సగర్వంగా, వైభవోపేతంగా స్వాతంత్య్ర దినోత్సవం | PM Modi urges countrymen to celebrate Independence Day with pride | Sakshi
Sakshi News home page

సగర్వంగా, వైభవోపేతంగా స్వాతంత్య్ర దినోత్సవం

Aug 12 2026 5:22 AM | Updated on Aug 12 2026 5:22 AM

PM Modi urges countrymen to celebrate Independence Day with pride

మంగళ్‌ మిలన్‌లో త్రివర్ణ పతాకంతో మోదీ, మంత్రులు, ఎంపీలు

‘అభివృద్ధి చెందిన భారత్‌’ కోసం ప్రతిజ్ఞ చేయాలి  

ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు  

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని సగర్వంగా, వైభవోపేతంగా నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘అభివృద్ధి చెందిన భారత్‌’కోసం ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికార ఎన్డీయే కూటమి మంగళవారం నిర్వహించిన ‘మంగళ్‌ మిలన్‌’కు మోదీ హాజరయ్యారు. సమావేశ ప్రాంగణానికి మోదీ చేరుకున్నప్పుడు ఎన్డీయే ఎంపీలు, కేంద్ర మంత్రులు త్రివర్ణ పతాకాలు చేతబూని వందేమాతరం, భారత్‌ మాతా కీ జై అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. ఈ దృశ్యాలతో కూడిన వీడియోను మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేశారు. మన స్వాతంత్య్ర సమరయోధులకు ఘనంగా నివాళులు అర్పిద్దామని, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ప్రతిజ్ఞ చేద్దామని సూచించారు.

‘‘హర్‌ ఘర్‌ తిరంగా, ఘర్‌ ఘర్‌ తిరంగా, హర్‌ మన్‌ తిరంగా (ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం, ప్రతి హృదయంలో త్రివర్ణ పతాకం). అందరూ కలిసి రండి. ప్రతి ఇంట్లోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం. భారత్‌ మాతా కీ జై, వందేమాతరం, వందేమాతరం, వందేమాతరం’’అని మోదీ ఈ వీడియోలో పిలుపునిచ్చారు. అంతకుముందు పార్లమెంట్‌ భవన సముదాయంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో మంగళ్‌ మిలన్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి స్వయంగా జాతీయ జెండాను చేతబూనారు. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌సింగ్‌ చౌహాన్, ఎస్‌.జైశంకర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రి సి.ఆర్‌.పాటిల్‌ ఒక ప్రజెంటేషన్‌ ఇచ్చారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రతి మంగళవారం ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement