తనలో తానే పాడుకున్న తత్త్వజ్ఞ! | Funday Special Story On Olga Tokarczuk Life Story Written By Mandalaparthy Kishore | Sakshi
Sakshi News home page

తనలో తానే పాడుకున్న తత్త్వజ్ఞ!

Aug 9 2026 10:26 AM | Updated on Aug 9 2026 10:26 AM

Funday Special Story On Olga Tokarczuk Life Story Written By Mandalaparthy Kishore

ఓల్గ తొకార్చుక్‌

లిట్‌వరల్డ్‌

‘మన మాటల్లో అత్యుత్తమమైనవి మనతో మనం చెప్పుకునేవే!’నన్నారు పోలిష్‌ రచయిత్రి ఓల్గ  తొకార్చుక్‌. ‘మిగతా విషయాలెలా వున్నా, వాటిని ఎవరూ అపార్థం చేసుకోర’ని కూడా అన్నారామె. ఈ మాటలన్న మనిషి, ‘జైళ్ళు మన లోపలే వుంటాయి– బయట వుండవు; ఎటొచ్చీ మనలో చాలామందికి ఈ అంతర్గత కారాగారాల్లో ఎలావుండాలో తెలియదంతే!’ అనడంలో విడ్డూరమేముంది? అయినా, మానసిక చికిత్స పద్ధతుల్లో –క్లినికల్‌ సైకాలజీలో– పట్టా పొందిన ఓల్గా మాటతీరు మరోలా ఎందుకుంటుంది?

ఆమె తల్లి వాండా, తండ్రి జోసెఫ్‌ ఇద్దరూ ‘పీపుల్స్‌ యూనివర్సిటీ’లో అధ్యాపకులే. వాస్తవానికి అది ఓ విశ్వవిద్యాలయం కాదు– హైస్కూల్‌ మాత్రమే. పోలండ్‌ వాయవ్య ప్రాంతంలోని శివారు నగరం మ్యేర్జిన్లో వుండే జానపద విజ్ఞాన కేంద్రాన్నే ‘పీపుల్స్‌ యూనివర్సిటీ’గా పిలుస్తారు. జెర్మన్‌ సరిహద్దులకు కొద్ది నిమిషాల దూరంలో ఉంటుంది మ్యేర్జిన్‌. పైగా, అప్పట్లో జోసెఫ్‌ ఆ స్కూల్‌ లైబ్రరీ కూడా నడిపేవాడు. అలా, చిన్న వయసు నుంచీ ఓల్గ ఆడుకున్నదీ– పాడుకున్నదీ పుస్తకాలతోనే!

బాల్యంలో ఓల్గకు నచ్చిన పుస్తకం హెన్రిక్‌ సియెంకియేవిచ్‌ రాసిన ప్రేమకథ ‘క్వో–వాడిస్‌’. 1905లో నోబెల్‌ సాహిత్య పురస్కారం గెల్చుకున్న తొలినాటి రచయిత సియెంకియేవిచ్‌ రాసిన ఈ ప్రేమకథకే ‘ఎడారి–అడవి’ అనేది మరోపేరు. లాటిన్‌ భాషలో ఈ ప్రశ్నకు ‘ఎక్కడికి వెళ్తున్నావు?’ అనే అర్థం! నీరో చక్రవర్తి రోమ్‌ నగర రాజ్యాన్ని పాలించే రోజుల్లో జరిగిన ప్రేమకథగా ఈ నవలను రచించాడు సియెంకియేవిచ్‌. మరో 113 సంవత్సరాల తర్వాత ఓల్గ కూడా నోబెల్‌ సాహిత్య పురస్కారం గెల్చుకోవడానికి వున్న చారిత్రక నేపథ్యం ఇదన్నమాట. ఈ పరిసరాలే, రచయిత్రిగా ఆమె సొంత గొంతు సవరించడానికి అవసరమైన స్వరాన్నిచ్చాయి.

పదహారేళ్ళ ప్రాయంలోనే కలంపట్టి కథనరంగంలోకి దిగింది ఓల్గ! అయితే యువరచయితలకు సహజమైన బెరుకు కారణంగా ఆమె ‘నతాషా బరోదిన్‌’ అనే మారుపేరును ఆశ్రయించారు. యువ రచయితల కోసం ఉద్దేశించిన ‘కాలిబాట’ అనే చిన్నపత్రికలో అచ్చయిన మొదటి రెండు కథలనూ ఆ పేరుతోనే ప్రచురించారామె. దాదాపు దశాబ్దకాలం ఓల్గ కథలూ కాకరకాయలూ పక్కన పెట్టి సైకో థెరపిస్టుగా ఉద్యోగం చేసుకున్నారు. అప్పట్లో ఆమె విస్తృతంగా కవిత్వం రాశారు; అనేక పత్రికల్లో ప్రచురించారు; విస్తారమైన గుర్తింపు కూడా పొందారు. అప్పట్లోనే ఆమె ఓ కవితా సంపుటి కూడా అచ్చు వేసుకున్నారు. మూడు పదుల వయసు దాటిన తర్వాత, 1996లో ఓల్గ ‘ఆదిమ యుగం– ఇతర యుగాలు’ అనే ప్రయోగాత్మక నవల రాసి పదిమంది దృష్టిలో పడ్డారు. ఈ నవలను ఓల్గ 60 ఖండికలుగా విభజించారు. ఈ ప్రయోగం జాతీయ స్థాయిలో కన్నా, అంతర్జాతీయ స్థాయిలో పెద్దపేరు తెచ్చుకుంది. ఈ పరిణామం వెనుక చిన్న నేపథ్యం లేకపోలేదు!

ఇరవయ్యో శతాబ్ది చివర్లో పోలండ్‌ రాజకీయ– సామాజిక వ్యవస్థ సమూలమైన మార్పులకు గురైంది. అంతర్జాతీయంగా గొర్బచ్యేఫ్, జాతీయ స్థాయిలో పోలిష్‌ కార్మిక నేత వవుంజా (వలేజా) పరిచయం చేసిన భావాలే ఆ మార్పులకు ప్రాతిపదికలు. పోలండ్‌ సమాజంలో పడమటి గాలులు బలంగా వీస్తున్న పోకడ కనిపెట్టి ఎందరో సాహిత్యవేత్తలు తమ రంగు మార్చారు. ఎందుకైనా మంచిదని ఓల్గ తొకార్చుక్‌ కూడా వారిని అనుసరించారు. అలాంటి పెద్దల ప్రోత్సాహంతోనే ఆమె 1990 దశాబ్ది తొలినాళ్ళలో ఓల్గ కొన్నాళ్ళు ఇంగ్లండులో ఉండి, ఆంగ్లభాషా ప్రావీణ్యం సాధించారు. మరో అయిదేళ్ళ తర్వాత ఆమె రెండు స్కాలర్షిప్పులు సంపాదించి అమెరికాలోనూ– జెర్మనీ (బెర్లిన్‌)లోనూ రెండేళ్ళు గడిపి రావడం ఓల్గ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆనాటి నుంచీ ఆమెకి స్వదేశంలో కన్నా విదేశాల్లోనే ఎక్కువ గుర్తింపు దక్కుతూ వచ్చింది. 1999లో ఓల్గ ‘పోలిష్‌ పెన్‌ క్లబ్‌’లో చేరడంతో ఈ మార్పు పరిపూర్ణమైంది.   

2014లో ఓల్గ రాసిన ‘ద బుక్స్‌ ఆఫ్‌ జేకబ్‌’ అనే సుదీర్ఘ నవల ఆమె రచనలన్నింట్లోకీ ఉత్తమమని విమర్శకులు అంటారు. పదిహేడో శతాబ్దానికి చెందిన జేకబ్‌ ఫ్రాంక్‌ అనే ‘అవతార పురుషుడి’ జీవితకథ నేపథ్యంగా రాసినదీ 900 పేజీల నవల. ఈ నవల రాయడానికి ఓల్గ ఏడేళ్ళపాటు పరిశోధన చేశారట! ఈ నవల రాయడానికి ఏడేళ్ళ ముందు, ఓల్గ ‘దిమ్మరులు’ అనే చారిత్రక నవల పోలిష్‌ భాషలో వెలువరించారు. ‘ప్రాచీన విశ్వాసులు’గా ప్రసిద్ధులైన ఓ క్రై స్తవ శాఖకు చెందిన సంచారజీవన సమూహాల కథనే ఈ నవలకు ఇతివృత్తంగా తీసుకున్నారు ఓల్గ. 116 ఖండికలుగా ఈ నవలను నిర్మించి ఓల్గ తన ముద్ర గట్టిగానే వేశారు. చిత్రమేమిటంటే, కొన్ని ఖండికలు, ఏకవాక్య నిర్మాణాలే! 2008లో నైకీ సాహిత్య పురస్కారం ఓల్గ రచనకు తొలిసారి దక్కింది.

అమెరికన్‌ అనువాదకురాలు జెనిఫర్‌ క్రాఫ్ట్‌ దాని ఆంగ్లానువాదం వెలువరించే వరకూ ఓల్గ రచనకు అంతర్జాతీయ స్థాయిలో పెద్దగుర్తింపు దక్కలేదు (2018 మే నెల్లో ఓల్గ తొకార్చుక్‌– అమెరికన్‌ అనువాదకురాలు జెనిఫర్‌ క్రాఫ్ట్‌ మ్యాన్‌ బుకర్‌ బహుమతి సొమ్మును పంచుకున్నారు– అది అలా వుంచండి!) అదే సంవత్సరం అక్టోబర్లో ఓల్గ నోబెల్‌ సాహిత్యపురస్కారం గెల్చుకోవడానికి మ్యాన్‌ బుకర్‌ పురస్కారం ఎంతగానో సహకరించింది. ఈ రెండూ పురస్కారాలు దక్కిన తర్వాతనే, ఓల్గ రచనలకు అనేక భాషల్లో అనువాదాలు వెలువడ్డాయి. అయినా, నోబెల్‌ పురస్కారం పొందిన వాళ్ళ రచనలను సొమ్ముచేసుకునే సువర్ణావకాశాన్ని పెంగ్విన్‌ లాంటి వాణిజ్య ప్రచురణ సంస్థలు వదులుకుంటాయా?

- మందలపర్తి కిషోర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement