అలర్జీస్‌... అలెర్ట్‌ ప్లీజ్‌! | Allergies and Sinus Problems Worsen in Monsoon | Sakshi
Sakshi News home page

అలర్జీస్‌... అలెర్ట్‌ ప్లీజ్‌!

Aug 9 2026 1:27 AM | Updated on Aug 9 2026 1:27 AM

Allergies and Sinus Problems Worsen in Monsoon

ఇవి వానల కాలం. వాతావరణంలో కాస్త తేమ ఎక్కువగా ఉండే సమయం. అందుకే మామూలుగా వచ్చే అలర్జీలతో పోలిస్తే ఈ సీజన్‌లో అవి మరింత ఎక్కువ. వర్షాకాలం మొదలు కాగానే సీజనల్‌ సైనసైటిస్, అలర్జీ వంటి ఆరోగ్య సమస్యలు బాగా పెరిగిపోతాయి. ఈ సీజన్‌లో గాలిలో దుమ్ము, పుప్పొడి కణాలు, ఫంగస్‌ (బూజు) ఎక్కువగా వ్యాపించడం వల్ల ముక్కు, సైనస్‌లలో వాపు, ఇన్ ఫెక్షన్లు, అలర్జీలు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఆస్తమా లేదా అలర్జీ వంటి ఆరోగ్య చరిత్ర  ఉన్నవాళ్లలోనూ, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయన్నది వైద్యవర్గాల మాట. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో కనిపించే సాధారణ అలర్జీలపై అవగాహన కోసం ఈ కథనం...

ఈ సీజన్‌లో ఉండే కాస్తంత తేమ వాతావరణంలో గాలిలోని కాలుష్యం త్వరగా చెదిరిపోకుండా చాలాసేపు ఉండటం, పరాగరేణువుల (పోలెన్‌) వ్యాప్తి, దుమ్ము, ఫంగస్‌ స్పోరుల కారణంగా సీజనల్‌ అలర్జీలు పెరుగుతాయి. దాంతో ముఖ్యంగా వర్షాకాలం మొదలు కాగానే ముక్కు, చెవి, గొంతుకు సంబంధించిన (ఈఎన్ టీ) సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సాధారణంగా అలర్జీలను కూడా మామూలు జలుబుగా భావించి నిర్లక్ష్యం చేస్తే సైనసైటిస్, చెవిలో ఇన్ ఫెక్షన్లు, దీర్ఘకాలిక ముక్కుదిబ్బడ వంటి సమస్యలకు దారితీయవచ్చన్నది నిపుణుల మాట. అందుకే ఈ సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలి. 

ఏయే రకాల ఆరోగ్య సమస్యలు ఎలా వస్తాయంటే... 
మానవుల స్కల్‌ భాగంలో ముక్కు చుట్టూ గాలి నిండిన చిన్న గదులుంటాయి. వీటిని  సైనస్‌లు అంటారు. వైరల్, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు లేదా అలర్జీల కారణంగా వీటిలో వాపు ఏర్పడి శ్లేష్మం (మ్యూకస్‌) బయటకు వెళ్లకుండా పేరుకుపోయి బాధించే సమస్యను సైనసైటిస్‌గా పిలుస్తారు. మరోవైపు దుమ్ము, పుప్పొడి, ఫంగస్, పెంపుడు జంతువుల వెంట్రుకలు (డాండర్‌) వంటి అలర్జీ కారకాల ప్రభావంతో ముక్కు లోపలి పొరల్లో వాపు రావడాన్ని అలర్జిక్‌ రైనైటిస్‌గా పేర్కొంటారు.

లక్షణాలు 
సైనసైటిస్‌ ఉన్నవారిలో సాధారణం గా... ∙దగ్గు, ∙జ్వరం ∙అలసట  ∙ముక్కు బిగుసుకుపోవడం, ∙పసుపు లేదా ఆకుపచ్చ రంగులో శ్లేష్మం / తెమడ (మ్యూకస్‌)  వస్తుండటం, ∙నుదురు, చెంపలు, కళ్ల చుట్టూ నొప్పి లేదా ఒత్తిడి ఉన్నట్లు అనిపిస్తుండటం,
∙తీవ్రమైన తలనొప్పి, ∙గొంతులోకి  కఫం దిగుతుండటం,  రుచి–వాసనలు గుర్తించే శక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

అలర్జీతో బాధపడుతున్నవారిలో సాధారణంగా...
∙వరుసగా తుమ్ములు రావడం, ∙ముక్కు నుంచి నీరు కారడం, ∙ముక్కు, కళ్లలో దురద, ∙కళ్లు ఎర్రబడి నీరు కారడం, ∙గొంతులో దురద, ∙ముక్కు మూసుకుపోవడం వంటివి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. కొందరిలో
∙శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ∙పిల్లికూతలు (వీజింగ్‌) కూడా కనిపించవచ్చు.

మామూలు జలుబుకూ సైనసైటిస్‌కు తేడా... 
సాధారణ జలుబుతో పోలిస్తే సైనసైటిస్‌ లక్షణాలు పది రోజులకుపైగా కొనసాగడం, ముఖంలో ఒత్తిడి, తలనొప్పి ఎక్కువగా ఉండడం, దట్టమైన కఫం రావడం వంటి లక్షణాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. సైనసైటిస్‌ను, అలర్జీలను నిర్లక్ష్యం చేస్తే చెవి ఇన్ఫెక్షన్లు, ఆస్తమా తీవ్రత పెరగడం, దీర్ఘకాలిక సైనసైటిస్‌ వంటి సమస్యలు వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే పై లక్షణాలు కనిపిస్తున్నప్పుడు మామూలు జలుబుగా భావించి వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. 

నిర్ధారణ పరీక్షలు .
బాధితుల వైద్య చరిత్రను పరిశీలించాక డాక్టర్లు అవసరాన్ని బట్టి... ∙కొన్ని రకాల రక్త పరీక్షలు ∙నాసల్‌ ఎండోస్కోపీ ∙సీటీ స్కాన్  ∙అలర్జీ స్కిన్  ప్రిక్‌ టెస్ట్‌ వంటి వైద్యపరీక్షలను సూచిస్తారు. సమస్య తీవ్రతను బట్టి చికిత్స అందిస్తారు.
నివారణ ఇలా... బయట నుంచి ఇంట్లోకి రాగానే ∙ముఖం, చేతులు కడుక్కోవడం, ∙అవసరమైతే స్నానం చేయడం, ∙దుమ్ము ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మాస్క్‌ ధరించడం, ∙ఇండ్లలో, పరిసరాల్లో దుమ్ము, బూజు పేరుకుపోకుండా చూడడం, ∙ఇంటినీ, పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచడం, ∙బెడ్‌షీట్లు, ∙దిండ్ల కవర్లును  తరచూ ఉతకడం, ∙తగినంత నీరు తాగడం, ∙వర్షంలో తడిస్తే వెంటనే పొడి దుస్తులు ధరించడం, ∙పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం ∙వైద్యుల సూచన లేకుండా మందులు వాడకపోవడం వంటి సాధారణ అలవాట్లు సీజనల్‌ అలర్జీలనూ, సైనసైటిస్‌ వంటి సమస్యలను నివారిస్తాయి. 

చికిత్స ఇలా... చికిత్సలో అలర్జీని కలిగించే కారకాలకు వీలైనంత దూరంగా ఉండటం మొట్టమొదటి జాగ్రత్తగా / చికిత్సగా పరిగణించవచ్చు. డాక్టర్లు అవసరాన్ని బట్టి యాంటీహిస్టమిన్‌ మందులు, స్టెరాయిడ్‌ నాసల్‌ స్ప్రేలు, సెలైన్‌ నాసల్‌ వాష్‌లు, డీకంజెస్టెంట్ల వంటి మందులను సూచిస్తారు. తరచూ తీవ్రమైన అలర్జీలతో బాధపడుతుండేవారికి ఏయే అంశాల కారణంగా వారికి ఆ అలర్జీ ఏర్పడుతుందో తెలుసుకునే పరీక్షల తర్వాత ఇమ్యునోథెరపీ (అలర్జీ షాట్స్‌) కూడా వాడుతుంటారు. అయితే గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే... యాంటీబయాటిక్స్‌నూ, స్టెరాయిడ్‌ మందులను ఎవరికి వారు ఆన్‌ కౌంటర్‌ మెడిసిన్‌గా వాడటం సరికాదు. 
చివరగా... బాధితుల్లో  అధిక జ్వరం (హై ఫీవర్‌), ∙ముక్కు బిగుసుకుపోవడం, ∙ముఖంలో తీవ్రమైన నొప్పి, ∙కళ్ల చుట్టూ వాపు... ఈ లక్షణాలు పది రోజులకుపైగా కొనసాగితే దాన్ని మామూలు జలుబుగా భావించి నిర్లక్ష్యం వహించకుండా, ఆలస్యం చేయకుండా డాక్టర్లు / ఈఎన్ టీ నిపుణులను తప్పక సంప్రదించాలి. 
 

డాక్టర్‌ మహమ్మద్‌ నసీరుద్దీన్‌
సీనియర్‌ కన్సల్టెంట్‌ ఈ ఎన్‌ టీ – హెడ్‌ – నెక్‌ సర్జన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement