సాక్షి, బెంగళూరు: నగరంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. వారి తండ్రి తీవ్ర గాయాలతో కనిపించాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. 40 ఏళ్ల ఎస్‌జీ ఇమ్రాన్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి హోటల్‌కు వచ్చాడు. ఆ తర్వాత గదిలో చిన్నారులు మృతి చెందగా.. ఇమ్రాన్ బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో పడి కనిపించాడు. అతని మెడపై కత్తితో కోసుకున్న గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన చిన్నారుల వయస్సు 10, 5 సంవత్సరాలుగా గుర్తించారు. తండ్రి నుంచి కొద్ది దూరంలోనే మంచంపై వారి మృతదేహాలు కనిపించాయి.
హోటల్ సిబ్బంది సమాచారం అందించడంతో భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఇమ్రాన్‌ను బయటకు తీసుకొచ్చారు. అనంతరం అతడిని బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
భార్యపై అనుమానమే కారణమా?
ప్రాథమిక దర్యాప్తులో ఇమ్రాన్ తన భార్యపై అనుమానం పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని భావించినట్లు వెల్లడించారు. ‘నాపిల్లలు ఇలాంటి తల్లితో పెరగకూడదని అనుకున్నాను. అందుకే వారిని చంపి, నేను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాను’ అని ఇమ్రాన్ చెప్పినట్లు సమాచారం.
గదిలోకి వెళ్లిన సిబ్బందికి షాక్
డీసీపీ జీకే మిథున్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇమ్రాన్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి హోటల్‌లో ముందురోజు సాయంత్రం చెక్‌ఇన్ చేశాడు. సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో శుభ్రం చేసే సిబ్బంది గది తలుపు తట్టినా స్పందన రాలేదు. దీంతో వారు తలుపు తెరిచి చూడగా.. ఇద్దరు చిన్నారులు మంచంపై మృతిచెంది కనిపించారు. తండ్రి కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన స్థితిలో ఉన్నాడు అని పోలీసులు తెలిపారు.
చిన్నారులను తానే చంపినట్లు అంగీకారం
ఇమ్రాన్ తన కుమార్తెలను తానే చంపినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అతడు స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. ప్రస్తుతం హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అతడు నాగవార ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించాం’అని స్థానిక పోలీసులు వెల్లడించారు.


