తల్లికి మళ్లీ మోసం! | Chandrababu Naidu government is cheating for the third year in talliki vandanam | Sakshi
Sakshi News home page

తల్లికి మళ్లీ మోసం!

Jul 25 2026 3:07 AM | Updated on Jul 25 2026 3:07 AM

Chandrababu Naidu government is cheating for the third year in talliki vandanam

మూడో ఏడాదీ చంద్రబాబు సర్కార్‌ మాయాజాలం

తొలి ఏడాది పూర్తిగా ఎగవేత.. రెండో ఏడాది అరకొర.. ఇప్పుడూ అదే తీరు

అసలే రాక కొందరు.. సగమే వేశారంటూ మరికొందరు ఆందోళన 

అనర్హుల జాబితాల్లో పేర్లుండడంతో గందరగోళం 

ఎందుకు ఇవ్వలేదో కూడా అర్థం కాక పెద్ద సంఖ్యలో సతమతం 

ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడు కరువు  

ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామని ఎన్నికల ముందు హామీ 

అన్ని అర్హతలున్నా అనర్హుల జాబితాలో చాలా మంది పేర్లు 

చాలా మంది తల్లులకు ఇద్దరు పిల్లలుంటే ఒక్కరికే అరకొరగా నగదు జమ

యూడైస్‌ గణాంకాలను బట్టి 87.41 లక్షల మంది విద్యార్థులు.. ప్రభుత్వ నిర్వాకం వల్ల తగ్గిన విద్యార్థులు.. ప్రస్తుత డేటా ప్రకారం తీసుకున్నా 84.55 లక్షల మంది అర్హులు 

కానీ ప్రభుత్వం ఇస్తామని చెబుతోంది 64.76 లక్షల మందికి మాత్రమే  

ఎవ్వరికీ రూ.15 వేలు ఇవ్వని వైనం.. అందరికీ రూ.7 వేల నుంచి రూ.10 వేలే

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ప్రభుత్వంలో ప్రారంభించిన అమ్మ ఒడి పథకానికి తల్లికి వందనం అనే పేరు మార్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ పథకానికి తూట్లు పొడుస్తోంది. ఎన్నికలకు ముందు ‘‘నీకు 15 వేలు.. నీకు 15 వేలు.. నీకు 15 వేలు.. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఒక్కొక్కరికీ రూ.15 వేలు’’ అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ఆయన పరివారం.. అవసరం తీరిన తర్వాత తల్లులకు వెన్నుపోటు పొడిచారు. తొలి ఏడాది పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది అరకొరగా నిధులు విదిల్చి గొప్పగా ప్రచారం చేసుకున్నారు. 

ఎన్నికల ముందు మేనిఫెస్టోలో తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15,000 ఇస్తామని హామీ ఇచ్చిన టీడీపీ  

మూడో ఏడాదైనా పూర్తిగా పథకాన్ని అమలు చేస్తారని ఎదురు చూస్తున్న తల్లులను నిలువునా మోసం చేస్తున్నారు. ప్రచారంలో మాత్రం తొలి ఏడాది ఎగవేసిన దానిని దాచిపెట్టి, రెండవ ఏడాది అరకొరగా ఇచ్చినదానినే తొలి ఏడాదిగా, ప్రస్తుత విడతను రెండో ఏడాదిగా చెప్పుకుంటున్నారు. ఖాతాల్లో డబ్బులు పడతాయని ఎదురు చూసి మోసపోయిన తల్లులు సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడ అర్హులు, అనర్హుల జాబితాలు ఉంచడంతో అందులో తమ పేరును వెతుకుతున్నారు. నమ్మశక్యం కాని సాకులతో, బతికున్న పిల్లలు చనిపోయినట్లుగా, ఇద్దరు పిల్లలుంటే ఒక్కరినే చూపి, మరొకరిని వదిలేసినట్లు తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

బాబు మార్కు మోసపు ప్రకటన : మొదటి ఏడాది తల్లికి వందనం పూర్తిగా ఎగ్గొట్టి.. అరకొరగా ఇచ్చిన రెండో ఏడాదిని మొదటి ఏడాదిగా చెప్పుకుంటూ నిస్సిగ్గుగా చంద్రబాబు ప్రభుత్వం ‘ఈనాడు’లో ఆర్భాటంగా ఇచ్చిన ప్రకటన   

నిలిచిపోయిన వెబ్‌సైట్‌ 
తమకు అన్ని అర్హతలు ఉన్నా, ఎందుకు డబ్బులు ఎగవేశారో తెలియక తల్లులు సచివాలయాలకు వెళితే అక్కడ వారి గోడు వినేవారే లేరు. ఒక వేళ విందామని ఎవరైనా అనుకున్నా కూడా ప్రభుత్వం వారికి ఆ అవకాశం ఇవ్వడం లేదు. అర్జీలు నమోదు చేసేందుకు అవకాశమే లేకుండా సంబంధిత వెబ్‌సైట్‌ను శుక్రవారం నిలిపి వేసింది. ఆన్‌లైన్‌లో చూస్తే కొంత మంది విద్యార్థుల వివరాలు కనిపించడం లేదు. ఇదేమిటని తల్లులు అడుగుతుంటే, తమకు తెలియదని సచివాలయ సిబ్బంది తెల్లముఖం వేస్తున్నారు. కొందరు పై స్థాయి అధికారులకు చెప్పినా వారి నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. దీంతో తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు.  

నలుగురు పిల్లల్లో ఒక్కరికీ ఇవ్వలేదు 
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని  జక్కరవలస గ్రామానికి చెందిన జానకి, సవర వెంకటరావు దంపతులకు ఐదుగురు కుమార్తెలు. వీరిలో నలుగురు చదువుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి డబ్బులు క్రమం తప్పకుండా ఇచ్చారు. పిల్లల చదువులకు ఉపయోగపడ్డాయి. ఈ ప్రభుత్వం ఇంట్లో పిల్లలందరికీ తల్లికి వందనం డబ్బులు వేస్తామని చెప్పింది. కానీ ఒక్కరికీ రావడం లేదు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. నలుగురు పిల్లలకు కలిపి రూ.15 వేల చొప్పున రూ.60 వేలు రావాలి. ఒక్క రూపాయి కూడా పడలేదు.  

ఉన్నది ఎంత మంది? ఇచ్చింది ఎంత మందికి?  
యునిఫైడ్‌ డి్రస్టిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ (యూడీఐఎస్‌ఈ–యూడైస్‌) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87.41 లక్షల మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతున్నారు. వీరికి రూ.15 వేల వంతున ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది 2024–25లో పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది 2025–26లో 67.27 లక్షల మందికి రూ.10,090 కోట్లను తల్లికి వందనం కింద పంపిణీ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ వాస్తవంగా ఇచ్చింది మాత్రం రూ.6,377 కోట్లే. ఆ అరకొర నగదు కూడా పడని వారి సంఖ్య గత ఏడాది 21 లక్షలు.

ఈ ఏడాదీ అదే పరిస్థితి. మూడేళ్లలో తల్లులకు రూ.39,338.46 కోట్లు జమ చేయాల్సి ఉండగా, గత ఏడాది జమ చేసింది రూ.6,377 కోట్లు, ఈ ఏడాదీ జమ చేస్తున్నదీ దాదాపు అంతే. ఎందుకంటే ఈ ఏడాది కూడా అరకొరగానే ఇస్తున్నారు. ఈ లెక్కన ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం రూ.26,584 కోట్లు బకాయి పడింది. యూడైస్‌ ప్రస్తుత డేటా ప్రకారం తీసుకున్నా, ఈ ప్రభుత్వం అశ్రద్ధ, వైఫల్యం వల్ల విద్యార్థుల సంఖ్య 84.55 లక్షలకు తగ్గింది.

ఈ లెక్కన తీసుకున్నా కూడా ఈ ఏడాది (2026–27) రూ.12,684.5 కోట్లు ఇవ్వాలి. అయితే ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకుంటూ రూ.10,090 కోట్లు మాత్రమే కేటాయించింది.  అయితే ఈ మొత్తం కూడా పంపిణీ చేయరని క్షేత్ర స్థాయిలో పరిస్థితి స్పష్టం చేస్తోంది. కొంత మంది పిల్లలకు రూ.7, 8 వేలు మాత్రమే ఇవ్వడం ఇందుకు నిదర్శనం. అది కూడా ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికే ఇచ్చి.. మరొకరికి ఇవ్వని పరిస్థితి.    

చేతల్లోనూ కోతలు 
చంద్రబాబు ప్రభుత్వం మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లోనూ కోతలు కోస్తోందని తల్లికి వందనం లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రకాశం జిల్లా ఉలవపాడు పంచాయతీ పరిధిలోని గంజి ఆదిలక్ష్మి, దాసరి వరలక్ష్మి, శ్రీలక్ష్మిలకు రూ.10,900 చొప్పున మాత్రమే జమ అయింది. మిగతా డబ్బులు ఎప్పుడు వేస్తారని వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మండలంలో చాలా మందికి ఇద్దరు పిల్లలుంటే ఒక్కరికి మాత్రమే డబ్బులు జమ అయ్యాయి. ఉలవపాడు–1 సచివాలయం పరిధిలో 97 మంది అర్హులకు మొండి చేయి చూపారు.  

అమ్మానాన్న లేరు.. ముగ్గురికీ రాలేదు
మా తల్లిదండ్రులు కొమ్మిరి శ్రీవాణి, కొమ్మిరి జనార్ధనలకు మేము ముగ్గురు పిల్లలం. ముగ్గురం చదువుతున్నాం. తల్లికి వందనం అర్హుల జాబితాలో మా పేర్లు లేవు. మా అమ్మా నాన్న చనిపోయారు. మా కష్టం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. మా తాత కొమ్మిరి నాగమల్లప్ప స్కూల్‌ దగ్గరికి, సచివాలయం ఆఫీసర్‌ దగ్గరికి తిరుగుతూ ఉన్నా ఎవరూ సమాధానం చెప్పడం లేదు. దయవుంచి తల్లి, తండ్రి లేని మాకు న్యాయం చేయాలి. - కొమ్మిరి కీర్తన,మాతాశ్రీ, శ్రావణీంద్ర, గుడుపల్లి, అన్నమయ్య జిల్లా.  

కూలీ కుటుంబానికి అర్హత లేదా? 
మా నాన్న బాలకృష్ణ, అమ్మ సంధ్య కూలి పని చేస్తారు. మేము ముగ్గురు పిల్లలం. ఒకరు  పాతమేఘవరం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి, మిగతా ఇద్దరం చిన్న మరువాడ ప్రాథమిక పాఠశాలలో ఐదు, మూడో తరగతులు చదువుతున్నాం. తల్లికి వందనం పథకం కింద మాలో ఒక్కరికి కూడా డబ్బులు రాలేదు. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు.  - సంధ్య పిల్లలు, చిన్న మరువాడ, సంతబొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లా  

ఇద్దరు ఉంటే ఒక్కరికే..
కర్నూలు జిల్లా ఆదోని మండలం మండగిరి గ్రామ పంచాయతీ భరత్‌ నగర్‌కు చెందిన గొల్ల లలిత, నాగిరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు. ఒకరు 3, మరొకరు 1వ తరగతి. వీరిలో ఒకరికే వచ్చింది. ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు చదువుతున్న­ప్పటికీ ఒకరి పేరు అర్హుల జాబితాలో లేదు. ఒకే ఇంట్లో ఇద్దరు చదివే పిల్లలుంటే ఒకరికి మాత్రమే ఇచ్చి, మరొకరికి ఎందుకివ్వలేదని అడిగితే సమాధానం చెప్పే వారే లేరు. తల్లికి ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఎగ్గొట్టారనడానికి ఈ కుటుంబమే నిదర్శనం. 

వీరికి ఎందుకు ఇవ్వలేదు?
ఎన్టీఆర్‌ జిల్లా ఏ కొండూరు మండలం పోలిశెట్టిపాడుకు చెందిన వేముల సుహాసిని కుమారుడు శ్రీ చరణ్‌ తిరువూరులోని ప్రైవేట్‌ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. తల్లికి వందనం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనర్హుల జాబితాలో చేర్చారని తల్లి సుహాసిని వాపోయారు. బాలుడి తండ్రి నరసింహారావు తిరువూరులో చిన్న ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయినా ఈ ‘తల్లి’కి వందనం దక్కలేదు.

ఇస్తామని చెప్పి మాట తప్పారు 
నా భర్త లేకపోయినా నాలుగు ఇళ్లలో పని చేసుకుంటూ కుమార్తెను చదివించుకుంటున్నా. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా తల్లికి వందనం రాలేదు. సచివాలయానికి వెళ్లి అడుగుతుంటే ఏమీ చెప్పడం లేదు. ప్రభుత్వం పేదలను ఇలా ఇబ్బంది పెట్టడం మంచిదికాదు. చెప్పిన మాట మేరకు అందరికీ ఇవ్వాలి.   – నూకరత్నం, సామర్ల కోట, కాకినాడ జిల్లా..

నిజాయితీగా వ్యవహరించాలి 
మాకు ఇద్దరు పిల్లలు. కీర్తి 10వ తరగతి, మైథిలి 9వ తరగతి చదువుతున్నారు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి కింద డబ్బులు పడ్డాయి. ఏ లెక్కన తీసుకున్నా ఈ పథకానికి మాకు పూర్తి అర్హత ఉంది. కానీ అన్యాయంగా డబ్బులు జమ చేయకుండా దుర్మార్గంగా వ్యవహరించారు. నిజాయితీగా పథకం అమలు చేయలేనప్పుడు హామీలు ఇవ్వకూడదు.– కందుల సుభాషిణి, నరసాయపాలెం,     యర్రగొండపాలెం మండలం, మార్కాపురం జిల్లా   

సాకులు చెప్పి ఎగ్గొడతారా? 
మా కుమారుడు బుచ్చిరెడ్డిపాళెంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. గత ప్రభుత్వంలో మాకు అమ్మఒడి పథకం క్రమం తప్పకుండా అందింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక తల్లికి వందనం నగదు జమ కావడంలేదు. ఈ విషయమై ఎవరిని అడగాలో తెలియడం లేదు. ఏవో సాకులు చెప్పి డబ్బులు ఎగ్గొట్టడం దారుణం. – రమీజా, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరుజిల్లా 

రూ.8,800 మాత్రమే పడ్డాయి 
నా కుమారుడు గజపతినగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలకు గాను రూ.8,800 మాత్రమే బ్యాంకు ఖాతాకు జమయ్యాయి. మా గ్రామానికి చెందిన కంటా సుగుణ అనే మరో మహిళకు రూ.10,800 జమైంది. ఇలా చాలా మందికి తక్కువ డబ్బులు వేశారు. రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇలా సగం సగం ఇవ్వడం బాగోలేదు. మిగతా బకాయిలు వెంటనే ఇవ్వాలి.    – పోరాపు దేవుడమ్మ, పోరాపుబాడవ, మెంటాడ మండలం, విజయనగరం జిల్లా  

నిరుపేదలకూ ఇవ్వరా? 
మాకు ఇద్దరు పిల్లలు. పెద్దకుమారుడు షణ్ముఖవేలు పిచ్చాటూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం, చిన్నకుమారుడు మోకేష్‌ పిచ్చాటూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మాది రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబం. నేను ఆటో డ్రైవర్‌ కాగా, నా భార్య ఉపాధి హామీ పథకం కూలీ. మా పిల్లలకు తల్లికి వందనం నగదు బ్యాంకులో జమ కాలేదు. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. నిరుపేదలైన మాకు ఆ డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలి.   – కుప్పం, అప్పంపేట, పిచ్చాటూరు మండలం, తిరుపతి జిల్లా 

మిగతా సొమ్ము ఏమైంది? 
మా కుమార్తె కేజీబీవీలో 10వ తరగతి, కుమారుడు స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. తల్లికి వందనం పథకం కింద ఒకరికి రూ.13 వేలు, మరొకరికి రూ.8,800 జమ అయింది. సచివాలయ జాబితా పరిశీలిస్తే ఇద్దరికీ రూ.13 వేలు జమ అయినట్లు చూపిస్తోంది. కానీ మిగిలిన సొమ్ము ఎందుకు పడలేదో ఎవరూ సమాధానం చెప్పడం లేదు.     – వాన గుణవతి, సారవకోట, శ్రీకాకుళం జిల్లా 

బతికున్నా.. చంపేశారు 
మాటలు రాని ఓ గిరిజన బాలుడు బతికున్నా చంద్రబాబు ప్రభుత్వం చంపేసింది. ఆన్‌లైన్‌లో విద్యార్థి మరణించినట్లుగా నమోదు కావడంతో రెండేళ్లుగా తల్లికి వందనం పథకం అందడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం టి.కె.జమ్ము పంచాయతీ పరిధిలోని చినదొడిజ గ్రామానికి చెందిన ఆరిక పాపారావు కుమారుడు ఆరిక జీవన్‌స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ.. బాలుడిని అనర్హత జాబితాలో చూపారు. 

ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉండడంతో తల్లిదండ్రులు సచివాలయంలో సంప్రదించారు. ఆన్‌లైన్‌ రికార్డుల్లో విద్యార్థి మరణించినట్లు చూపుతోందని వారు తెలిపారు. తొలుత తమ కుమారుడు బతికున్నట్లు చూపిస్తే చాలని తండ్రి పాపారావు వేడుకున్నాడు. ఇది తమ పరిధిలో లేదని, ఉన్నతాధికారులను కలవాలని సచివాలయ సిబ్బంది చెప్పారు.  

వీరు ఏం పాపం చేశారు? 
వారిద్దరూ కవలలు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు. కళ్లు లేని, కాళ్లు కదపలేని 80 ఏళ్ల తాత వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. ఈ కవల విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు జమ కాలేదు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం నిద్దాం గ్రామానికి చెందిన ఇజ్జాడ హేమ, తవిటినాయుడు దంపతుల కుమారులు ఇజ్జాడ షణ్ముఖరావు, పురుషోత్తంనాయుడులు జి.సిగడాం మోడల్‌ పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో 80 ఏళ్ల వయసు గల తాత లక్ష్మి నాయుడు సంరక్షణలో ఉంటున్నారు. ఇద్దరు మనవళ్లకు కాసిన్ని డబ్బులు వస్తే సాయంగా ఉంటుందని ఆశించారు. దాని కోసం ఎంతో ప్రయత్నించారు. తీరా పడకపోయే సరికి.. తల్లికి వందనం డబ్బులు తమకు ఎందుకు పడలేదు బాబు అంటూ దీనంగా అడుగుతున్న తీరు పలువురి కంట నీరు తెప్పించింది. 

కొందరికే ఇవ్వడం దుర్మార్గం 
తల్లికి వందనం అందరికీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పుడు కొందరికి మాత్రమే డబ్బులు వేయడం దుర్మార్గం. నాకు ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కరికి కూడా ఇవ్వకపోవడం దారుణం. హామీలు ఇచ్చేటప్పుడు ఊదరగొట్టారు. అమలుకు వచ్చే సరికి చేతులెత్తేస్తున్నారు.   – వేమిరెడ్డి శ్రీలక్ష్మి, జి.కొండూరు, ఎన్టీఆర్‌ జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement