దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌పై దుమారం కొనసాగుతున్న వేళ.. బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడాన్ని వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ప్యూర్ పెట్రోల్ మీ నాన్న ఇంటి నుంచి వస్తుందా?” అంటూ ప్రశ్నించిన మిశ్రా.. దేశంలో క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడుతున్న పరిస్థితుల్లో ఇథనాల్ బ్లెండింగ్ అవసరమేనని సమర్థించారు.
మధ్యప్రదేశ్‌లోని రేవా ఎంపీ అయిన జనార్దన్ మిశ్రా.. ఇథనాల్ బ్లెండింగ్ విధానాన్ని గట్టిగా సమర్థించారు. భారత్ తనకు అవసరమైన ముడి చమురులో దాదాపు 80 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో దేశీయంగా అవసరమైన ముడి చమురులో సుమారు 20 శాతం మాత్రమే ఉత్పత్తి అవుతోందని మిశ్రా అన్నారు. మిగిలిన 80 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని చెప్పారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, చమురు రవాణాలో ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా భారత్‌కు క్రూడ్ ఆయిల్ చేరేందుకు ట్యాంకర్లు అదనంగా వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని మిశ్రా విమర్శించారు. “ఇథనాల్ వద్దు.. ప్యూర్ పెట్రోల్ కావాలి” అంటూ ఉద్యమం చేస్తున్నారు. కానీ ప్యూర్ పెట్రోల్ మీ నాన్న ఇంటి నుంచి వస్తుందా? దేశంలో ప్యూర్ పెట్రోల్ లేకపోతే అది ఎక్కడి నుంచి వస్తుంది?” అంటూ ఆయన ప్రశ్నించారు.
బ్రెజిల్‌ను ఉదాహరణగా చూపిన ఎంపీ
ఇదే సమయంలో ఇథనాల్ వినియోగంలో బ్రెజిల్‌ను మిశ్రా ఉదాహరణగా ప్రస్తావించారు. అక్కడ వాహనాలు అధిక శాతం ఇథనాల్‌తో నడుస్తున్నాయని చెప్పారు. భారత్‌లోనూ ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో వాహనాలు నడపగల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ఇథనాల్ వినియోగం వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయని వస్తున్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. భారత్‌లో నిపుణులు నిర్వహించిన పరీక్షల్లో ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఇంజిన్‌కు అసాధారణ నష్టం జరుగుతున్నట్లు తేలలేదని ఆయన అన్నారు.
E20పై అసలు వివాదమేంటి?
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్‌పై ఆధారపడటం తగ్గడంతో పాటు దేశీయంగా ప్రత్యామ్నాయ ఇంధనాల ఉత్పత్తి పెరుగుతుందని కేంద్రం చెబుతోంది. అయితే E20 వల్ల మైలేజీ తగ్గడం, వాహనాల పనితీరుపై ప్రభావం, ఇంజిన్‌కు దీర్ఘకాలిక నష్టం వంటి అంశాలపై వాహనదారుల్లో ఆందోళనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనార్దన్ మిశ్రా చేసిన “మీ నాన్న ఇంటి నుంచి వస్తుందా?” వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీశాయి. ఇథనాల్‌పై కేంద్రం విధానం ఒకవైపు.. వినియోగదారుల ఆందోళనలు మరోవైపు.. ఈ నేపథ్యంలో E20పై వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.


