నలుగురి పిల్లలను ఒంటరిగా పెంచాడు.. చివరికి.. | He Raised 4 Children Alone When He Died None Of Them Came | Sakshi
Sakshi News home page

నలుగురి పిల్లలను ఒంటరిగా పెంచాడు.. చివరికి..

Aug 11 2026 7:30 AM | Updated on Aug 11 2026 8:18 AM

He Raised 4 Children Alone When He Died None Of Them Came

భోపాల్: నలుగురు పిల్లల చేతులు పట్టుకుని నడిపించాడు. వారి జీవితాల్ని తీర్చిదిద్దాడు. కానీ ఆ తండ్రి మరణించినప్పుడు.. చివరి చూపు కోసం కూడా ఎవరూ రాలేదు. భార్య చనిపోయిన తర్వాత నలుగురు పిల్లలను కంటికి రెప్పలా పెంచిన 70 ఏళ్ల ఘనశ్యామ్.. చివరకు అనారోగ్యంతో వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. ఘనశ్యామ్ పెద్దగా ఆస్తిపాస్తులు వదిలి వెళ్లలేదు. ఇండోర్‌లో చిన్న సైకిల్ టైర్లు, ట్యూబుల వ్యాపారం చేసేవారు. ఒక చిన్న ఇల్లు ఉండేది. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.. నలుగురు పిల్లలను కష్టపడి పెంచారు. పిల్లలు చిన్నవయసులోనే ఆయన భార్య మరణించింది.

జీవితంలోని చివరి నాలుగేళ్లను ఆయన భోపాల్‌లోని ఓ వృద్ధాశ్రమంలో గడిపారు. కుటుంబ సభ్యుల ప్రేమ, ఆదరణకు దూరంగా ఉన్న ఆయన 70 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లడానికి పిల్లలు వస్తారేమోనని అధికారులు రెండు రోజుల పాటు ఎదురుచూశారు. కానీ ఒక్కరూ రాలేదు. ఘనశ్యామ్ ఆగస్టు 4న మరణించారు.

వృద్ధాశ్రమం నిర్వాహకులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించడమే కాకుండా.. భోపాల్‌కు వచ్చి అంత్యక్రియల్లో పాల్గొనాలని పలుమార్లు కోరారు. అయితే వారు రకరకాల కారణాలు చెప్పారు. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించి.. మరణ ధ్రువీకరణ పత్రాన్ని తమకు పంపించాలని కుటుంబ సభ్యులు చెప్పారు. తాము ఘనశ్యామ్‌జీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆయన కుటుంబానికి ఇచ్చేది లేదని  మాధురి మిశ్రా తేల్చి చెప్పారు. ఆయన బతికున్నప్పుడు చూడటానికి రాలేదు. ఆయన చనిపోయినప్పుడు కూడా రాలేదు. అలాంటప్పుడు ఇప్పుడు ఆయన మరణ ధ్రువీకరణ పత్రాన్ని వారికి ఎందుకు ఇవ్వాలంటూ మిశ్రా ప్రశ్నించారు.

‘‘మేము ఒకసారి ఘనశ్యామ్‌ ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేయగా ‘నాకు ఆయన ఎవరో తెలియదు. నేను ఆయనను వదిలేశాను. ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అంటూ కుమారుడు సమాధానం ఇచ్చాడు. వారి తండ్రి ఇంటి నుంచి వచ్చిన డబ్బును అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు పంచుకున్నారని.. ఇక తమ తండ్రితో తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పారంటూ మిశ్రా పేర్కొన్నారు. అప్పటికే ఘన శ్యామ్ పాక్షిక పక్షవాతంతో బాధపడుతున్నారు. మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడేవారు. నడవడం కూడా చాలా కష్టంగా ఉండేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement