లీగలాటా
పెళ్లంటే పందిళ్లు ... సందళ్లు... తప్పెట్లు... తాళాలు... రెండు మనసుల కలయికే కాదు, జీవితంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాల వేడుక. ఆ జ్ఞాపకాలను పదిలంగా ఉంచి కలకాలం గుర్తుండేలా వాటికి శాశ్వత రూపం ఇచ్చేవి ఫొటోలు, వీడియోలు. ప్రీ వెడ్డింగ్ షూట్‌ల నుంచి పెళ్లిలో బంధువుల సందడి, ఆప్యాయ ఆలింగనాలు, వధువును అత్తారింటికి పంపే తల్లిదండ్రుల కంటతడి వరకు ప్రతి ఆనంద క్షణాలూ భావోద్వేగాలూ కాలగర్భంలో కలిసి పోకుండా అవి పదిలంగా ఉంచుతాయి. అందుకే నేటి పెళ్లి తంతులో ఈ ఖర్చు తప్పని సరైంది. లక్షలకు చేరింది.
అయితే వీటి చిత్రీకరణలో పొరపాటు జరిగితే; ఆ జ్ఞాపకాలను సరిగా బంధించకపోతే; ఫొటోలు, వీడియోలు ఆశించిన స్థాయిలో రాకపోతే; ఒప్పందం అమలు చేయకపోతే; మానసిక వేదనే మిగులుతుంది. అయితే ఓ జంట ఇలా వేదనతో సరిపుచ్చుకోలేదు. ఒప్పంద ఉల్లంఘనపై వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. తమ మనో వేదనకు మూల్యం చెల్లించేలా ఆదేశించాలని, ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు పరిహారాన్ని ఇప్పించాలని వేడుకుంది. సేవల్లో లోపంతో పాటు భావోద్వేగాలను ఫోరం అర్థం చేసుకుని తీర్పు వెలువరించింది.
కేరళకు చెందిన ఓస్టిన్ ఊమచెన్, కావ్య సంతోష్ ఇద్దరూ వైద్యులు. వీరిద్దరికి పెళ్లి నిశ్చయం అయింది. కొచ్చిలోని పికోలో వెడ్డింగ్స్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పెళ్లి ఫొటోలు, వీడియోలు చూశారు. తమ వివాహ వేడుకను అలాగే పదిలపరుచుకోవాలని భావించి, ఆ సంస్థను సంప్రదించారు.
ఒప్పందం... ఉల్లంఘన...
బ్రైడ్ అండ్ గ్రూమ్ సైడ్ ప్యాకేజీని ఆ జంట ఎంచుకుంది. ఆ ప్యాకేజీ కింద అందించే సేవలను సంస్థ వివరించింది. మొత్తం రూ.95 వేలకు వారి మ«ధ్య ఒప్పందం కుదిరింది. రూ.10 వేలు అడ్వాన్స్‌గా, పెళ్లిరోజు మరో రూ. 70 వేలు చెల్లించారు. 2024లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం డ్రోన్ కెమెరా ద్వారా పెళ్లిని షూట్ చేయలేదు. ఆ విషయాన్ని ముందుగా తెలియజేయలేదు. దీంతో మరొకరిని ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆ జంట వాదన. మరోవైపు వధువు ఇంట్లో జరిగే వివాహ తంతును చిత్రీకరించేందుకు వెళ్లాల్సిన క్యాండిడ్ ఫొటోగ్రాఫర్ వెళ్లలేదు. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన మూడు వెడ్డింగ్ రీల్స్ ఊసే ఎత్తలేదు. వివాహం జరిగిన ఆరు నెలల తర్వాత హైలైట్స్ వీడియోను వాట్సాప్ ద్వారా పంపారు. యూఎస్‌బీలో ఇచ్చిన వెడ్డింగ్ స్టోరీ కరెప్ట్ అయింది. ఫొటోలు, వీడియో ఎడిటింగ్ పరమ నాసిగా ఉన్నాయి. ముఖ్యమైన వేడుకల ఫొటోలు, ఆనంద క్షణాలు క్యాప్చర్ కాలేదు. ఇలా ఒప్పందంలోని పలు అంశాలను సంస్థ ఉల్లంఘించింది.
ఫోరంలో ఫిర్యాదు
ఒప్పందాన్ని సంస్థ ఉల్లంఘించిందంటూ ఆ జంట కొట్టాయంలోని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. అయితే కమిషన్ జారీ చేసిన నోటీసులకు పికోలో వెడ్డింగ్స్ సంస్థ స్పందించలేదు. చివరకు ఓ దినపత్రికలో పబ్లిక్ నోటీసు ఇచ్చినప్పటికీ ఆ సంస్థ కమిషన్ ఎదుట హాజరు కాలేదు. దీంతో ఎక్స్‌పార్టీగా ఫోరం కేసును కొనసాగించింది. ఫిర్యాదుదారులు సమర్పించిన ఆధారాలను పరిశీలించింది. హెలీకామ్(డ్రోన్) సేవలను అందించనందుకు బిల్లులో ఆ మేరకు తగ్గిస్తూ సంస్థ రశీదు ఇవ్వడాన్ని కోర్టు గుర్తించింది. యూఎస్‌బీ కరెప్ట్ అయిన విషయాన్ని పరిశీలించి నిర్ధారించింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం–2019 ప్రకారం ఇటువంటి చర్య ‘సేవల్లో లోపం’ పరిధిలోకి వస్తుందని ఫోరం స్పష్టం చేసింది.
తీర్పు ఇలా...
సంస్థకు చెల్లించిన మొత్తాన్ని ఫిర్యాదుదారులకు తిరిగి ఇవ్వాలని ఫోరం ఆదేశించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.2.50 లక్షలు, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో 10,000 చెల్లించాలని ఆదేశిస్తూ ఫోరం తీర్పు వెలువరించింది. నిర్ణీత గడువులోగా ఈ మొత్తం అందించకపోతే 9% వడ్డీ చెల్లించాలని పేర్కొంది.
ఈ తీర్పు కేవలం ఓ జంటకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించిన కేసు మాత్రమే కాదు. వృత్తి పరమైన సేవలు అందించే ప్రతి సంస్థపై ఉన్న బాధ్యతను గుర్తు చేసే తీర్పు. ఈ తరహా ఒప్పందాలు కేవలం వ్యాపార లావాదేవీలు కావని, విశ్వాసం, జవాబుదారీతనం, ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.
- దిలీప్ మాదిరెడ్డి


