బీజేపీకి బిగ్‌ షాక్.. ‘ఎయిర్‌పోర్టుకు పడవలు వస్తాయా?’ | SP Akhilesh Yadav Satirical Comments Noida Airport Floods | Sakshi
Sakshi News home page

బీజేపీకి బిగ్‌ షాక్.. ‘ఎయిర్‌పోర్టుకు పడవలు వస్తాయా?’

Aug 12 2026 11:23 AM | Updated on Aug 12 2026 11:54 AM

SP Akhilesh Yadav Satirical Comments Noida Airport Floods

నోయిడా: ఆకాశంలో ఎగరాల్సిన విమానాశ్రయం.. వర్షం పడితే నీట మునిగింది. ప్రారంభించి ఐదు నెలలు కూడా పూర్తికాకముందే రూ.11,200 కోట్లతో నిర్మించిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ వర్షానికి టెర్మినల్‌-పార్కింగ్ మార్గంలో నీరు నిలిచిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దీంతో ‘అభివృద్ధి మోడల్’గా ప్రచారం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఇది ఊహించని ఎదురుదెబ్బగా మారింది.

మంగళవారం గ్రేటర్ నోయిడాలో భారీ వర్షం కురిసింది. వర్షం దెబ్బకు జేవర్‌లోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో టెర్మినల్‌ నుంచి పార్కింగ్ ప్రాంతానికి వెళ్లే మార్గం నీటితో నిండిపోయింది. ప్రయాణికులు, వాహనాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీటిని తొలగించేందుకు ఎయిర్‌పోర్టు సిబ్బంది రంగంలోకి దిగిన దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ కావడంతో రాజకీయ దుమారం మొదలైంది. భారీ పెట్టుబడులు, ఆధునిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన విమానాశ్రయంగా ప్రచారం పొందిన ప్రాజెక్టులో.. ఒక్క భారీ వర్షం పడితే నీరు నిలిచిపోవడమేంటి? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధించారు.

విమర్శలకు తోడు రాజకీయ కౌంటర్లు కూడా మొదలయ్యాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నేరుగా బీజేపీపై సెటైర్ వేశారు. “ఇక విమానాశ్రయంలో పడవలు నడుస్తాయా?” అంటూ ఎక్స్‌లో ప్రశ్నించారు. బీజేపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. అయితే ఎయిర్‌పోర్టు యాజమాన్యం మాత్రం ఈ ఘటనపై వివరణ ఇచ్చింది. తక్కువ వ్యవధిలో అత్యంత భారీ వర్షపాతం నమోదవడంతో టెర్మినల్‌, పార్కింగ్ ప్రాంతాన్ని కలిపే మార్గంలోకి వర్షపు నీరు వచ్చిందని తెలిపింది. తమ సిబ్బంది వెంటనే స్పందించి 30 నిమిషాల్లోపే నీటిని తొలగించారని వెల్లడించింది.

నీరు నిలిచిన సమయంలో ప్రయాణికులు, వాహనాల రాకపోకలను ప్రత్యామ్నాయ మార్గంలోకి మళ్లించారు. ప్రయాణికులను నేరుగా కర్బ్‌ వద్ద పికప్‌, డ్రాప్ చేసుకునే అవకాశం కల్పించారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. విమానాలు ఆగిపోయాయా లేదా అన్నది ఒక విషయం.. నీరు ఎందుకు నిలిచింది అన్నది మరో విషయం. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంలో వర్షపు నీటి నిర్వహణ వ్యవస్థ ఎంత సమర్థంగా ఉంది? భవిష్యత్తులో ఇంతకంటే భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.

మరోవైపు సోషల్ మీడియాలో కొందరు ఈ ఘటనను వ్యంగ్యంగా తీసుకున్నారు. “ఇది ఎయిర్‌పోర్టా.. స్విమ్మింగ్ పూలా?” అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు మాత్రం ఒక్క ఘటన ఆధారంగా మొత్తం ప్రాజెక్టును తప్పుబట్టడం సరికాదని అంటున్నారు. వాస్తవానికి ఎయిర్‌పోర్టు సిబ్బంది స్పందించి తక్కువ సమయంలోనే నీటిని తొలగించడంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 28, 2026న విమానాశ్రయాన్ని ప్రారంభించారు. తొలి దశ నిర్మాణానికి సుమారు రూ.11,200 కోట్లు ఖర్చయ్యాయి. అయితే రెగ్యులర్ కమర్షియల్ విమాన కార్యకలాపాలు జూన్ 15 నుంచి ప్రారంభమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement