విజయవాడ: తరుచూ తల్లి తమను మందలిస్తోందని ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ అన్నాచెల్లులు.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండం సీతానగరం చేరుకున్నారు.. బ్యారేజీ వద్ద చేపలు విక్రయిస్తున్న వారి వద్దకు వెళ్లి తమకు తల్లిదండ్రులు ఇద్దరు లేరని... మమల్ని పెంచుకుంటారా అని అడిగారు. దీంతో వారు ఆ చిన్నారులను అక్కున చేర్చుకున్నారు..
కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గొల్లపాలెం గట్టు ప్రాంతానికి చెందిన అఖిల్, స్వేచ్ఛ అన్నాచెల్లెలు.. వీరిని తల్లి ప్రతి చిన్న విషయానికి మందలించడం, తిట్టడం, కోప్పడడం చేయడంతో మనస్తాపానికి గురై 21వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులైన రాజేశ్వరి, మహే‹Ùలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన కొత్తపేట సీఐ కొండలరావు పర్యవేక్షణలో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు చిన్నారులు ప్రకాశం బ్యారేజీ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గురువారం ఉదయం సీతానగరంలో చేపల విక్రయించే వారిని ఆరా తీయగా, తమ వద్దే ఉన్నట్లు పేర్కొని వారిని పోలీసులకు అప్పగించారు. సెక్టార్ ఎస్‌ఐ భారతి చిన్నారుల తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి వారిని అప్పగించారు.


