సృజన
‘ఈ కాలం పిల్లలు కథలు వింటారా! వారికి స్మార్ట్ ఫోన్ ఇస్తే చాలు’ అనే తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. ‘అలా చేయకండి. మీ నోటితో స్వయంగా కథలు వినిపించండి’ అంటున్నారు కళ్యాణి గోపకుమార్.
ఇంటీరియర్ డిజైనర్, కథకురాలు అయిన కళ్యాణి గోపకుమార్ ‘ఒరిదతోరిదత్ బై కళ్యాణి’ అనే ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పిల్లలను కథల ప్రపంచంలోకి తీసుకువెళుతున్నారు. ప్లాట్ డిజిటల్ స్క్రీన్ పిల్లల ఊహలకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వదు. కానీ, నోటితో చెప్పే కథలు వారి ఊహలకు రెక్కలు ఇస్తాయి’ అంటున్నారు కేరళలోని కోచికి చెందిన కళ్యాణి గోపకుమార్....
పెద్దల నోటి నుంచి విన్న జానపద కథల ప్రపంచంలో పెరిగిన కళ్యాణిని చాలామంది ‘క్రియేటివ్ ఆర్టిస్ట్’ అని పిలుస్తుంటారు. తన ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థ ‘ది పోర్ట్రయిట్’ ద్వారా భౌతిక నిర్మాణాలు(ఫిజికల్ స్ట్రక్చర్స్), ‘ఒరిదతోరిదత్’ ప్రాజెక్ట్ ద్వారా పిల్లలు తమ ఊహా ప్రపంచాలు నిర్మించుకునేలా చేస్తున్నారు కళ్యాణి.
→ ఆ ఐడియా అలా వచ్చింది...
ఒకరోజు కళ్యాణి కుమారుడు అమ్మమ్మ చెప్పిన కథను చాలా ఆసక్తిగా విన్నాడు. ఆ అపురూప దృశ్యాన్ని చూసిన కళ్యాణి తన పిల్లాడికి మాత్రమే కాదు పిల్లలందరికీ కథలు చెప్పాలని నిర్ణయించుకుంది. అమ్మ, అమ్మమ్మ చెప్పిన పురాతన కథలను గుర్తు తెచ్చుకొని వాటికి అక్షర రూపం ఇచ్చి భద్రపరిచింది. ఈ కథలు స్పాటిఫై పాడ్‌కాస్ట్‌లో ప్రసారమయ్యాయి. వీటికి మంచి స్పందన వచ్చింది.
‘పిల్లలలోని సహజమైన సృజనాత్మక సామర్థ్యాలకు ప్రకాశవంతమైన రంగుల కార్టూన్లు, స్పీడ్‌గా పరుగెత్తే వీడియోలు ఆటంకం కలిగిస్తాయి. పిల్లల్లో సృజనాత్మకత సహజంగా పెరగడానికి మాతృభాషలో కథ చెప్పడం ఒక విధానం. మాతృభాషపై పట్టు ఉన్న పిల్లలు సైన్స్, మ్యాథ్స్‌లలో అద్భుతంగా రాణించగలరు’ అంటున్నారు కళ్యాణి.
→ కథ తర్వాత...
‘కథలో నేను చెప్పిన రాక్షసుడు ఎలా ఉంటాడో గీసి చూపించండి’ అని పిల్లలను అడుగుతారు కళ్యాణి. ఎవరి ఊహకు తోచినట్లు వారు బొమ్మ గీసి చూపిస్తారు!
పిల్లలకు ఆసక్తి కలిగించడానికి కథల వర్క్‌షాప్‌లలో వివిధ పద్ధతులను అనుసరిస్తుంటారు కళ్యాణి. కథలు చెబుతున్నప్పుడు పాత్రలకు తగినట్లు గొంతు మార్చడం అనేది అందులో ఒకటి. తన చిన్నప్పుడు అమ్మమ్మ నోటి నుంచి విన్న ‘అంగారవల్లి’ కథను ఎప్పుడూ గుర్తుతెచ్చుకుంటారు కళ్యాణి. ‘అంగారవల్లి’ అనేది ‘సిండ్రెల్లా’కు సౌత్ ఇండియన్ వెర్షన్. ‘కథలు చెప్పడం, వినడం అనే ప్రక్రియ పిల్లలు, తల్లిదండ్రుల మధ్య బంధాలను మరింత బలోపేతం చేస్తుంది’ అంటున్నారు కళ్యాణి గోపకుమార్.
ఇలా చెప్పాలి...
పిల్లలకు కథ చెప్పడం అంటే...కేవలం కథ చెప్పడం మాత్రమే కాదు. కథ చెప్పే క్రమంలో పిల్లలపై మీకు ఉండే ఇష్టం ప్రతిఫలించాలి. పిల్లల పక్కన కూర్చొని కథ చెప్పడం వల్ల, వారికి మీకు మధ్య బంధం బలపడుతుంది. కథ చెప్పిన తరువాత ఆ కథకు సంబంధించి సందేహాలు అడిగేలా వారిని ప్రోత్సహించాలి. అలా చేయడం వల్ల పిల్లల్లో కుతూహలం, ఉత్సాహం పెరుగుతాయి. వారి మానసిక వికాసానికి ఇది మంచిది.
– కళ్యాణి గోపకుమార్


