ఇండోర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు బాధితుడు రాజా రఘువంశీ సోదరులను, మరో ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.
గతేడాది హనీమూన్‌లో భార్య చేతిలో దారుణ హత్యకు గురైన వ్యాపారవేత్త రాజా రఘువంశీ సోదరులైన సచిన్ రఘువంశీ, విపిన్ రఘువంశీలు రావు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రెస్టారెంట్‌ను, వైన్‌షాపును నిర్వహిస్తున్నారు.ఈ వైన్‌షాప్, రెస్టారెంట్‌లో నిబంధనలకు విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై తక్షణమే విచారణ చేపట్టిన పోలీసులు.. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రాజా రఘువంశీ సోదరులతో పాటు అక్కడ పనిచేసే ముగ్గురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై ఎక్సైజ్ చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏసీపీ సక్సేనా వెల్లడించారు.
ఇండోర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాజా రఘువంశీకి, సోనమ్ రఘువంశీతో వివాహమైన అనంతరం గతేడాది మేలో హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే అక్కడ భార్య సోనమ్ తన ప్రియుడితో కలిసి పథకం ప్రకారం రాజా రఘువంశీని దారుణంగా హత్య చేయించింది. ఈ సంచలన కేసులో ప్రధాన నిందితురాలైన భార్యతో పాటు ఆమె ప్రియుడు, కిరాయి హంతకులను మేఘాలయ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.


