
మాట్లాడుతున్న చాడ వెంకటరెడ్డి
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ విషయంలో సర్కారు తొందరపాటు, తప్పిదం కారణంగా నిర్వాసిత రైతులు తీవ్రంగా నష్టపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.
భద్రాద్రి ప్లాంట్ నిర్వాసిత రైతులతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
మణుగూరు:
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ విషయంలో సర్కారు తొందరపాటు, తప్పిదం కారణంగా నిర్వాసిత రైతులు తీవ్రంగా నష్టపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్లాంట్ పనులు తిరిగి ప్రారంభమ్యేంత వరకు నిర్వాసిత రైతులు తమ భూముల్లో పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి ప్లాంట్ వద్ద భూనిర్వాసిత రైతులతో ఆదివారం ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తరువాత కొత్త ప్రాజెక్టు కోసం భూసేకరణ విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించింది ఒక్క మణుగూరు ప్రాంతమేనని అన్నారు. అయినప్పటికీ, నిర్వాసిత రైతుల్లో ఇంకా 186 మందికి పరిహారం, 346 మంది నిరుద్యోగ నిర్వాసిత యువతకు ఉద్యోగ హామీ పత్రాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్లాంట్ ఏర్పాటు పనులు ప్రారంభించడం పూర్తిగా ప్రభుత్వ తొందరపాటు, తప్పిదమేనని అన్నారు. దీని ఫలితంగా నిర్వాసిత రైతులు తమ భూముల్లో సాగు చేయలేక, పరిహారం అందక, ఉపాధి లేక తీవ్రంగా నష్టపోయారని అన్నారు. పేరంటాల చెరువు కింద రెండు పంటలు పండే భూములను ఒక్క పంట భూములుగా ప్రభుత్వం చూపిందని, భూసేకరణ చట్టం అమలు చేయకుండానే నామమాత్రంగా పరిహారం ఇచ్చిందని విమర్శించారు. భద్రాద్రి ప్లాంట్ నిర్వాసితులకు సీపీఐ పూర్తి అండగా ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, సహాయ కార్యదర్శి సాబీర్‌పాషా, కార్యవర్గ సభ్యుడు అయోధ్యచారి, నియోజకవర్గ కార్యదర్శి సరెడ్డి పుల్లారెడ్డి, నాయకులు అక్కి నర్సింహారావు, ఎడారి రమేష్, కామిశెట్టి రామారావు తదితరులు పాల్గొన్నారు.