మన భారతదేశంలో ఎందరో గొప్ప మహారాజులు ఉన్నారు. వాళ్ల గురించి మన చిన్నారులు మాట్లాడితేనే సంబరపడిపోతాం. అప్పుడే వీళ్లకి చరిత్ర గురించి ఎంతో తెలుసు అని గర్వంగా ఫీలవుతాం. అలాంటిది వేరే దేశంలోని ఓ పాఠశాల విద్యార్థి నోట వింటే..కచ్చితంగా విస్తుపోతాం కదా.!. అచ్చం అలాంటి సంఘటన చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
అది తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో ఒక పాఠశాలలో రికార్డు చేసిన వీడియోగా తెలుస్తోంది. ఆ వీడియోలో ఒక బాలుడు భారతీదేశానికి చెందిన ప్రముఖ మహారాజు, మరాఠాల ఆరాధ్య దైవం అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఎంత చక్కగానో ప్రసగించడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ బాలుడు తన ప్రసంగంలో ప్రజల కోసం, న్యాయం కోసం నిలబడిన వీరుడిగానూ, మహిళలను గౌరవప్రదంగా చూసే ధైర్యవంతమైన పాలకుడిగా పరిచయం చేసిన విధానం అందర్నీ ఆకట్టుకుంటుంది.
చాలా సరళంగా స్పష్టంగా వివరించే విధానం అందరి మనసులను తాకుతుంది. శివాజీ తన దేశాన్ని, ప్రజలను ప్రేమించే పాలకుడిగా వర్ణించి చెబుతాడు. ఆ రాజు న్యాయం, స్వేచ్ఛ కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టేవాడని అద్భుతంగా చెబుతాడు వీడియోలో. చివరగా "ధైర్యంగా ఉండండి, దయగా ఉండండి, మీదేశం పట్ల గర్వపడండి". అని శివాజీ సందేశం ఇస్తూ.."జై భవానీ, జై శివాజీ" అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు ఆ విద్యార్థి.
ఆఫ్రికాలోని ఒక తరగతి గదిలో ఒక బాలుడు మహారాష్ట్రకు చెందిన ఒక చారిత్రక వ్యక్తి గురించి మాట్లాడటం భారతీయులందర్నీ భావోద్వేగానికి గురిచేసింది. ముఖ్యంగా మరాఠాకు చెందిన వ్యక్తులు ఆ విద్యార్థి ప్రయత్నాన్ని స్వాగతించడమే గాక చారిత్రక వ్యక్తులు కథలు, విలువలు విద్య ద్వారా సరిహద్దులు దాటగలవని చెప్పే అపురూపమైన క్షణంగా అభివర్ణిస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు.
(చదవండి: 79 ఏళ్ల తర్వాత..మా ఊరికి బస్సొచ్చిందహో!)


