భక్త విజయం
పూర్వం ఒకానొక కాలంలో మహర్షులందరూ నైమిశారణ్యంలో సుదీర్ఘ సత్రయాగాన్ని ప్రారంభించారు. ఆ యాగంలో మృత్యువును శమితృ పదవిలో నియోగించారు. ఆ సత్రయాగం కొనసాగుతున్న కాలంలో మృత్యువు యజ్ఞకార్యంలో నియుక్తమై ఉన్నందున మానవులు మృత్యువాత పడకుండా, అమరులుగా మారిపోయారు. భూలోకంలో మరణాలు పూర్తిగా లేకుండా పోయి, జననాలు అంతకంతకు పెరగసాగాయి. మర్త్యుల రాకడ ఆగిపోవడంతో స్వర్గలోకం వెలవెలబోసాగింది.
మృత్యువు తన విధి నిర్వర్తించడంలో ఉపేక్ష వహిస్తూ, యజ్ఞకార్యంలో నిమగ్నం కావడం వల్ల దేవతలు దిక్కుతోచనివారయ్యారు. చివరకు దేవతలందరూ కలసి రాక్షసుల వద్దకు వెళ్లి, ‘మీరంతా వెళ్లి మునులు సాగిస్తున్న సత్రయాగాన్ని ధ్వంసం చేయండి’ అని చెప్పారు.
‘మునుల యాగాన్ని నిష్కారణంగా ధ్వంసం చేస్తే మాకు ఒరిగేదేమిటి?’ అని అడిగారు రాక్షసులు.
‘మీకు యాగార్ధభాగాన్ని ఇస్తాం’ అని చెప్పారు దేవతలు.
అప్పుడు మునుల యాగభంగం చేయడానికి రాక్షసులు అంగీకరించారు.
మహర్షులకు ఈ సంగతి తెలిసింది. అప్పుడు వారు, ‘ఓ మృత్యువా! రాక్షసులు యాగభంగం చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి? తరుణోపాయం నువ్వే చెప్పు!’ అని అడిగారు.
‘యాగ సామగ్రినంతా ఇక్కడే విడిచిపెట్టి, అగ్నిని మాత్రం తీసుకుని గౌతమీ తీరానికి వెళ్లండి. అక్కడ పరమశివుడిని ప్రార్థించండి’ అని మృత్యువు చెప్పాడు.
మహర్షులు యాగసామగ్రిని ఎక్కడివక్కడే విడిచిపెట్టి, కొంత అగ్నిని తీసుకుని గౌతమీ తీరానికి తరలి వెళ్లారు. యాగకార్యంలో నియుక్తమై ఉన్నందున మృత్యువు కూడా వారిని అనుసరించాడు.
మహర్షులందరూ పవిత్ర గౌతమీ నదిలో స్నానమాచరించారు. అనంతరం మహాదేవుడైన పరమేశ్వరుని వేనోళ్ల స్తుతిస్తూ ప్రార్థించసాగారు.
అప్పుడు మృత్యువు కూడా మహాదేవుని ప్రార్థించింది. ‘పరమేశ్వరా! శంభో శంకరా! నీవు మహాకాయుడవు, మహానలుడవు, మహానీలుడవు. మహేశ్వరా నీవే మమ్ము రక్షించాలి’ అని ప్రార్థించాడు.
పరమశివుడు వారి ప్రార్థనలకు ప్రసన్నుడై అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
‘వరమేమి కావాలో కోరుకోండి’ అన్నాడు పరమశివుడు.
అప్పుడు మృత్యువు ‘పరమేశ్వరా! రాక్షసుల వలన మా యాగానికి మహాపద వాటిల్లింది. మహర్షులు తలపెట్టిన ఈ సత్రయాగం సఫలమయ్యేంత వరకు మమ్మల్నందరినీ నువ్వే రక్షించాలి’ అని ప్రార్థించాడు.
పరమశివుడు ‘తథాస్తు!’ అని అనుగ్రహించాడు.
పరమశివుడి వరానుగ్రహంతో మృత్యువు సాయంతో మహర్షులు తమ సత్రయాగాన్ని విజయవంతంగా పరిసమాప్తి చేశారు.
యాగం పూర్తవుతూనే దేవతలు హవిర్భాగాల కోసం ఒక్కొక్కరే రావడం ప్రారంభించారు.
మృత్యువు వారిని చూసి, ‘మా యాగ విధ్వంసానికి మీరు రాక్షసులను ప్రేరేపించారు. హవిర్భాగాహారులైన మీరు అకార్యానికి పాల్పడ్డారు. ఇప్పటి నుంచి మీకు రాక్షసులతో శత్రుత్వం తప్పదు’ అని శపించాడు.
మృత్యువు శాప ఫలితంగా దేవతలకు, రాక్షసులకు అప్పటి నుంచి బద్ధవైరం ఏర్పడింది.
అప్పుడు మహర్షులు మృత్యువు పట్ల సంప్రీతులయ్యారు. వారు బడబ అనే కృత్యను సృష్టించి, ఆమెతో మృత్యువుకు వేదోక్తంగా వివాహం జరిపించారు. వివాహ సమయంలో బడబకు మంగళస్నానం జరిపించినప్పుడు ప్రవహించిన నీరు అక్కడ బడబానదిగా ప్రవహించింది.
వివాహానంతరం మృత్యువు అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ శివలింగం మహానలేశ్వరుడి పేరిట ప్రసిద్ధి పొందింది. అప్పటి నుంచి ఆ తీర్థానికి బడబానల తీర్థమనే పేరు వచ్చింది. మహానలేశ్వరుడు వెలసిన బడబానల తీర్థం భక్తులకు భుక్తి ముక్తిప్రదమైనది.
- సాంఖ్యాయన
పురావిశేషం..
ఈశాన్య రాష్టమైన మేఘాలయలో ఉన్న అరుదైన శివాలయం ఇది. తూర్పు ఖాసీ కొండల ప్రాంతంలోని మావ్‌సిన్‌రామ్ గ్రామానికి చేరువలో దట్టమైన అడవిలోని ఒక కొండ గుహలో సహజసిద్ధంగా వెలసిన శివలింగాన్ని ఇక్కడి ప్రజలు తరతరాలుగా పూజిస్తున్నారు. సున్నపురాతి గుహ పైకప్పు నుంచి రాలిన నీటిబిందువులు గట్టిబడి శివలింగం ఆకారం ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, స్థానికులు మాత్రం దీనిని స్వయంభూ లింగంగానే భావించి, పూజిస్తున్నారు. స్థానిక ఖాసీ ప్రజలు దీనిని ‘మావ్‌జిన్ బుయి’ శివలింగంగా వ్యవహరిస్తారు. ఏటా శ్రావణమాసంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే, మహాశివరాత్రి పూజలు కూడా ఘనంగా జరుగుతాయి.


