breaking news
mistics
-
ఏమిటీ ఈ పిచ్చి? ఈమె ఎందుకు ఇలా డ్యాన్స్ చేస్తోంది?
అది 1518 జూలై– ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్ నగరం– ఆకాశం నిర్మలంగా ఉంది. నగర వీథులు ఎప్పటిలాగే జనసమ్మర్దంతో సందడిగా ఉన్నాయి. హఠాత్తుగా ఒక ఇరుకైన సందులోంచి ఓ మహిళ రోడ్డుపైకి పరుగున వచ్చింది. ఆమె పేరు ఫ్రావ్ ట్రోఫియా. ఆమె ముఖంలో ఏదో తెలియని భయం; కళ్లల్లో విపరీతమైన ఆందోళన. కానీ విచిత్రంగా ఆమె కాళ్లు మాత్రం అసంకల్పితంగా నర్తించడం ప్రారంభించాయి. చుట్టుపక్కల వాళ్లంతా ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు.‘ఏమిటీ పిచ్చి? పండగ లేదు, పబ్బం లేదు– ఈమె ఎందుకు ఇలా డ్యాన్స్ చేస్తోంది?’ అని గుసగుసలాడుకుంటున్నారు. కొంతమంది నవ్వుకుంటున్నారు. అయినా సరే ట్రోఫియా నృత్యం ఆపలేదు. సూర్యుడు అస్తమించాడు; చీకటి పడింది; తెల్లవారింది. అయినా ట్రోఫియా కాళ్లు ఆగడంలేదు. ఆమె శరీరం చెమటతో తడిసి ముద్దవుతోంది. ఊపిరి కూడా సలపడంలేదు. స్పృహ తప్పి కింద పడిపోతోంది. కానీ కళ్లు తెరవగానే, మెదడుకు ఏదో కరెంట్ షాక్ తగిలినట్లు మళ్లీ లేచి డ్యాన్స్ చేస్తోంది. అలా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు– ఏకధాటిగా ఆరు రోజుల పాటు ఆమె మృత్యునృత్యం చేస్తూనే ఉంది.ట్రోఫియాను చూసి నగర ప్రజలు నవ్వుకుంటుండగానే, మొదటి వారం ముగిసేసరికి మరో 34 మంది వీథిలోకి వచ్చి ఆమెతో జత కలిశారు. వాళ్లకు కూడా ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు. ఒకరిని చూసి ఒకరు– అలా కేవలం నెల రోజులు గడిచేసరికి దాదాపు 400 మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి, పిచ్చిపట్టినట్లు నృత్యం చేయడం ప్రారంభించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలు, యువకులు ఉన్నారు. అదొక వింతైన అంటువ్యాధిలా మారిపోయింది. చూసేవాళ్లకు అది డ్యాన్స్‌లా లేదు. ఏదో అదృశ్య శక్తి వారి చేతులకు, కాళ్లకు దారాలు కట్టి బొమ్మలా ఆడిస్తున్నట్లు ఉంది.పగలూ రాత్రీ తేడా లేదు. ఎండా వానా తేడా అసలే లేదు. కాళ్లు అరిగిపోయి, పాదాలు చిట్లి నెత్తురోడుతున్నా, నర్తించడం మాత్రం ఆపలేకపోతున్నారు. విపరీతమైన డీహైడ్రేషన్, గుండెపోటు కారణంగా రోజుకు కనీసం 15 మంది వరకు రోడ్లపైన డ్యాన్స్ చేస్తూనే ప్రాణాలు విడిచారు. ఈ వింత పరిస్థితిని చూసి నగర పాలకులు, వైద్యులు తలలు పట్టుకున్నారు. ‘ఇది వేడి రక్తం వల్ల వచ్చే శారీరక సమస్య. దీనికి విరుగుడు ఒక్కటే– వాళ్లను ఇంకా ఎక్కువగా డ్యాన్స్ చేయనివ్వండి. రక్తం చల్లబడితే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది!’ అని కొందరు వైద్యులు సలహా ఇచ్చారు.అంతే! అధికారులు రంగంలోకి దిగారు. బాధితుల కోసం నగరంలో పెద్ద పెద్ద హాల్స్, స్టేజీలు ఏర్పాటు చేశారు. వాళ్లకు మరింత ఉత్సాహం ఇవ్వడానికి ప్రత్యేకంగా డ్రమ్మర్స్, సంగీతకారులను పిలిపించి మరీ వాయించారు. కానీ ఈ నిర్ణయం మరింత బెడిసి కొట్టింది. హోరెత్తించే డ్రమ్స్ శబ్దాలు వినబడటంతో నగరంలోని మరికొంతమంది సాధారణ ప్రజల మెదళ్లు కూడా పాడైపోయి, ఆ డ్యాన్స్ గ్రూప్‌లో చేరిపోయారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగింది. చివరకు ప్రభుత్వం భయపడి నగరంలో డ్యాన్స్‌ను పూర్తిగా నిషేధించింది. బాధితులను బలవంతంగా ఒక పర్వత గుహలోని చర్చికి తరలించి, ప్రత్యేక పూజలు చేయించాక, సెప్టెంబర్‌లో ఈ కరాళ నృత్యం నెమ్మదిగా ముగిసింది.శతాబ్దాలుగా ఈ ‘డ్యాన్సింగ్ ప్లేగ్’పై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఆధునిక శాస్త్రవేత్తలు దీని వెనుక రెండు ప్రధాన కారణాలు ఉండవచ్చని గట్టిగా నమ్ముతున్నారు. అప్పట్లో ప్రజలు తినే రాగులు, గోధుమల లాంటి ధాన్యాలకు ‘ఎర్గోట్’ అనే ఒక రకమైన ఫంగస్ పట్టేది. ఈ ఫంగస్ ఉన్న ఆహారాన్ని తింటే మనుషుల్లో భ్రమలు, ఫిట్స్, విపరీతమైన నరాల కదలికలు వస్తాయి. అంటే ఇది ఇప్పటి ఎల్ఎస్డీ వంటి ప్రమాదకరమైన డ్రగ్‌లా పనిచేస్తుంది. అందువల్లే వారు అలా భయంకరంగా నర్తించి ఉంటారనే అంచనాకు వచ్చారు. అలాగే 1518 కాలంలో ఆ నగరంలో తీవ్రమైన కరవు, భయంకరమైన రోగాలు ఉన్నాయి. ఆ విపరీతమైన మానసిక ఒత్తిడి తట్టుకోలేక, ప్రజల మెదడు ఒకేసారి ఆల్టర్నేట్ మోడ్‌లోకి వెళ్లిపోయి ‘మాస్ హిస్టీరియా’కు దారితీసి ఉండవచ్చనే వాదనలూ ఉన్నాయి.అయితే, ఒక ఫంగస్ వల్ల లేదా మానసిక ఒత్తిడి వల్ల మనుషులు ఏకధాటిగా రోజులు తరబడి ప్రాణాలు పోయేంత వరకు ఎలా డ్యాన్స్ చేయగలరు? అనే ప్రశ్నకు ఇప్పటికీ సైన్స్ దగ్గర పూర్తి స్పష్టమైన సమాధానం లేదు. తమ నియంత్రణలో లేని శరీరాలతో, మరణం వైపు అడుగులు వేస్తూ ఆనాడు ఆ నాలుగువందల మంది అనుభవించిన నరకం ఎలాంటిదో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మనిషి మెదడుతో ప్రకృతి ఆడిన ఈ వింత ఆట చరిత్ర పుటల్లో ఎప్పటికీ ఒక వీడని మిస్టరీనే!- సత్యకిశోర్ -
అమ్మా... 'నేను లారీ కింద పడి చనిపోయాను..!'
కొలీన్ హాకిన్ కిచెన్‌లో పనిచేసుకుంటోంది. హాల్లో ఆడుకుంటున్న ఆమె మూడేళ్ల చిన్న కుమారుడు బ్లేక్ హాకిన్ భయంతో గట్టిగా అరిచాడు. బయట రోడ్డుపై స్కూల్ బస్సు కోసం వేచి చూస్తున్న తన అన్నయ్యను ఉద్దేశించి ‘రోడ్డుపై నుంచి పక్కకు రా... బస్సు వచ్చేస్తోంది!’ అంటూ కేకలు వేశాడు.కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చిన తల్లి కొలీన్ కు... బ్లేక్ తన ఎడమ చెవిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని, నొప్పితో విలవిలలాడుతూ ఏడవడం కనిపించింది.‘ఏమైంది నాన్నా?’ అంటూ బ్లేక్‌ను గుండెలకు హత్తుకుంది. ఒళ్లు వణుకుతుండగా వాడు చెప్పిన మాటలకు కొలీన్ మైండ్ బ్లాక్ అయింది ‘అమ్మా! నన్ను ఒక పెద్ద లారీ ఢీకొట్టింది. నేను ఆ భారీ చక్రాల కింద పడిపోయాను!’ అని చెప్పాడు. కొలీన్ బయటకు పరుగెత్తి చూసింది.కానీ అక్కడ ఎలాంటి లారీ లేదు. మొదట ఆ చిన్నారి ఏదో కార్టూన్ చూసి ఊహించుకుని చెప్తున్నాడని అనుకుంది. కానీ, బ్లేక్ ఆ ప్రమాదం గురించి చెప్తున్నప్పుడు తన ముఖంలో కనిపించిన భయం ఆమెను ఆలోచనలో పడేసింది. కొలీన్ ఆ చిన్నారి కళ్లల్లోకి చూస్తూ, ‘నువ్వు చనిపోయావా బ్లేక్?’ అని అడిగింది. ఆ బాలుడు ఏమాత్రం తడబడకుండా, ‘అవును’ అని బదులిచ్చాడు!ఆ ఒక్క సంఘటనతో బ్లేక్ జీవితం తలకిందులైంది. ఎప్పుడూ ఇల్లంతా పరుగెడుతూ, నవ్వుతూ ఉండే ఆ చిన్నారి... ఒక్కసారిగా తీవ్రమైన నిరాశలోకి వెళ్లిపోయాడు. శూన్యంలోకి చూస్తూ గంటల తరబడి ఒకే చోట కూర్చునేవాడు. ప్రతిరోజూ తన ఎడమ వైపు ఉన్న చెయ్యి, కాలు లేదా కన్ను విపరీతంగా నొప్పి పెడుతున్నాయంటూ ఏడ్చేవాడు. వైద్య పరిభాషలో దీనిని ‘ఫాంటమ్ పెయిన్’ అంటారు. అంటే ప్రస్తుతం ఎలాంటి దెబ్బ తగలకున్నా, గతంలో అనుభవించిన తీవ్రమైన శారీరక నొప్పులు మెదడుకు గుర్తుండిపోయి మళ్లీ బాధించడం!ఆ భయంకరమైన నరకాన్ని మాటల్లో చెప్పలేక, బ్లేక్ తెల్ల కాగితాలపై పెన్నుతో పిచ్చి గీతలు గీస్తూ, తల్లి దగ్గరకు తెచ్చి, ‘అమ్మా... చూడు, ఇవే నా ఒంటిపై ఉన్న గాయాలు’ అని చూపిస్తూ ఏడ్చేవాడు. బ్లేక్ మానసిక స్థితిని చూసి తట్టుకోలేక, కొలీన్ పునర్జన్మలపై పరిశోధనలు చేసే ప్రముఖ థెరపిస్ట్ క్యారల్ బోమన్‌ను సంప్రదించింది.ఇలాంటి పరిస్థితుల్లోనే, ఆ కుటుంబం క్రిస్మస్ కోసం అమెరికా నుంచి లండన్ వెళ్లింది. అక్కడ రద్దీగా ఉన్న ఒక రోడ్డు పక్కన బ్లేక్ చిన్న పిల్లల స్ట్రాలర్లో కూర్చుని ఉన్నాడు. హఠాత్తుగా ఓ లారీ తమ వైపు వేగంగా రావడం చూశాడు. వెంటనే స్ట్రాలర్ లోంచి బయటకు దూకి, నేరుగా దూసుకొస్తున్న ఆ లారీ ముందుకు పరుగెత్తాడు. చుట్టుపక్కల వాళ్లంతా గట్టిగా కేకలు వేశారు. అదృష్టవశాత్తూ పక్కనే ఉన్న బ్లేక్ తండ్రి క్షణాల వ్యవధిలో బ్లేక్‌ను వెనక్కి లాగాడు. గత జన్మలో లారీ కింద పడి చనిపోయిన ఆ భయంకరమైన సంఘటనను బ్లేక్ ఈ జన్మలో పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని తల్లి కొలీన్ భయంతో వణికిపోయింది. ఈ విషయం తెలుసుకున్న క్యారల్ బోమన్... కొలీన్కు ఒక ఉపాయం చెప్పింది.క్యారల్ చెప్పినట్లే ఆ రాత్రి కొలీన్.. బ్లేక్ మంచం దగ్గరకు వెళ్లి, తన తలపై ప్రేమగా నిమురుతూ, ‘కన్నా.. నువ్వు గతంలో లారీ కింద పడి చనిపోయావు కదా, అది నిజమే. కానీ నా బంగారు కొండా... అది నీ గత జన్మ. అప్పుడు నీ శరీరం వేరు, నిన్ను కన్న తల్లి వేరు. ఇప్పుడు నువ్వు నా కడుపున పుట్టావు. ఇది నీ కొత్త జీవితం. ఇక్కడ నువ్వు పూర్తిగా సురక్షితంగా ఉన్నావు. ఆ పాత లారీ నిన్ను ఏమీ చేయలేదు...’ అని చెప్పింది.ఆశ్చర్యం! ఆ మాటలు వినగానే ఆ మూడేళ్ల చిన్నారి ముఖంలో తెలియని ఒక ప్రశాంతత కనిపించింది. మరుసటి రోజు ఉదయం నుంచే బ్లేక్ ఆ పాత జ్ఞాపకాలను, ఆ భయాన్ని పూర్తిగా మరచిపోయాడు. తన శరీరంలో ఎడమవైపు వస్తున్న ఆ ‘ఫాంటమ్ పెయిన్స్’ కూడా మాయమయ్యాయి! మళ్లీ ఎప్పటిలాగే నవ్వుతూ, ఆడుకుంటూ సాధారణ స్థితికి వచ్చాడు.సైన్స్ పరంగా పునర్జన్మలను నిరూపించడానికి లేదా పూర్తిగా తోసిపుచ్చడానికి కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ బ్లేక్ హాకిన్ అనుభవం, తన మెదడులో దాగున్న కాలం దాటిన జ్ఞాపకాలు మాత్రం ప్రకృతి మానవాళికి వదిలేసిన అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయాయి!- సత్యకిషోర్ -
నాన్నా! నీ డైపర్లు మార్చేవాడిని..
అమెరికాలోని కనెక్టికట్‌కు చెందిన రాన్ ప్రెస్నెల్ అనే వ్యక్తి తన రెండేళ్ల కుమారుడు సామ్ ప్రెస్నెల్తో ఇంట్లో ఆడుకుంటున్నాడు. అప్పుడు హఠాత్తుగా సామ్ తన తండ్రి వైపు చూసి,‘‘డాడ్! నువ్వు నా అంత ఉన్నప్పుడు నీ డైపర్లు నేనే మార్చేవాడిని తెలుసా?’’ అన్నాడు. రాన్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. తాను తప్పుగా విన్నానేమో అని అనుకున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సామ్ మరిన్ని విచిత్రమైన విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు.రాన్ తండ్రి.. సామ్ పుట్టడానికి పది నెలల ముందు 1992లో మరణించారు. సామ్ పెద్దవుతున్న కొద్దీ తన తాత జీవితానికి సంబంధించిన వివరాలను చెప్పడం చూసి రాన్ నోరెళ్లబెట్టేవాడు. ‘‘నాకు ఒక చెల్లెలు ఉండేది. కొందరు చెడ్డవాళ్లు ఆమెను చంపేసి నీళ్లలో పడేశారు’’ అని చెప్పేసరికి సామ్ తల్లిదండ్రులకు నోటమాట రాలేదు. అరవయ్యేళ్ల కిందట నిజంగానే కొందరు దుండగులు ఆమెను దారుణంగా హత్య చేసి శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో సముద్రంలో పడేశారు.సామ్ మాటలను మొదట నమ్మని అతని తండ్రి రాన్– ఈ సంగతేంటో చూద్దామని పాత ఆల్బమ్‌ను తీశాడు. అందులో సామ్ తాతతో పాటు అతని ఈడు వయసున్న మరో 15 మంది బాలుర గ్రూప్ ఫొటో ఉంది. రాన్ ఆ ఫొటోను సామ్ ముందు పెట్టి, ‘‘ఇందులో నువ్వు ఎక్కడున్నావో చెప్పు?’’ అని అడిగాడు. సామ్ ఏమాత్రం తడుముకోకుండా అందులోని ఒక బాలుడిపై వేలు పెట్టి, ‘‘ఇదిగో, నేనే ఇక్కడ ఉన్నాను!’’ అని చెప్పాడు. అది చూసిన రాన్ ఆశ్చర్యపోయాడు.‘‘నువ్వు ఈ లోకంలోకి ఎలా వచ్చావు? ఎలా చనిపోయావు?’’ అని సామ్‌ను అడిగాడు. దానికి సామ్ చాలా సీరియస్‌గా తన తలపై గట్టిగా కొట్టుకుంటూ తీవ్రమైన నొప్పితో విలవిలలాడాడు. విస్తుపోయే నిజం ఏంటంటే, సామ్ తాత ‘బ్రెయిన్ హెమరేజ్’ కారణంగా, తలలో విపరీతమైన నొప్పితో హాస్పిటల్లో చేరి మరణించారు. సామ్ తల పట్టుకుని చూపించిన విధానం తన తండ్రి చివరి క్షణాలను కళ్లకు కట్టినట్టు చూపించడంతో రాన్ దిగ్భ్రాంతికి లోనయ్యాడు. సామ్ తను మళ్లీ పుట్టడం గురించి చెబుతూ, ‘‘నేను ఒక ద్వారం నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చాను’’ అని చెప్పాడు.సామ్ తాత తన జీవితంలో ఒక నిర్దిష్టమైన రాత్రి గురించి తన కొడుకు రాన్ తో తరచుగా చెబుతుండేవారు. ఓ రాత్రి విమానాశ్రయంలో తీవ్రమైన మంచు కురవడం వల్ల విమానాలన్నీ రద్దయ్యాయి. సామ్ తాత ఆ రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే ఒక చిన్న గదిలో గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన దగ్గర చిన్న రేడియో, ఓ బ్రిటిష్ నవల మాత్రమే ఉన్నాయి. సామ్‌కు దాదాపు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు ఒకరోజు తండ్రితో మాట్లాడుతూ, ‘‘అమ్మానాన్నలు నన్ను ఒక గదిలో పెట్టేశారు. అప్పుడు నాకు తోడుగా ఒక రేడియో, ఒక ఇంగ్లిష్ పుస్తకం మాత్రమే ఉన్నాయి. ఆ రాత్రి నాకు చాలా బోర్ కొట్టింది’’ అని చెప్పాడు. ఈ సంఘటన రాన్ భార్యకు (సామ్ తల్లికి) కూడా తెలియదు. కేవలం తండ్రీకొడుకుల మధ్య ఉన్న ఈ వ్యక్తిగత జ్ఞాపకాన్ని సామ్ గుర్తుచేసుకోవడం రాన్ ను పూర్తిగా మార్చేసింది.ఒకరోజు నానమ్మ సామ్ ఇంటికి వచ్చింది. అప్పుడు నాలుగేళ్ల సామ్ ఆమె దగ్గరకు వెళ్లి చాలా చొరవగా, ‘‘నువ్వు నా కోసం ఫుడ్ ప్రాసెసర్‌లో ఆ టేస్టీ మిల్క్‌షేక్ ఎప్పుడు చేసిస్తావు?’’ అని అడిగాడు. భర్త బతికున్నప్పుడు ఆమె ప్రతిరోజూ ఫుడ్ ప్రాసెసర్‌లో రకరకాల వంటకాలు చేసి ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో ఒక చిన్న పిల్లోడు తన భర్తలా ఆ పాత వంటకం గురించి అడగడం చూసి ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వర్జీనియా యూనివర్సిటీ పరిశోధకులు ఈ కేసును పూర్తిగా అధ్యయనం చేశారు. సామ్ కుటుంబ సభ్యులు అతని ముందు ఎలాంటి పాత విషయాలు మాట్లాడలేదని, అయినా సామ్ చెప్పిన ప్రతి విషయాలు వంద శాతం రికార్డులతో సరిపోలిందని ధ్రువీకరించారు. అయితే, సామ్‌కు ఐదేళ్లు దాటిన తర్వాత అతని గత జన్మ జ్ఞాపకాలు క్రమంగా తగ్గిపోయాయి.ఒకరోజు రాన్ మళ్లీ పాత విషయాల గురించి అడగ్గా, సామ్ నవ్వుతూ ‘‘నాకు అవేమీ గుర్తులేవు నాన్నా’’ అని చెప్పాడు. కానీ, ‘‘నేను నీకు డైపర్ మార్చాను’’ అంటూ సామ్ తన తండ్రితో అన్న ఆ మొదటి మాట– పునర్జన్మల చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకంగా మిగిలిపోయింది.- సత్యకిశోర్ -
సర్కారు తప్పుతో రైతులకు నష్టం
భద్రాద్రి ప్లాంట్ నిర్వాసిత రైతులతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మణుగూరు: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ విషయంలో సర్కారు తొందరపాటు, తప్పిదం కారణంగా నిర్వాసిత రైతులు తీవ్రంగా నష్టపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్లాంట్ పనులు తిరిగి ప్రారంభమ్యేంత వరకు నిర్వాసిత రైతులు తమ భూముల్లో పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి ప్లాంట్ వద్ద భూనిర్వాసిత రైతులతో ఆదివారం ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తరువాత కొత్త ప్రాజెక్టు కోసం భూసేకరణ విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించింది ఒక్క మణుగూరు ప్రాంతమేనని అన్నారు. అయినప్పటికీ, నిర్వాసిత రైతుల్లో ఇంకా 186 మందికి పరిహారం, 346 మంది నిరుద్యోగ నిర్వాసిత యువతకు ఉద్యోగ హామీ పత్రాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్లాంట్ ఏర్పాటు పనులు ప్రారంభించడం పూర్తిగా ప్రభుత్వ తొందరపాటు, తప్పిదమేనని అన్నారు. దీని ఫలితంగా నిర్వాసిత రైతులు తమ భూముల్లో సాగు చేయలేక, పరిహారం అందక, ఉపాధి లేక తీవ్రంగా నష్టపోయారని అన్నారు. పేరంటాల చెరువు కింద రెండు పంటలు పండే భూములను ఒక్క పంట భూములుగా ప్రభుత్వం చూపిందని, భూసేకరణ చట్టం అమలు చేయకుండానే నామమాత్రంగా పరిహారం ఇచ్చిందని విమర్శించారు. భద్రాద్రి ప్లాంట్ నిర్వాసితులకు సీపీఐ పూర్తి అండగా ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, సహాయ కార్యదర్శి సాబీర్‌పాషా, కార్యవర్గ సభ్యుడు అయోధ్యచారి, నియోజకవర్గ కార్యదర్శి సరెడ్డి పుల్లారెడ్డి, నాయకులు అక్కి నర్సింహారావు, ఎడారి రమేష్, కామిశెట్టి రామారావు తదితరులు పాల్గొన్నారు.


