ఒకే ఫ్రేమ్‌లో మోదీ–పవార్‌–షా.. | A Wedding Frame That Stirred Politics: Modi Pawar Shah Together | Sakshi
Sakshi News home page

ఒకే ఫ్రేమ్‌లో మోదీ–పవార్‌–షా..

Aug 11 2026 8:30 AM | Updated on Aug 11 2026 8:41 AM

A Wedding Frame That Stirred Politics: Modi Pawar Shah Together

ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫొటో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే వివాహ రిసెప్షన్‌ సందర్భంగా చోటుచేసుకున్న ఈ పరిణామం.. సాధారణ కుటుంబ వేడుకే అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో కొనసాగుతున్న శరద్‌ పవార్‌ పార్టీ.. ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో మోదీ, పవార్‌, షా కలిసి కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఈ వివాహ వేడుకకు కొందరు కాంగ్రెస్‌ పెద్దలు, ఎన్సీపీ-ఎస్పీ మిత్రపక్షాల నేతలు కొందరు దూరంగా ఉండడమూ ఇందుకు మరో ప్రధాన కారణమైంది. అయితే ఇది కేవలం కుటుంబ కార్యక్రమంలో భాగమైన మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఎన్సీపీ (ఎస్పీ) వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర రాజకీయాల్లో మాత్రం.. ఈ కలయికపై ఊహాగానాలు మొదలయ్యాయి.

కొసమెరుపు: మోదీ విధానాలపై తరచూ విమర్శలు చేసే రోహిత్‌ పవార్‌.. అదే వేదికపై ప్రధాని మోదీతో కలిసి ఫొటోకు పోజివ్వడం కూడా చర్చకు దారితీసింది.

ఇక ఈ వివాహ వేడుకకు బీజేపీ అగ్రనేతలు హాజరు కావడం కంటే కొన్ని గంటల ముందే.. ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన లోక్‌సభ ఎంపీల బృందం ప్రధాని మోదీని కలిసింది. సుప్రియా సూలే నేతృత్వంలోని ఎనిమిది మంది ఎంపీలు మహారాష్ట్రకు సంబంధించిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కరువు పరిస్థితులు, సాగునీరు, నదుల అనుసంధానం, రైల్వే ప్రాజెక్టులు, రైతు రుణమాఫీ వంటి అంశాలపై వినతిపత్రం అందించారు. పుణె–నాశిక్‌ సెమీ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టు, ఉల్లి ధరలు, చంద్రభాగా నది కాలుష్యం వంటి సమస్యలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం.

రాజకీయ మార్పులపై ఊహాగానాలు
మోదీతో పవార్‌ వర్గం వరుస భేటీలు, కేంద్రం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) అంశంపై పార్టీ వైఖరి వంటి పరిణామాలు కొత్త చర్చలకు కారణమయ్యాయి. డీలిమిటేషన్‌ విషయంలో తమ నిర్ణయం తుది బిల్లు వచ్చిన తర్వాతే తీసుకుంటామని సుప్రియా సూలే ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే కొన్ని షరతులతో ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

ఇండియా కూటమిలో ఉంటూనే.. 
ఎన్సీపీ (ఎస్పీ) మాత్రం తమ రాజకీయ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెబుతోంది. మహారాష్ట్ర సమస్యలు, ప్రజా ప్రయోజన అంశాలపైనే కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని స్పష్టం చేస్తోంది. గతంలోనూ శరద్‌ పవార్‌, సుప్రియా సూలేలు ప్రధాని మోదీని కలిసి విద్యార్థుల సమస్యలు, నీటి నిర్వహణ, రైతుల అంశాలపై చర్చించారు.

ఒక ఫొటో.. ఎన్నో ప్రశ్నలు!
ప్రస్తుతం రేవతి సూలే వివాహ రిసెప్షన్‌లో తీసిన ఈ చిత్రం కేవలం ఓ కుటుంబ వేడుక జ్ఞాపకమే అయినప్పటికీ.. దాని వెనుక ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీతో పవార్‌ సాన్నిహిత్యం పెరుగుతోందా? లేదంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఈ భేటీలా? మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ ఫొటో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement