చేదుకట్టు..! చేతిలో చిల్లిగవ్వ లేదు.. కానీ తలలో | Funday Special Story On Savitri Inspiration And Success Story | Sakshi
Sakshi News home page

చేదుకట్టు..! చేతిలో చిల్లిగవ్వ లేదు.. కానీ తలలో

Aug 9 2026 8:14 AM | Updated on Aug 9 2026 8:14 AM

Funday Special Story On Savitri Inspiration And Success Story

ఫండే

ఈ వారం కథ

కొత్తగా పనిలో చేరిన సావిత్రి మాటతీరు చూసిన రేవతి ‘‘దీనికి ఎంత తెలివో?’’ బుగ్గలు నొక్కుకుంటూ ఆశ్చర్యపోయింది. ఆమె తెలివైన మాటల వెనుక జీవితాన్ని తీర్చిదిద్దుకునే ధ్యాస తప్ప మరో ఆలోచన కనబడలేదు రేవతికి. పనిలో చలాకీతనం, శ్రద్ధ చూసి ముచ్చట వేసింది. కోనసీమలో ఒక పల్లెటూరు నుండి హైదరాబాద్‌ అపార్టుమెంటు కాపలాపనికి మొగుడు సూరిబాబుని తీసుకుని రావడమే తరవాయి, ఫ్లాట్స్‌ అన్నీ తిరిగి తనని పనిలో పెట్టుకొమ్మని కోరింది సావిత్రి.

అశోకా పౌడర్‌ ముఖానికి రాసుకుని, ముప్పేట కొబ్బరికాయలా ఉన్న తలకు కొబ్బరినూనె పాముకుని, తలలో మందార పువ్వు పెట్టుకుని, నుదుట సన్నని తిలకం దిద్దుకుని, పొట్టిగా, సన్నగా, శుభ్రంగా ఉన్న సావిత్రి మొదటి చూపులోనే నచ్చేసింది రేవతికి.
‘‘చక్కని గాలి, బోల్డు నీళ్ళు, పచ్చని వరిచేలతో కోనసీమ బావుంటుంది కదే అక్కడే సుఖంగా ఉండక, సామాన్యుడు బతకలేని ఈ మహానగరానికి ఎందుకు వచ్చావు?’’ అడిగింది ఆరాగా.

‘‘మా వూళ్ళో పనులేం ఉండడం లేదమ్మా. ఈ మధ్య పొలం పనులు కూడా బాగా తగ్గిపోయాయి. సేలన్నీ రొయ్యల సెరువులవడంతో సానా కట్టంగా ఉంది పని దొరకడం. దానికి తోడు మా వోడు బద్ధకస్తుడు, అన్నీ ఒళ్ళోకి వచ్చి వాలాలను కుంటాడు. మగాడని గోరోజనం. మా వూళ్ళో ఉంటే కట్టబడి కూడబెట్టిన డబ్బులతో తాగడం తిరగడం తప్ప, పిల్లల ఆలనా పాలనా సూడడం లేదు. దొరికిన ఈ కాపలా పనైనా జాగ్రత్తగా సేసుకోమని బతిమాలి ఇక్కడకు లాక్కొచ్చాను, పిల్లల్ని కూడా సక్కని బళ్ళో ఎయ్యొచ్చు కదమ్మా,’’ మంచి భవిష్యత్తు ఊహిస్తూ చెప్పింది.
‘‘అమ్మా! సెల్లి కొడతందే’’ అంటూ కీచులాడుకొంటూ ఏడుస్తున్న పిల్లల చేతుల్లో బిస్కెట్లు పెట్టి ఊరుకోబెట్టింది రేవతి. సావిత్రి రాకతో రేవతికి ఇంటి పని చాలా తగ్గింది. రోజూ రేవతి ఆ చిరు కుటుంబం కోసం తమతో పాటే కాసిని బియ్యం పోసి అన్నంతో పాటు కాస్త కూర, పచ్చడి లాంటివి ఇవ్వడంతో, రేవతి పట్ల సావిత్రి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది.
∙∙ 
అపార్ట్‌మెంట్‌లో పనులన్నీ అయిపోయాక, విశ్రాంతి తీసుకోకుండా ఏదో పని చేసి డబ్బులు సంపాదించడం అలవాటుగా మారింది సావిత్రికి. ‘‘వయసున్నప్పుడే ఒళ్ళొంచి పనిచెయ్యాలి, నాలుగు డబ్బులు కూడబెట్టుకోవాలే సాయిత్రి!’’.. అమ్మ రాజేశ్వరి మాటలు ఆమె మస్తిష్కంలో ఇంకా సజీవంగా ఉన్నాయి.
సావిత్రి పుట్టుక ఒక విషాదం. రాజేశ్వరి వయసులో ఉన్నప్పుడు ఆమె ఎంతగానో నమ్మిన మగాడు మోజు తీరిపోయాక తల్లినీ, పసిగుడ్డుగా ఉన్న సావిత్రినీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఊళ్ళో బంధువులు ఎన్ని సూటిపోటి మాటలన్నా, కన్నకూతుర్ని ఎంతో ధైర్యంతో పెంచిన తన తల్లి మనోబలమే సావిత్రికి ఆమె నుంచి వచ్చిన ఆస్తి. తన కంటే పెద్దదైన కూతురున్న వాడిని మారుమనువాడింది తల్లి. పెంపుడు తండ్రి ప్రేమ పొందకపోయినా, సవతి అక్క, బావ ఆమెను బానే చూసుకోవడం కాస్త ఊరట.

ఇద్దరు కూతుళ్ళకు ఏదో రకంగా సాయపడవచ్చని, వాళ్లకు భారం కాకూడదని నడి వయస్సులో ‘కొయిటా’ వెళ్ళిన తల్లి మరికాస్త ఆలంబన సావిత్రికి. ఇళ్ళల్లో పనులన్నీ గబా గబా అవగొట్టుకుని, చాప పరుచుకుని, జనుముతో తయారుచేసిన పేపర్లతో వంద కవర్లు పూర్తి అయ్యాక వాటిని ఎండలో ఆరబెట్టి, గదిలోకి వెళ్లి గోధుమ పిండి, పెనం, స్టవ్వు, గిన్నెలు సర్దుకుంది. సాయంత్రం నాలుగు గంటలు అయ్యింది. ఇంతలో స్కూల్‌ నుంచి పిల్లలు రావడంతో వాళ్ళకు స్నానాలు చేయిస్తాడేమోనని ఆశతో సూరిబాబు కేసి చూసింది. బయట కుర్చీలో దర్జాగా కూర్చుని ఆమెకేసి తల కూడా తిప్పకుండా మొబైల్‌లో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుకుంటూ కూర్చొన్నాడు.
‘‘పిల్లల్ని దగ్గరకు తీసుకుని, తానం సేయిద్దారని కూడా లేదు’’ ఉసూరుమంటూ, వాళ్ళకి నీళ్ళు పోసి, ఉతికిన బట్టలు వేసి, చేతుల్లో చిరుతిళ్ళు పెట్టింది. కాస్త చీకటి పడగానే, గోధుమపిండి, సామాన్లు, సంచిలో పెట్టుకుని కాలనీలో నాలుగు రోడ్ల జంక్షన్‌ వద్దకు బయలుదేరడానికి సిద్ధం అయ్యింది. ఆమె వైపు తల కూడా తిప్పకుండా మొబైల్‌ చూసుకుంటున్న మొగుడిని చూడగానే ఆమెకు చిర్రెత్తు కొచ్చింది.

‘‘ఎప్పుడు సూసినా పోనట్టుకుని ఆడుకోడమేనా, కాంత సాయం సెయ్యలేవా’’ అతని చేతిలో ఫోన్‌ లాక్కోడానికి ప్రయత్నం చేసింది. ఆమెని పక్కకు తోసేసి, ‘‘ఉండేహే ఆట మంచి రంజుగా ఉంది, నీ పని నువ్వు సూసుకో, మద్దెలో అడ్డం రాకు! ఎన్నాళ్ళు ఈ సిన్నా సితకా పనులు సేత్తాం డబ్బుల కోసం? కొట్టేదేదో గట్టిగా కొట్టాలి’’ అంటూ బెట్టింగ్‌ గేమ్స్‌లో దూరిపోయాడు. ఉసూరుమంటూ సంచీని మోసుకుని వెళ్లి, నాలుగు రోడ్ల జంక్షన్‌లో ఒక పక్కగా సామాను చేర్చి గోధుమ రొట్టెలు కాల్చి అమ్మడం మొదలుపెట్టింది. అలా రాత్రి తొమ్మిది వరకూ అమ్ముకుంది. ఇంతలో సూరిబాబు నుంచి ఫోన్‌ రాగానే, ‘‘అయిపోయింది వత్తన్నా!’’ అంటూ అన్నీ సర్దుకుని ఇంటికి బయలుదేరింది. 
తనకున్న చిన్నపాటి తెలివితో, చిరు సంపాదనకి చిన్న చిన్న మార్గాలు వెతకడం, ఎంత చిన్న ఆలోచన వచ్చినా దాన్ని అమలుపరచడం నిరంతరం చేసేదామే. పండగలు వస్తే వినాయక చవితికి మట్టి వినాయక బొమ్మలు, దీపావళికి మతాబులు చేసి అమ్ముకునేది.
∙∙ 
ఒకరోజు ఆమె చేసిన కవర్లు తీసుకువెళ్ళడానికి వచ్చినతను, ‘‘సాయిత్రి! మా సేటుకి యాపారం మంచిగ లేదుట, ఆయన దుకాన్‌ బంద్‌ జేస్తుండు, ఇంగ కవర్లు వద్దుట, నీకివ్వలసిన పైసల్‌ తీసుకో’’.. చేతిలో పెట్టి స్కూటర్‌ మీద వెళ్ళిపోయాడు.
హఠాత్తుగా ఆధరువు పోవడం ఆమె చిన్న జీవితానికి తగిలిన పెద్ద దెబ్బ. దాన్ని తట్టుకునే లోపు మరో దెబ్బ ఆమె జీవనానికి మరింత గట్టిగా తగిలింది. రోడ్డుపక్కన రొట్టెలు అమ్ముకునే ప్రదేశంలో కంకర గుట్టలు పోసేశారు. అక్కడ ఆకాశ హర్మ్యం నిర్మాణం మొదలైంది. ఆమె ఆశల భవంతి కూలిపోయింది. ఎక్కడైనా ఖాళీ ఉన్న చోటు దొరికితే, అమ్ముకుందామని తిరిగి తిరిగి ఎక్కడా దొరక్క, దిగాలుగా ఇంటికి తిరిగి వచ్చింది. సూరిబాబు ఆమెను చూసి, ‘‘అప్పుడే వచ్చేశావే, ఎంత గిరాకి అయ్యింది ఇయ్యాల’’ వెటకారంగా అన్నాడు నవ్వుతూ. రోడ్డు మీద కంకర పోశారనే విషయం తెలిసి కూడా చెప్పలేదని, కోపంగా చూసింది అతనికేసి. అతను నిర్లక్ష్యంగా తల విసిరి, కంచంలో అన్నం కలుపుకుంటూ, పక్కనున్న మొబైల్‌ చూసుకుంటున్నాడు. నిద్రపోతున్న పిల్లల్ని లేపి, అన్నాలు పెట్టే పనిలో పడింది సావిత్రి.

మర్నాడు ఉదయం అన్యమనస్కంగా పనిచేస్తున్న సావిత్రిని గమనించిన రేవతి, ‘‘ఏంటే ఇవ్వాళ నీరసంగా ఉన్నావు? టీ తాగుతావా?’’ అడిగింది. చేస్తున్న రెండు పనుల ప్రవాహానికి గండి పడిందని నిరాశగా చెప్పింది.
‘‘అయ్యో! బాధపడకు. నువ్వు తెలివైనదానివి, వేరే ఏదైనా దొరుకుతుందిలే, కష్టించి పని చేసేవాళ్ళకు ఎదో కొత్త దారి దొరుకుతూనే ఉంటుందిలే’’ ఓదార్చింది.
ఖాళీగా ఉండడం అంటే సావిత్రికి భయం. తమ ఊళ్ళో ఏ పనీ చేయకుండా కాళ్ళ దాకా వచ్చింది, నోటి దాకా రాకుండా పోతుందా అనే ధీమాతో బతికేస్తూండే చాలామందిని చూస్తే చాలా భయం. కాళ్ళదాకా వచ్చేది హఠాత్తుగా ఆగిపోతే భవిషత్తులో ఎలా జీవించాలో అనే భీతి లేకుండా బ్రతికేవాళ్ళని చూస్తే మరీ భయం. భర్తను చూశాక, ఆ భయం మరీ ఎక్కువైంది. అతని సోమరితనం, జీవితం పట్ల నిర్లక్ష్యం చూసి, అతనంటే అసహ్యం మరింత పెరిగింది. ఎవ్వరిమీద ఆధారపడకుండా, తన కష్టాన్ని నమ్ముకుని పైకి రావాలనే తపన ఆమెను మరిన్ని కొత్త ఆలోచనలకు పురికొల్పుతూ ఉంటుంది.
∙∙ 
ధనుర్మాసం వచ్చింది. కాలనీలో ఉండే వెంకటేశ్వరస్వామి గుడిలో తిరుప్పావై వైభవంగా జరుగుతోంది. గుడి ప్రాంగణంలో ప్రవచనం వినడానికి రేవతి సావిత్రిని కూడా తీసుకుని వెళ్ళింది. ప్రవచనకర్త చెప్పిన ఆధ్యాత్మిక విషయాలు సావిత్రికి అర్థం కాలేదు. కానీ ఆయన చెప్తున్న ఉపన్యాసంలో జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో, కష్టాలని ఎలా అధిగమించాలో, ఎలా పోరాడాలో చెప్పడం మాత్రం ఆమెకు బాగా నచ్చింది. ఇంతలో ఆయన ధనుర్మాసం అంతరార్థం చెప్తూ, రాబోయే పండుగలు చాలా విశిష్టమైనవని, ఇంటి ముందు ముగ్గులు వెయ్యడం శరీరానికి మంచి వ్యాయామం అని, ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టడం వలన లక్ష్మీదేవి ఇంటిలో కొలువై ఉంటుంది అని భక్తిని మేళవించి చెప్పడం వలన ఆ కాలనీ వాసుల బుర్రలోకి ఆయన వాక్కులు బాగా ఎక్కాయి.

కాలనీ వాసులలో పెళ్లి కాని అమ్మాయిలకు ముగ్గుల పోటీ పెట్టాలనే ఆలోచన మహిళా కార్పొరేటర్‌ బుర్రలో మొలకెత్తింది. ఆ వార్త విన్న సావిత్రి బుర్రలో రెండు కొత్త ఐడియాలు పురుడు పోసుకున్నాయి. కాలనీలో ఇంటింటికీ వెళ్లి, తనకు ముగ్గులు వేయడం బాగా వచ్చని, ముగ్గు చేతకాని ఆడపిల్లలకు నేర్పి కొన్ని డబ్బులు సంపాదించింది. అలాగే గుడి పక్క గోశాలకు వెళ్లి ఆవు పేడ తెచ్చుకుని, గొబ్బెమ్మలు చేసి, అందంగా బంతి పూలు అమర్చి అమ్మింది. కనుమ పండుగ నాడు ముగ్గుల పోటీలో బహుమతి వచ్చిన అమ్మాయి, సావిత్రి కష్టానికి జాలిపడి, తనకి వచ్చిన క్యాష్‌ బహుమతిలో కొంత ఇచ్చేసింది. ఆ డబ్బులు కూతురి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని బ్యాంకులో డిపాజిట్‌ వేసింది. ఆ విషయం తెలిసిన రేవతి సావిత్రిని అభినందిస్తూ, ‘‘చూశావా సావిత్రి! దేనికీ నిస్పృహ చెందకుండా కాస్త ఆలోచిస్తే ఇలాంటి పనులు సంవత్సరమంతా ఏవో ఒకటి దొరుకుతూనే ఉంటాయి’’ అంది రేవతి.
‘‘అవును అమ్మగారు!’’ ఆనందం వ్యక్తపరచింది. ఇలాగే డబ్బులు సంపాదిస్తున్న సావిత్రి ముందు ముందు తనని లెక్కచేయదేమోననే అనుమానం జెర్రిగొడ్డులా సూరిబాబు మనసులో ప్రవేశించింది.
∙∙ 
వేసవికాలంలో అక్క, బావలతో కలిసి తిరుపతి మొక్కు తీర్చుకుందామని వెళ్ళింది సావిత్రి. తిరుపతి నుంచి సావిత్రి తిరిగి రాగానే, సూరిబాబు, ‘‘మా యమ్మకి సానా తేడా సేసిందంట, మనం కొన్ని రోజులు అక్కడే ఉండాలి’’ స్వంతవూరికి బయలుదేరదీశాడు. అత్తకి సుస్తీ అన్నది అబద్ధం, అతనికి పనిచేయడం ఇష్టం లేదు అన్నది నిజమని తెలుసుకున్న సావిత్రి అతన్ని నిలదీస్తే, ఆమె కంఠ శోష గోదావరి రైలు వంతెన ఘోషలో కలిసిపోయింది. సావిత్రి కష్టపడి కూడబెట్టిన డబ్బులన్నీ సూరిబాబు చేతిలో పడి బెట్టింగ్‌ పాలైపోయాయి. సావిత్రికి గుండె మండిపోయింది. 
గట్టిగా నిలదీస్తే, ‘‘దర్జాగా హైడ్రాబాడ్‌ లో తిరుగుదారని అనుకుంటున్నావేమో! మనతో కుదరదు, సిటీ ఓళ్ళ మాటలు బాగా సెవికెక్కి నన్ను పట్టించుకోవడమే మానేహావు’’ అంటూ ప్రతీరోజూ మాటలతో మానసికంగా హింసించేవాడు. పెల్లుబుకుతున్న కన్నీటి గోదారిని అదుపుచేసుకుంటూ..

‘నానేం తప్పు సెయ్యలేదే, నానెందుకు ఏడవాలి? సదువు సంజలులేని మొరటోడు, జీవితం ఇలువ తెలియని సన్నాసి ఆడేదో అన్నాడని ఏడవడం ఏంటి? నాను సావిత్రి! ఐదో కలాసు. ఆడు నిసానీ గాడు’ మనసుకు నచ్చ చెప్పుకుంది. అలా అనుకోవడమే తడవుగా గుండెల్లో కలిగిన బాధ మటుమాయం అయ్యింది. గబ గబా అన్నం వండి పిల్లలలకి పెట్టి, నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని, కొబ్బరిచెట్టు కింద నులకమంచం వాల్చుకుని, పక్కలో పిల్లల్ని వేసుకుని ఆలోచిస్తూ నడుం వాల్చింది. కొబ్బరి ఆకుల మీద నుంచి ఆమెపై పడుతున్న కొబ్బరి పువ్వుల్లా ఆలోచనలకు రూపం వచ్చి ఒక్కటి ఒక్కటీ ఆమె ముందు సాక్షాత్కారిస్తున్నాయి.

‘అవును ఆ పని చేస్తాను, కొబ్బరిసెట్టులా నిబ్బరంగా నిలబడతాను’ మనస్సుకి ధైర్యం చెప్పుకుని, నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. మధ్యరాత్రి వేళ హఠాత్తుగా వచ్చిన అంతు తెలియని కడుపు నొప్పి తీవ్రమై సొమ్మసిల్లి పడిపోయింది. ఆసుపత్రిలో జాయిన్‌ చేశారు సావిత్రి అక్క, బావ. చేతిలో ఒక్క పైసా కూడా లేని సూరిబాబు చేతులు నలుపుకుంటూ బయట కూర్చున్నాడు. జీవితంలో ఎంతో పైకి ఎదుగుదామనుకున్న సావిత్రికి, ఆమె కడుపులోని చేదుకట్టుకి వచ్చిన రోగం యముడిలా ఆమె ఆశలకు అడ్డుకట్టు వేసింది. ఆపరేషన్‌ చేసి చేదుకట్టు తొలగిస్తే గాని బతకదని డాక్టర్‌ చెప్పాడు. చావు బతుకుల మధ్య ఊగిసలాడుతోంది సావిత్రి.
సావిత్రి ఎందుకు తిరిగి రాలేదో కనుక్కోవడానికి రేవతి ఫోన్‌ చేసింది. సావిత్రి బావ ఫోన్‌ ఎత్తి, ‘‘సావిత్రికి సానా తేడా సేసింది ఆపరేసన్‌ సేసి సేదుకట్టు తీసేశారు’’ అన్నాడు. ‘‘చేదుకట్టు అంటే’’ అడిగింది ? అదేనమ్మ గాల్‌... గాల్‌ అని తడుముకుంటుంటే, గాల్‌ బ్లేడరా ? ‘‘అవునమ్మా అదే’’ అన్నాడు. చాలా బాధపడింది రేవతి. కొంత డబ్బు పంపించింది.

శల్యం మీద కోత వలన పార్వతి చిక్కి శల్యమయ్యింది. బలం పుంజుకొని తన పని తాను చేసుకోవడానికి మూడు నెలలు పట్టింది. రోజు రోజుకి ఇంట్లో పరిస్థితులు దిగజారుతున్నాయి. దాచిన డబ్బులన్నీ అనారోగ్యానికి, ఇల్లు గడవడానికి ఖర్చు అయిపోయాయి. తల్లి, బావ చాలారోజులు సాయం చేసి, ఇంక మీ బాధలు ఏవో మీరే పడండని వదిలేసారు. పిల్లలకి కడుపునిండా అన్నం పెట్టలేకపోతోంది. అయినా సూరిబాబు ధోరణి మారలేదు. కష్టమైన పనైనా, కొబ్బరి వలుపు తీసే కొట్లో చేరింది. రోజంతా పని ఉండడం వలన శరీరం కష్టపడుతున్నా, మనసు మటుకు హాయిగా ఉంది. పనంతా చక్కబెట్టి, ఇంటికి వచ్చి పెరట్లో బట్టలు ఆరేస్తూ ఆలోచనలో పడింది. ఇంతలో ఇంటి గోడను వొరుసుకుంటూ వడివడిగా ప్రవహిస్తూ వెడుతున్న గోదావరిలో పయనిస్తున్న పడవను చూశాకా, రేవతి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ‘నది ప్రయాణంలో నావకు తగులుతున్న నీటి దెబ్బలను, ఒడిదుడుకులు చూస్తే అవతలి ఒడ్డుకి చేరగలదా అని మొదట కంగారు పడతాం. కానీ అది చేరుకున్నాక, ఇంతేనా అనిపిస్తుంది. జీవితం కూడా అంతే!’ ఆ మాటలు తలుచుకోగానే ఉత్సాహం వచ్చింది. మెదడులో మరో కొత్త ఆలోచన ఉదయించింది.
∙∙ 
నిన్ను ఈ స్థాయిలో చూస్తుంటే చాలా గర్వంగా ఉందే సావిత్రి! అంటూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది రేవతి.
‘‘ఆ రోజు మీరన్న మాటలే నన్ను కట్టంలో కూడా దైర్యంగా నిలబడమని సెప్పేయమ్మా! లోకంలో పనికిరాని వస్తువంటూ ఏదీ లేదు, ప్రతీది మనకి ఉపయోగ పడేదే అని గుడిలో ఆ రోజు గురువుగారు సెప్పిన మాటలు నన్ను ఈ యాపారం సెయ్యమని సెప్పినట్టు అనిపించి ధైర్యంగా దిగిపోయాను.’’ అంది వినయంగా...
‘‘అది సర్లే గానీ, కొబ్బరి పెంకులతో, పీచుతో చేసిన బొమ్మలు, గ్రామీణ ఉత్పత్తుల మార్కెటింగ్‌ మటుకు భలే కొత్త తరహాలో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాంలో నీ పిల్లలతో చేయిస్తున్నావు చూడూ! అదీ నీ తెలివి. భలేగా ఉందే నీ ఐడియా’’ అంటూ అభినందించింది రేవతి.

‘‘మీరు ఇచ్చిన పాత ఫోన్‌లో అయన్నీ నేర్సుకున్నాను అమ్మా’’ చెప్పింది వినయంగా.
ఇంతలో శిల్పారామం దర్శించడానికి వచ్చిన వాళ్ళు సావిత్రి, పిల్లలను గుర్తుపట్టి ఫొటోలు తీయించుకుంటున్నారు.
‘‘నాకు కూడా ఒక సెల్ఫీ ఇవ్వవే నువ్వు ఇంకా పైకి ఎదిగిపోతే మాకు దొరకవు కూడానూ’’ నవ్వుతూ అంది రేవతి . 
‘‘అయ్యో అమ్మగారు! మిమ్మల్ని మర్చిపోవడమా, ధైర్యంగా బతకడం ఎలాగో నేర్పినది మీరే.’’ అంటూ ఇద్దరినీ ఫ్రేములోకి బిగించి క్లిక్‌మనిపించింది. సావిత్రి మొహంలో చిరుగర్వం, ఆత్మవిశ్వాసం.. ఎదురుదెబ్బలెన్ని తగిలినా, గండాలు వచ్చినా స్థిరంగా తన కాళ్ల మీద నిలబడగలిగాననే చిరుగర్వం! రేవతి మొహంలో సంతృప్తి... తన కళ్లెదుటే మారాకు తొడిగిన మొక్క, మహావృక్షంగా ఎదిగిన క్రమంలో తాను కూడా కొంత చేదోడు కాగలిగాననే సంతృప్తి! ఆ ఆనందసమయంలో సూరిబాబు గురించి అడగలేకపోయింది రేవతి.

పని చేయలేని అశక్తుడితో, చేతకానివాడితో సర్దుకుపోవచ్చు. పని చేయదలచుకోని వాడితో ఎంతకాలం సర్దుకుపోగలం?
బాధ్యత తెలియని వాడితో సర్దుకుపోవచ్చు. బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూసేవాడితో ఎలా సర్దుకుపోవడం?
సుఖపడేవాళ్లను చూసి ఓర్వలేని వాడి నైచ్యం అర్థం చేసుకోవచ్చు. కానీ కష్టపడేవాళ్లని చూసి కూడా ఓర్వలేని వాడిని ఎలా సహించడం? ఆస్పత్రి పాల్జేసి మంచం పట్టించిన అనారోగ్యం సావిత్రికి ఓ బతుకుపాఠం నేర్పింది! చేదుకట్టు దేహానికి అవసరమే! అది ఎందుకూ కొరగాకుండా పోయినప్పుడు, ఉపేక్ష కూడా కూడా ప్రమాదమే... కత్తిరించి తీసేయడమే దేహానికి రక్ష! బతికినంత కాలమూ కొన్ని జాగ్రత్తలు తప్పవు. నిజమే, తాళికట్టిన పెనిమిటే. జీవితానికి అవసరమే. కాని, ఒక నిర్ణయానికి వచ్చింది సావిత్రి. సావిత్రి చేసింది తప్పో ఒప్పో ఎవరు చెప్పగలరు? ఆమె అనుభవించిన ఆనందమైనా, బాధైనా ఆమె స్వంతం కదా మరి.

- చాగంటి ప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement