మార్చింది ఒక్క నిర్ణయమే! | KGF Star Srinidhi Shetty Opens Up About Her Journey in Cinema | Sakshi
Sakshi News home page

మార్చింది ఒక్క నిర్ణయమే!

Aug 9 2026 1:02 AM | Updated on Aug 9 2026 1:02 AM

KGF Star Srinidhi Shetty Opens Up About Her Journey in Cinema

కలలను నమ్మి ధైర్యంతో ఉద్యోగాన్ని వదులుకున్న సాధారణ అమ్మాయి శ్రీనిధి శెట్టి. పట్టుదలతో ముందుకు సాగి అందాల కిరీటాన్ని సొంతం చేసుకోవడమే కాదు; వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపును కూడా సంపాదించుకుంది. ఆ ప్రయాణంలో ఎదురైన ఎన్నో ఆసక్తికరమైన విషయాలన్నీ ఆమె మాటల్లోనే మీకోసం...

ఉద్యోగం వదిలేశాను... 
మాది మంగళూరు. చిన్నప్పుడు డాక్టర్‌ అవ్వాలనుకునేదాన్ని. కాలేజీ రోజుల్లో మోడలింగ్‌ వైపు మనసు మళ్లింది. కానీ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేసి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరాను. చాలాసార్లు కంప్యూటర్‌ ముందు కూర్చొని ఉన్నా, నా మనసు మాత్రం కెమెరా ముందే కనిపించేది. అందుకే, భయపడకుండా ఉద్యోగానికి గుడ్‌బై చెప్పా. ఆ నిర్ణయమే నా జీవితాన్ని మార్చేసింది.

కిరీటం తెచ్చిన అవకాశాలు
‘మిస్‌ సుప్రానేషనల్‌–2016’ టైటిల్‌ గెలవడం నా జీవితంలో పెద్ద మలుపు. ప్రపంచ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. అదే నన్ను సినిమాలవైపు నడిపించింది. ఇక ‘కేజీఎఫ్‌’ సినిమాతో ప్రేక్షకులు నన్ను ఎంతగా ఆదరించారో మాటల్లో చెప్పలేను. ఆ ప్రేమే నాకు మరింత బాధ్యతను గుర్తు చేస్తుంది.

కొరియన్  భాష అంటే ప్రత్యేకమైన ఆసక్తి!
కొత్త భాషలను నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా తూర్పు ఆసియా భాషలపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అందుకే, కొరియన్  భాషను బాగా అర్థం చేసుకోగలను. ప్రస్తుతం తుళు, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో నేను సులభంగా మాట్లాడగలను. తెలుగు ప్రేక్షకుల ప్రేమకు ప్రతిఫలంగా ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్‌ చెప్పాలని నిర్ణయించుకున్నాను. అది వాళ్లకు నేను ఇచ్చే చిన్న బహుమతి.

నేనూ ఆడిషన్ కే వెళ్తాను
‘కేజీఎఫ్‌’ తర్వాత అవకాశాలు నన్నే వెతుక్కుంటూ వస్తాయని, వాటిల్లో చాలా పెద్ద హీరోల సినిమాలను తిరస్కరించానని  చాలామంది అనుకున్నారు. కానీ అందులో నిజం లేదు. నేను కూడా ఆడిషన్ లకు వెళ్తాను. ప్రతి పాత్రను సంపాదించుకోవాల్సిందే. చివరికి ఏ పాత్రకు ఎవరు సరిపోతారో నిర్ణయించేది దర్శకుడే.

నా తొలి సంపాదన...  కేవలం రూ.500
ఈరోజు ఎంత సంపాదించినా... 2011లో మొదటిసారి అందుకున్న రూ.500 నాకు అత్యంత విలువైనది. ఒక కార్పొరేట్‌ ఈవెంట్‌లో పేపర్‌వర్క్, గేమ్‌ సెటప్‌లలో సహాయం చేసినందుకు ఆ డబ్బు వచ్చింది. అదే నా జీవితంలో తొలి సంపాదన. చిన్న మొత్తమే అయినా, అది నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.

సీత పాత్ర రాకపోయినా... బాధపడలేదు
నితేశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణం’లో సీత పాత్ర కోసం నేను కూడా ఆడిషన్  ఇచ్చాను. ఆ అవకాశం నాకు రాలేదు. కానీ ఆ పాత్రకు సాయిపల్లవి ఎంపిక కావడం చాలా సంతోషంగా అనిపించింది. ఆమె ఆ పాత్రకు అద్భుతంగా సరిపోతుందని నేను నమ్ముతున్నాను.

నా సీక్రెట్‌ అసలు ఫాలో కాకండి 
ఫిట్‌గా ఉండేందుకు నేను పెద్దగా కష్టపడను. అన్ని రకాల ఫుడ్స్‌ తింటాను. హోమ్‌ ఫుడ్‌ అంటే ఇష్టం. అయితే, రోజుకు రెండు పూటలే తింటాను. అదే నా సీక్రెట్‌. ఇది ఎవరూ ఫాలో కాకండి.

పార్టీల కంటే ప్రశాంతతే ఇష్టం 
పార్టీల కంటే ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లడం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ప్రశాంతమైన సాయంత్రాలు నాకు చాలా ఇష్టం. జీవితాన్ని సింపుల్‌గా ఆస్వాదించడం నేర్చుకున్నాను.

అలవాటు మానేశాను
సోషల్‌ మీడియాలో అభిమానుల ప్రేమ, కామెంట్స్, గాసిప్స్, వైరల్‌ న్యూస్‌ చదువుతుంటాను. కానీ వాటి గురించి ఆలోచించడం చాలా ఏళ్ల క్రితమే మానేశాను. ప్రస్తుతం నా ప్రతి సినిమా, మరో కొత్త ఆరంభంగా ఉండేలా చూసుకుంటున్నాను. మంచి కథలు, గుర్తుండిపోయే పాత్రలు చేయాలని ఎదురుచూస్తున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement