వ్యర్థాన్ని సంపదగా మార్చే సర్క్యులర్ ఎకానమీకి జీవ ఇంధనాలు బలమైన పునాది వేస్తున్నాయి
పెరుగుతున్న పెట్రోల్ ధరలు, నగరాల్లో క్షీణిస్తున్న గాలి నాణ్యత, పశ్చిమాసియాలో చమురు సరఫరాపై నెలకొంటున్న అనిశ్చితి– ఈ మూడు అంశాలు నేడు ప్రతి భారతీయుడి జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారమే జీవ ఇంధనాల వాడకం.
ప్రపంచం ఇప్పుడు జీవ ఇంధనాలను కేవలం ప్రత్యామ్నాయ ఇంధనంగా కాకుండా, పర్యావరణ రక్షణ, ఇంధన భద్రత, రైతు ఆదాయం, గ్రామీణ ఉపాధి వంటి వాటిని కలిపే భవిష్యత్ అభివృద్ధి మార్గంగా చూస్తోంది.
భారత్ ప్రస్తుతం తన ముడి చమురు అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ పరిస్థితిలో ప్రత్యా మ్నాయ ఇంధనాల విస్తరణ దేశ ఇంధన స్వావ లంబనకు కీలకం. జీవ ఇంధనాల ప్రత్యేకత ఏమిటంటే, అవి మన దేశంలోనే లభించే వ్యవసాయ, సేంద్రియ వనరుల నుంచి ఉత్పత్తి చేయగలగడం. చెరకు మొలాసిస్, మొక్కజొన్న, పాడై పోయిన ధాన్యాలు, వరి గడ్డి, పంట అవ శేషాలు ఇప్పుడు ఇంధన ముడి సరుకుగా మారు తున్నాయి. అంటే, వ్యర్థాన్ని సంపదగా మార్చే సర్క్యులర్ ఎకానమీకి జీవ ఇంధనాలు బలమైన పునాది వేస్తున్నాయి.
జీవ ఇంధనాల్లో బయో–ఇథనాల్, బయో– డీజిల్, బయో–గ్యాస్, బయో– సీఎన్జీ, సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్ వంటి పలు రూపాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండో తరం ఇథనాల్ సాంకేతికత వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించడం వల్ల ఆహార భద్రతకు భంగం కలగకుండా ఇంధన ఉత్పత్తి సాధ్యమవుతోంది. 2014లో పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం సుమారు 1.5 శాతం మాత్రమే ఉండగా, 2024–25 నాటికి అది 19.05 శాతానికి చేరింది. 2025–26 ఆర్థిక సంవ త్సరంలో సగటు మిశ్రమం 20 శాతానికి చేరువ కావడం ఈ కార్యక్రమం విజయాన్ని సూచిస్తోంది.
భారత్‌కు కొత్త అవకాశాలు
ఇటీవల కేంద్ర మంత్రివర్గం 23,731 కోట్ల వ్యయంతో ‘గోబర్ధన్ – నేషనల్ సర్క్యులర్ బయోఎనర్జీ పథకాన్ని’ ఆమోదించడం జీవ ఇంధన రంగంలో కీలక మలుపు. పశువుల పేడ, పంట అవశేషాలు, వంటింటి వ్యర్థాలు, మార్కెట్ వ్యర్థాలను కంప్రెస్డ్ బయోగ్యాస్, బయో–స్లర్రీగా మార్చి గ్రామీణ ప్రాంతాలను శుభ్రమైన ఇంధన ఉత్పత్తి కేంద్రాలుగా తీర్చిద్దడం ఈ పథకం లక్ష్యం. ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ రంగం ద్వారా రూ. 40,000 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్య ఆదా, 1.5 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు, 10 మిలియన్ మెట్రిక్ టన్నుల శిలాజ ఇంధన వినియోగానికి ప్రత్యామ్నాయం సాధ్యమవుతాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి జీవన్ యోజన’ ద్వారా 2జీ ఇథనాల్ ప్రాజెక్టులకు ప్రోత్సాహం అందుతోంది. ‘సతత్’ పథకం ద్వారా కంప్రెస్డ్ బయో గ్యాస్ ఉత్పత్తిని విస్తరిస్తున్నారు.
2023లో జి–20 వేదికపై ప్రారంభమైన గ్లోబల్ జీవ ఇంధనాల కూటమి... జీవ ఇంధ నాల ఉత్పత్తి, సాంకేతిక మార్పిడి, వాణిజ్య సహకారానికి ప్రపంచ వేదికగా మారుతోంది. సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్, భవిష్యత్ బయో ఎనర్జీ రంగాల్లో భారత్‌కు ఇది కొత్త అవకాశాలను తెరుస్తోంది. అయితే జీవ ఇంధనాల విస్తరణలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి.
భూమి వినియోగం, నీటి అవసరాలు, ముడి సరుకు సరఫరా, సాంకేతిక వ్యయాలు వంటి అంశాలను సమతుల్యం చేయాల్సి ఉంటుంది. మొత్తానికి చమురు బావుల నుంచి మాత్రమే కాదు, మన పొలాల నుంచి కూడా దేశ భవిష్యత్ శక్తి ఉత్పత్తి కావచ్చని జీవ ఇంధనాలు మనకు గుర్తుచేస్తున్నాయి.
– ఆర్ధ శ్రీనివాస్ పటేల్, మీడియా–కమ్యూనికేషన్స్ అధికారి (రేపు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం)


