం వ్యక్తం చేయడానికి మాత్రమే కొన్ని పేజీలు నిర్వహిస్తుండొచ్చని పేర్కొంది. అందువల్ల అన్ని ఫ్యాన్ క్లబ్‌లు, అభిమానుల పేజీలపై నిషేధం విధించడం సరికాదని స్పష్టం చేసింది.
అభిమానులు వద్దా?
విచారణ సందర్భంగా కోర్టు.. ‘మీకు అభిమానులు వద్దా?’ అని ప్రశ్నించింది. ఒక వ్యక్తిపై విమర్శలు చేయడం, అభిప్రాయాలు వ్యక్తం చేయడం, అభిమానంతో ఫ్యాన్ పేజీ నిర్వహించడం వంటి అంశాలను నేరుగా వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనగా చూడలేమని కోర్టు అభిప్రాయపడింది. అయితే అదే పేరుతో అశ్లీల లేదా తీవ్రంగా అభ్యంతరకరమైన కంటెంట్‌ను రూపొందించి ప్రచారం చేస్తే మాత్రం దానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే విమర్శలు, ఆన్‌లైన్ వ్యాఖ్యల విషయంలోనూ కోర్టు విస్తృత దృక్పథాన్ని ప్రస్తావించింది. వ్యక్తిత్వ హక్కుల పేరుతో ఇంటర్నెట్‌లోని ప్రతి విమర్శనాత్మక పోస్టును తొలగించడం సాధ్యం కాదనే అంశాన్ని కోర్టు స్పష్టం చేసింది.


