- జేమ్స్ హూస్టన్ పైలట్‌గా.. - జేమ్స్ లైనింజర్ చిన్నప్పుడు – యువకుడిగా
మిస్టిక్ వరల్డ్
1945 మార్చి 3 – జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని ఇవోజిమా ద్వీపం...
రెండో ప్రపంచ యుద్ధం ఉద్ధృతంగా సాగుతున్న సమయం... అప్పుడే అమెరికాకు చెందిన యుద్ధ విమాన పైలట్ జేమ్స్ హూస్టన్– యుద్ధనౌక నుంచి టేకాఫ్‌కు సిద్ధమయ్యాడు.
‘జాక్! ఈరోజు శత్రువుల పీచమణిచి విజయంతో తిరిగొస్తా. పార్టీ చేసుకుందాం’ అని తన సహచరుడికి చెప్పి ఇవోజిమా ద్వీపం వైపు దూసుకెళ్లాడు జేమ్స్ హూస్టన్. జపాన్ సేనలపై బాంబుల వర్షం కురిపించాడు. అయితే, జపాన్ సైన్యం చేసిన దాడిలో ఇంజిన్‌కు మంటలంటుకుని విమానం సముద్రంలో కూలిపోయింది. విమానంలో ఉన్న జేమ్స్ చనిపోయాడు.
2000 ఏప్రిల్ 10 – అమెరికాలోని లూసియానాలో నివసించే బ్రూస్ లైనింజర్, ఆండ్రియా లైనింజర్ దంపతులు తమ రెండేళ్ల కుమారుడు జేమ్స్ లైనింజర్‌తో కలిసి ఎప్పటిలాగే నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆ బాలుడు గట్టిగా కేకలు వేశాడు.
‘విమానం కాలిపోతోంది! మంటలు అంటుకున్నాయి! ఆ చిన్న మనిషి బయటకు రాలేకపోతున్నాడు... కాపాడండి!’ అంటూ అరిచాడు.
దీంతో ఉలిక్కిపడ్డ అతడి తల్లిదండ్రులు జేమ్స్‌ను దగ్గరకు తీసుకుని బుజ్జగించి నిద్రపుచ్చారు. ఇక ఆ రోజు నుంచి వారికి నిద్ర కరువైంది. ప్రతిరోజూ రాత్రివేళ నిద్రపోతున్న బాలుడు ఉన్నట్టుండి గాల్లో కాళ్లు, చేతులు విసిరేస్తూ, ఊపిరి ఆడనట్లు విలవిలలాడిపోయేవాడు. చెమటలతో తడిసిపోతూ గట్టిగా కేకలు వేసేవాడు.
వారంలో నాలుగైదు రోజులు ఇదే సీన్. మొదట్లో తల్లిదండ్రులు ఏదో పీడకల అనుకున్నారు. కానీ అంతకంతకూ ఆ చిన్నారి ప్రవర్తన విచిత్రంగా మారింది. బొమ్మ విమానాలతో ఆడుకుంటూ, వాటిని నేలకేసి కొడుతూ ‘విమానం క్రాష్ అయిపోయింది’ అని అరిచేవాడు.
రోజులు గడిచేకొద్దీ ఆ చిన్నారి చెబుతున్న మాటలకు తల్లిదండ్రులు షాకయ్యేవారు. ఆ వయసు పిల్లలకు అస్సలు తెలియని ‘విమాన çపరిభాష’ గురించి జేమ్స్ మాట్లాడటం చూసి నిర్ఘాంతపోయేవారు. విమానం కింద ఉండే ‘డ్రాప్ ట్యాంక్’ గురించి, దాన్ని ఎలా డిస్‌కనెక్ట్ చేయాలో స్పష్టంగా చెప్పేవాడు. దీంతో ఒకరోజు తండ్రి బ్రూస్ తన కొడుకుని దగ్గరకు తీసుకుని నెమ్మదిగా ఆరా తీశాడు.
‘నాన్నా, అసలు ఆ విమానం ఎక్కడి నుంచి ఎగిరేది?’ అని అడిగితే, ‘అది నటోమా అనే పెద్ద యుద్ధనౌక మీద నుంచి ఎగిరేది డాడీ’ అని బదులిచ్చాడు.
ఆ చిన్న మనిషి ఎవరు నాన్నా అని ప్రశ్నిస్తే, ‘అది నేనే.. నా పేరు కూడా జేమ్సే’ అని సమాధానమిచ్చాడు.
‘నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా?’ అంటే.. ‘నా బెస్ట్ ఫ్రెండ్ జాక్ లార్సన్ నాతోనే ఉండేవాడు’ అని చెప్పాడు. ‘జపాన్ సైనికులు తన విమానం ఇంజిన్ పై దాడి చేసి కూల్చివేశారు. విమానానికి మంటలు అంటుకుని సముద్రంలో పడిపోయి చనిపోయాను’ ఆ పసివాడు కళ్లు పెద్దవి చేసి మరీ వివరించాడు.
ఇదంతా పసివాడి ఊహాజనిత కథ అని నిరూపించాలని బ్రూస్ నిశ్చయించుకున్నాడు. సైనిక రికార్డులు, రెండో ప్రపంచ యుద్ధ పత్రాలను జల్లెడ పట్టాడు. అవి చూసిన తర్వాత ఆయన వెన్నులో వణుకు పుట్టింది.
పసిఫిక్ మహాసముద్రంలో రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ పేరు యూఎస్‌ఎస్ నటోమా బే అని, ఆ నౌకపై జాక్ లార్సన్ అనే పైలట్ పనిచేశాడని, అప్పటికి ఆయన ఇంకా జీవించే ఉన్నాడని తెలుసుకున్నాడు.
1945 మార్చి 3న జేమ్స్ హూస్టన్ జూనియర్ అనే 21 ఏళ్ల పైలట్ విమానంపై జపాన్ సైనికులు దాడి చేయడంతో అది సముద్రంలో కూలిపోయి అతడు మరణించాడని మిలిటరీ రికార్డులను బట్టి బ్రూస్ నిర్ధారణకు వచ్చాడు. ఈ నమ్మలేని నిజాలను ప్రత్యక్షంగా నిరూపించుకోవడానికి లైనింజర్ కుటుంబం– చనిపోయిన పైలట్ జేమ్స్ హూస్టన్ సోదరి యాన్ బారన్ దగ్గరకు వెళ్లింది. అప్పటికి వృద్ధురాలైన యాన్ బారన్ ను చూడగానే జేమ్స్– పరిగెత్తుకుంటూ వెళ్లి ‘అక్కా’ అంటూ ఆప్యాయంగా హత్తుకున్నాడు.
వారి చిన్నతనంలో ఆడుకున్న ఆటలు, హూస్టన్ ఇంట్లో ఉన్న బొమ్మల పేర్లు, కేవలం ఆ ఇద్దరికీ మాత్రమే తెలిసిన కుటుంబ విషయాలను పూసగుచ్చినట్లు చెప్పాడు.
అవన్నీ విన్న తర్వాత ఆనందబాష్పాలతో యాన్ బారన్ అన్న మాట: ‘ఇతడు నా తమ్ముడు జేమ్స్ హూస్టన్... నా తమ్ముడే మళ్లీ పుట్టాడు’ అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అనంతరం అప్పటికి బతికి ఉన్న సహచర పైలట్ జాక్ లార్సన్‌ను కలిసినప్పుడు కూడా చిన్నారి జేమ్స్ ఆయనను గుర్తుపట్టి, నాటి యుద్ధ జ్ఞాపకాలను పంచుకున్నాడు.
చిన్నారి జేమ్స్ లైనింజర్ కథ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మీడియాను, పారాసైకాలజీ పరిశోధకులను ఆకర్షించింది. గత జన్మ వివరాలన్నీ చెప్పిన జేమ్స్... తను మరణించిన జపాన్ సముద్ర తీర ప్రాంతానికి వెళ్లి నివాళులర్పించాడు. అంతే, అప్పటి నుంచి అతడికి పీడకలలు రావడం ఆగిపోయాయి. శాస్త్రవేత్తలు, డాక్టర్లు దీనికి ఎటువంటి శాస్త్రీయ వివరణ ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం సాధారణ యువకుడిలా జీవితం గడుపుతున్న జేమ్స్ లైనింజర్ కథ– ‘పునర్జన్మ’ ఉందనే నమ్మకానికి ప్రపంచంలోనే అత్యంత బలమైన, సజీవ ఆధారంగా ఉంది.
- సత్యకిశోర్ కొండ్రెడ్డి


