మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఆగస్టు 15 నాటితో 79 ఏళ్లు పూర్తవుతున్నాయి. మన స్వాతంత్య్రం 80వ ఏట అడుగిడుతోంది. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్‌వారు మన దేశాన్ని దాదాపు రెండువందల సంవత్సరాలు పాలించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1857లో సిపాయిల తిరుగుబాటు చెలరేగింది. దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన తొలి పోరాటమది. ఆ పోరాటం విఫలమైన తర్వాత కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పలు ఉద్యమాలు నడిచాయి.
దక్షిణాఫ్రికాలో 1906లో అహింసా పోరాటంతో విజయం సాధించిన గాంధీజీ స్వదేశానికి తిరిగి వచ్చాక 1917 ఏప్రిల్ 17న తొలిసారిగా ‘చంపారన్ సత్యాగ్రహ’ ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీ నాయకత్వంలో ఏకమైన ప్రజానీకం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలను ఉద్ధృతం చేసింది. చివరకు బ్రిటిష్ పాలకులు గద్దె దిగడంతో 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం వచ్చింది.
భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రభుత్వం ‘స్వేచ్ఛను గౌరవిస్తూ, భవితకు స్ఫూర్తిన్తూ’ నినాదాన్ని నేపథ్యంగా ఎంచుకుంది. గడచిన 79 ఏళ్లలో అధిగమించాల్సిన సమస్యలు చాలానే ఉన్నా, మన దేశం శాస్త్ర సాంకేతిక ఆర్థిక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించింది. ఈసారి ఆగస్టు 15న ఎర్రకోట వద్ద జరగనున్న వేడుకల్లో తొలిసారిగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన సైనిక సామగ్రిని ప్రదర్శించనున్నారు. ప్రధాని ప్రసంగాన్ని ‘డిజిటల్ ఇండియా భాషిణి’ ద్వారా ఏకకాలంలో ఇరవై భాషల్లో అప్పటికప్పుడే ప్రసారం చేయనున్నారు.
ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర పోరాటంలో కొన్ని కీలకమైన మైలురాళ్లు...
1857
ఆనాటి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది.
1858
భారత ప్రజల రాజకీయ ఆకాంక్షల సాధన కోసం భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది.
1905
బెంగాల్ విభజన. దీనికి పర్యవసానంగా స్వదేశీ ఉద్యమం మొదలైంది.
1919
జలియన్‌వాలాబాగ్ దురంతం జరిగింది. తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యమజ్వాలలు ఎగసిపడ్డాయి.
1920–22
గాంధీజీ నాయకత్వంలో సహాయ నిరకరణోద్యమం దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా నడిచింది.
1930
గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు.
1942
‘క్విట్ ఇండియా’ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో ఊరూరా నిరసనలు జరిగాయి.
1947 ఆగస్టు15
బ్రిటిష్ ప్రభుత్వం భారత్‌కు స్వాతంత్య్రాన్ని ప్రకటించింది.


