హెల్త్
ఫండే స్పెషల్ స్టోరీ
మానవాళికి ప్రకృతి షడ్రుచులను ప్రసాదించింది. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఏడో రుచిని కనిపెట్టారు. ఆ ఏడో రుచి పేరే... ‘లెమనేడింగ్’! నిజానికి ఇది రుచి కాదు. కష్టాలు వచ్చినప్పుడు వాటిని సరదాగా తీసుకుని... చేదు అనుభవాల నుండి తీపి అనుభూతులను పొందే జీవన విధానం. ఈ స్వభావం మానవుల్లో మునుపు లేదని కాదు. దాన్నిప్పుడు పరిశోధకులు ఉందని రూఢీగా వెల్లడించారు. చెడు కాలంలోనూ చెదరని గుండెతో ఉండటమే లెమనేడింగ్.
‘‘జీవితం మీకు నిమ్మకాయలను ప్రసాదిస్తే, నిమ్మరసమే చేసుకుని తాగండి’’ : 20వ శతాబ్దపు ప్రముఖ అమెరికన్ రచయిత, తత్త్వవేత్త, వ్యాపారవేత్త ఎల్బర్ట్ హబ్బర్డ్ చెప్పిన మాట ఇది. 1909లో ‘లిటరరీ డైజెస్ట్’ అనే పత్రికలో ఎల్బర్ట్ ఇలా రాశారు : ‘విధి తనకిచ్చిన నిమ్మకాయలను తీసుకుని, వాటితో నిమ్మరసం వ్యాపారం మొదలుపెట్టేవాడే అసలైన మేధావి’ – అని. అప్పట్నుంచీ ఈ మాట పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోర్సులలో వాడుకగా వినిపిస్తోంది. నిమ్మరసాన్ని ‘లెమనేడ్’ అంటారు. కనుక ఇది ‘లెమనేడ్ ఫిలాసఫీ’ అయింది. తాజాగా అమెరికన్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశీలనలో లెమనేడ్ ఫిలాసఫీ మానవ జీవితానికి ప్రశాంతతను చేకూర్చే మాట నిజమే అని నిర్థారణ అవటం విశేషం!
నవ్వుతూ బతకాలిరా..!
జీవితాన్ని సరదాగా తీసుకునే అలవాటు వల్ల కష్టాలను తట్టుకునే శక్తి పెరుగుతుందట! కష్టాలు, అడ్డంకులు ఎదురైనప్పుడు మనుషులు ఆ పరిస్థితులకు ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికి ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అధ్యయనం కోసం వారు కోవిడ్–19 సమయంలోని 503 మంది అమెరికన్ల ప్రవర్తన, వారి భావోద్వేగాలను పరిశీలించారు.
ఈ పరిశీలనలో శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. జీవితాన్ని కాస్త సరదాగా, ప్రశాంతంగా తీసుకునే మనస్తత్వం ఉన్నవారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నిజాయితీగా అంగీకరిస్తూనే, భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని తేలింది. వీరు తమకు ఎదురయ్యే సవాళ్లకు త్వరగా అలవాటు పడటమే కాకుండా, రోజువారీ పనులను ఆనందంగా, ఆ పనుల్లో లీనమై మరీ చేయగలిగారు. ఎలాంటి కష్టాలనైనా తట్టుకునే శక్తిని (రెజిలియన్స్) కనబరచారు.
ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను మార్చుకుంటూ, సృజనాత్మకంగా ఆలోచిస్తూ, అనుకూలమైన ఫలితాల కోసం ప్రయత్నించే ఈ అలవాటుకు శాస్త్రవేత్తలు ‘లెమనేడింగ్’ అని పేరు పెట్టారు. అంటే ‘చేదు’ లాంటి కష్టాలను కూడా నిమ్మరసంలా తీపిగా/సానుకూలంగా మార్చుకోవడం. దీనినే ఇంకోలా చెప్పాలంటే – జీవితంలో మనకు ఏది ఎదురైతే దానినే, దాని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా స్వీకరించటం.
చేదులోనే తియ్యని రుచి!
జీవితాన్ని కాస్త సరదాగా తీసుకోవడం అంటే, మనం ఉన్న పరిస్థితిని తేలికగా తీసుకుంటున్నామని కాదు, ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తి మనలో పెరుగుతోందని అర్థం అని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్–19 లాక్‌డౌన్ సమయంలో ప్రజల అనుభవాలను వీరు అధ్యయనం చేసినప్పుడు ఓ నిజం వెల్లడైంది. సరదా మనస్తత్వం ఉన్నవారు భవిష్యత్తు పట్ల సానుకూలంగా ఉంటూ, సమస్యలను చాలా చురుగ్గా, సృజనాత్మకంగా ఎదుర్కొన్నారు. అంటే, జీవితం వారికి చేదు వాస్తవాలను (నిమ్మకాయలు) ఇచ్చినప్పుడు, వారు వాటిని తీపి అనుభవాలుగా (నిమ్మరసం) మార్చుకున్నారు!
దీనికి సంబంధించిన పరిశోధనా వ్యాసం ‘ఫ్రంటియర్స్ ఇన్ సైకాలజీ’ పత్రిక తాజా సంచికలో అచ్చయింది. ‘‘మా పరిశోధనలో తేలిందేమిటంటే సరదా మనస్తత్త్వం, మానసిక స్థైర్యం అనేవి ‘లెమనేడింగ్’ అనే భావన ద్వారా ఒకదానికొకటి చాలా బలంగా ముడిపడి ఉన్నాయి. కష్ట సమయాల్లో కూడా సానుకూల అనుభవాలను సృష్టించుకునే సామర్థ్యమే ఈ లెమనేడింగ్’’ అని వ్యాసకర్త, ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ షియాంగ్‌యూ ‘షారన్’ షెన్ అంటున్నారు.
‘‘పాండమిక్ (మహమ్మారి) సమయంలో సరదా మనస్తత్వం ఉన్నవారు, లేనివారు ఇద్దరూ ఒకే రకమైన భయాన్ని, ఒంటరితనాన్ని అనుభవించారు. కానీ సరదాగా ఉండే వ్యక్తులు ఆ కష్టతరమైన పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పోగొట్టుకున్న వాటికి ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నారు, అడ్డంకులను ఎదిగే అవకాశాలుగా చూశారు. అన్నిటికంటే ముఖ్యంగా, ఆ పరిస్థితికి ఎలా స్పందించాలన్న విషయాన్ని తమ నియంత్రణలోనే ఉంచుకున్నారు’’ అని షెన్ తెలిపారు.
‘లెమనేడింగ్’ పరిశోధన వెనుక
డాక్టర్ షెన్, ఆమె సహచర శాస్త్రవేత్తలు మనుషుల సరదా మనస్తత్త్వం (ప్లేఫుల్‌నెస్) అనేది కష్ట సమయాల్లో జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి చాలా కాలంగా ఆసక్తితో చూస్తున్నారు. కోవిడ్ మహమ్మారి వారికి ఆ విషయాన్ని పెద్ద ఎత్తున పరిశోధించడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఇందుకోసం వారు అమెరికాలో నివసిస్తున్న 503 మంది వయోజనులను ఎంచుకుని, 2021 ఫిబ్రవరి (కోవిడ్ రెండవ వేవ్, వ్యాక్సిన్ ప్రారంభ సమయం) ఒక సర్వే నిర్వహించారు.
ఈ సర్వేలో పాల్గొన్నవారిని – కరోనా సోకుతుందేమో అనే భయం ఎంతవరకు ఉంది? పరిస్థితులు బాగుపడతాయని నమ్ముతున్నారా? వారికి ఇతరుల మద్దతు ఉందా? వారి భావోద్వేగాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటు, వారు ఎంత సరదాగా ఉంటారు? ఎంత స్పాంటేనియస్‌గా (సహజంగా / వెంటనే) స్పందిస్తారు? ఆనందంగా ఉండటానికి ఎంతవరకు ప్రయత్నిస్తారు? అనే అంశాల ఆధారంగా వారి సరదా మనస్తత్వాన్ని కొలిచారు.
ఈ వివరాల ఆధారంగా శాస్త్రవేత్తలు, సర్వేలో పాల్గొన్న వారిని వారి సరదా మనస్తత్వ స్థాయిని బట్టి నాలుగు భాగాలుగా విభజించారు. సరదా మనస్తత్వం అనేది మనుషుల ఆలోచనలను, ప్రవర్తనను ఎలా మారుస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అత్యంత సరదాగా ఉండే మొదటి 126 మందిని, అసలు సరదా లేని చివరి 126 మందితో పోల్చి చూశారు.
సానుకూల అవకాశాలపై దృష్టి
అత్యంత సరదాగా ఉండే వ్యక్తులు భవిష్యత్తు పట్ల చాలా ఆశావాదంతో ఉన్నారని, వ్యాక్సిన్ విజయవంతంగా అందుబాటులోకి వస్తుందని; జీవితం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుందని నమ్మారని ఈ పరిశోధన వివరాలు స్పష్టం చేశాయి. అయితే దీని అర్థం వారు అప్పటి పరిస్థితిని పట్టించుకోకుండా, ఊహల్లో బతికారనడం కాదు!
‘‘అతిగా ఆశావాదంతో ఉన్నవారు వాస్తవాలను గుర్తించకుండా ప్రతిదీ బాగుందని భ్రమిస్తుంటారు. కానీ మేము గమనించిన ‘స్పాట్‌లైట్’ (దృష్టి) ప్రభావం అలా కాకుండా చాలా స్పష్టంగా ఉంది’’ అని డాక్టర్ షెన్ వివరించారు. ‘‘సరదా మనస్తత్వం ఉన్నవారు కోవిడ్–19 ప్రమాదాలను తేలికగా తీసుకోలేదు, అలాగని రక్షణ చర్యల ప్రభావంపై అతిగా అంచనాలూ వేసుకోలేదు. వారు తమ ‘స్పాట్‌లైట్’ ని కేవలం సానుకూల మార్పులు, మెరుగవటానికి ఉండే అవకాశాలపైకి మళ్లించారు. చీకటి లాంటి కష్టసమయాల్లో కూడా ముందుకు సాగే మార్గాలను వెలుగులోకి తెచ్చుకున్నారు’’ అంటారు షెన్.
అధిక సరదా మనస్తత్త్వం కలిగినవారు ఆనందాన్ని వెతుక్కోవడానికి ఎక్కువ ఉత్సాహపడ్డారు, సంకోచించకుండా ఆలోచించారు. ఇది అనిశ్చిత పరిస్థితుల్లో కూడా అనేక సానుకూల అవకాశాలను ఊహించడానికి వారికి సహాయపడింది. దీనికి తోడు వారి ప్రవర్తనలో ఉన్న సరళత, పనుల్లో వారు చూపించే శ్రద్ధ.. కష్టాలను తట్టుకునే మానసిక స్థైర్యాన్ని అందించాయి.
చిన్న చిన్న మార్పులు చేసుకున్నారు
పాండమిక్ సమయంలో ఇరు వర్గాల వ్యక్తులూ సమానంగానే ఒంటరితనాన్ని, భయాన్ని అనుభవించారు. కానీ సరదాగా ఉన్నవారు ఆ పరిస్థితులను తట్టుకోవడానికి సృజనాత్మక, క్రియాశీలక అడుగులు వేశారు. వారు వేరే ఏవో కొత్త వినోద కార్యక్రమాలలో పాల్గొనలేదు, కానీ తాము చేసే పనుల్లోనే సమయాలను మార్చుకోవడం, కొత్త ప్రదేశాలను అన్వేషించడం లేదా చురుగ్గా ఉండటానికి కొత్త మార్గాలు వెతకడం ద్వారా పరిస్థితులకు అనుగుణంగా మారారు. వారు తమ రోజువారీ జీవితంలో మరింత చురుగ్గా, ఆనందంగా, లీనమై గడిపారు.
‘‘మా పరిశోధన సరదా మనస్తత్త్వాన్ని కొలవడంపైనే దృష్టి పెట్టినప్పటికీ, ఈ గుణాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని మార్గాలను పరిశోధనలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు, మీకు ఆనందాన్నిచ్చే పనుల్లో పాల్గొనండి, కొత్త అనుభవాలకు సిద్ధంగా ఉండండి, మిమ్మల్ని నవ్వించే వ్యక్తులతో సమయం గడపండి. సరదాగా ఉండటానికి ఆటలే ఆడాల్సిన పనిలేదు. మన రోజువారీ క్షణాల్లో కాస్త ఆనందం, స్వేచ్ఛ, అనుకూలమైన ఆలోచనా విధానాన్ని తెచ్చుకుంటే చాలు’’ అని షెన్ చెబుతున్నారు.
జీవితంలో సరదాలు ఉండాలి
‘‘ముఖ్యంగా కష్టకాలంలో మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరదా మనస్తత్వం అనేది చాలా కీలకమైనది. కానీ చాలామంది దీని ప్రాముఖ్యతను గుర్తించరు’’ అని అంటారు షెన్. ‘‘సరదాగా ఉండే వ్యక్తులు.. కష్టాలను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటారో అర్థం చేసుకోవడం వల్ల, ఇతరులు కూడా ఒత్తిడిని, అనిశ్చితిని జయించే వ్యూహాలను రూపొందించవచ్చు. మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రపంచ స్థాయి సవాళ్లకు వాస్తవిక అంచనా, సృజనాత్మకమైన సర్దుబాటు రెండూ అవసరం కాబట్టి, ఈ విషయం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ పరిశోధన ఫలితాలను ప్రతి పరిస్థితికీ లేదా అందరికీ ఒకేలా వర్తింపజేయలేమని షెన్, ఆమె సహచరులు హెచ్చరిస్తున్నారు. వేర్వేరు పరిస్థితుల్లో ఈ సరదా మనస్తత్త్వం వేర్వేరు వ్యక్తులపై భిన్నమైన ప్రభావం చూపవచ్చు. అలాగే, అత్యంత సరదాగా ఉండేవారికి, లేనివారికి మధ్య ఉన్న తేడాలన్నీ కేవలం ఈ ఒక్క గుణం వల్లే వచ్చాయని చెప్పలేము. ‘‘మనుషుల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను మేము గుర్తించినప్పటికీ, రోజువారీ సంఘటనలకు వారు ఎలా స్పందిస్తారనే దానిపై ప్రభావం చూపే ఈ సరదా మనస్తత్త్వం ఇతర పరిస్థితులకు కూడా (రోజువారీ కానివీ, వివిధ రంగాలకు చెందినవీ) వర్తిస్తుందని చెప్పలేం అని షెన్ పేర్కొన్నారు. ‘‘ఈ ‘సరదా ఆలోచనా విధానం’ ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో మరింత పూర్తిగా అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో జీవితంలోని ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని పరిశోధనలు జరపవలసి ఉంది’’ అని షెన్ అంటున్నారు. – సాక్షి స్పెషల్ డెస్క్
- షియాంగ్‌యూ ‘షారన్’ షెన్, ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్


