రైతుల హక్కుల మాటేమిటి? | Indian Farmers Rights On Seeds Musaida Bill | Sakshi
Sakshi News home page

రైతుల హక్కుల మాటేమిటి?

Dec 1 2025 12:42 AM | Updated on Dec 1 2025 12:42 AM

Indian Farmers Rights On Seeds Musaida Bill

దాదాపు రెండు దశాబ్దాల చర్చలు, కోర్టు కేసులు, విత్తన వైఫల్యాలు, పెరుగుతున్న సాగు వ్యయాల తర్వాత, భారత దేశం మరోసారి తన విత్తన చట్టాలను మార్చే దశకు వచ్చింది. 2004, 2019 ముసాయిదాల తర్వాత వచ్చిన విత్తనాల ముసాయిదా బిల్లు 2025 ఎన్నో ఆశలను రేకెత్తించింది. నేడు రైతులు ఎదుర్కొంటున్న అస్థిర విత్తన నాణ్యత, ఊగిసలాట ధరలు, పెరుగుతున్న కార్పొరేట్‌ ఆధి పత్యం వంటి భారాలను దృష్టిలో పెట్టుకుని రైతులను బలోపేతం చేస్తుందని అంతా ఆశించారు. కానీ ఈ బిల్లులో ‘వ్యాపార సౌలభ్యం’ (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)కు ఉన్న ప్రాధాన్యం, ‘వ్యవసాయ సౌలభ్యం’ (ఈజ్‌ ఆఫ్‌ ఫార్మింగ్‌)కు లేదు.

నష్టపోయిన రైతుల్ని వదిలేసి...
బిల్లులోని ఉద్దేశ్య వాక్యం దీని అసలు వైఖరిని తేటతెల్లంచేస్తోంది. ఇది ‘నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సరఫరాను సులభ తరం చేయుటకు’ అని చెబుతుందే తప్ప, రైతుల హక్కులు, పంట నష్టపరిహారం, ధరల నియంత్రణ వంటి అంశాలపై ఒక్క మాటా లేదు. ఇది ముసాయిదాలో లోపం కాదు. ఇది చట్టం ఏ ధోరణిలో ఉన్నదో స్పష్టంగా తెలియజెబుతోంది. అసలు బిల్లే పరిశ్రమ – వాణిజ్య చట్టంలా కనిపిస్తుంది తప్ప, రైతుల హక్కుల చట్టంలా కాదు! నాణ్యత నియంత్రణ బలోపేతం అవుతుందనీ, కేంద్రీకృత విత్తన ట్రేసబిలిటీ పోర్టల్‌ వస్తుందనీ బిల్లు మద్దతుదారులు చెబు తున్నారు. క్యూఆర్‌ కోడ్‌లు, డిజిటల్‌ ట్రేసింగ్‌– ఇవన్నీ కాగితంపై బానే కనబడతాయి. కానీ ఇవి న్యాయం సాధించడానికి సరిపోవు. ట్రేసబిలిటీ డేటా ఆధారంగా చెడు బ్యాచ్‌లు ఆటోమేటిక్‌గా వెనక్కి పోతాయనీ, పునరావృత దోషులను బ్లాక్‌ లిస్ట్‌లో పెడతారనీ, రైతులకు నష్టపరిహారం స్వయంచాలకంగా అందుతుందనీ బిల్లు ఎక్కడా నిర్దేశించలేదు.

విత్తనాల ముసాయిదా బిల్లులోని అత్యంత పెద్ద లోపం? రైతులకు చట్టబద్ధ, కాలపరిమితి ఉన్న నష్టపరిహారం వ్యవస్థ లేకపోవడం! తేలిక, చిన్న, పెద్ద తప్పులకు భారీ జరిమానాలు, జైలు శిక్ష వరకూ బిల్లు నిర్దేశిస్తోంది. కానీ ఆ జరిమానాలు రైతులకు కలిగిన నష్టాలను భర్తీ చేయలేవు. పాత, నాసిరకం, నకిలీ విత్తనం వల్ల పంటనష్టం జరిగిన రైతు, ఇంకా వినియోగదారుల కోర్టులకే వెళ్లాలి; సాక్ష్యాధారాలు సమర్పించాలి; సంవత్సరాల తరబడి కేసును లాగాలి. చిన్న రైతులకు ఇది సాధ్యం కాని వ్యవస్థ.

ధరల నియంత్రణపై చేతులెత్తేసి...
ధర నియంత్రణ విషయంలో కూడా బిల్లు బలహీనంగానే ఉంది. సెక్షన్‌ 22 ప్రకారం ధరలను కేవలం ‘అత్యవసర పరిస్థితుల్లో’ – అసాధారణ పెరుగుదల, కొరత, ఏకాధిపత్య ధోరణి సమయాల్లో మాత్రమే నియంత్రించవచ్చు. దీని అర్థం: సాధారణ పరిస్థితుల్లో విత్తన ధరలపై ప్రభుత్వం తన చేతులు దులుపుకొంటుంది. గతంలో రాష్ట్రాలు అత్యవసర ఉత్పత్తుల చట్టం కింద బీటీ కాటన్‌ ధరలు, రాయల్టీలను నియంత్రించిన చట్టపరమైన హక్కులు ఇప్పుడు క్షీణి స్తాయి. విత్తన మార్కెట్‌ ఇప్పటికే కొద్ది కంపెనీల చేతుల్లో ఉండగా, ఈ బలహీన నియంత్రణ రైతులపై మరింత భారాన్ని మోపుతుంది. ఇంకో ప్రధాన సమస్య– ఈ బిల్లు కేంద్రాధిపత్యాన్ని బలపరచడం, రాష్ట్రాల హక్కులను బలహీన పరచటం! సెక్షన్‌ 17(8)లో సూచించిన ‘కేంద్ర అక్రెడిటేషన్‌ వ్యవస్థ’ వల్ల, ఒకసారి కేంద్రం నుండి అక్రెడిటేషన్‌ పొందిన కంపెనీలు అన్ని రాష్ట్రాల్లో ఆటోమే టిక్‌గా నమోదు అయినట్లే! రాష్ట్రాలు సాంకేతిక, ఆర్థిక, వసతి కారణాల మీద ఆ కంపెనీలను నిరాకరించలేవు. సెక్షన్‌లు 38, 41తో కలిపి చూస్తే, ఈ బిల్లు రాష్ట్రాల విత్తన పాలనా హక్కులను దాదాపుగా తొలగిస్తుంది.

వెరైటీ ట్రయల్స్, సర్టిఫికేషన్‌లో విదేశీ సంస్థలను అనుమతించే నిబంధనలు దీనికంటే ప్రమాదకరమైనవి. ఐసీఏఆర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయాల స్థానిక శాస్త్రీయ పరీక్షలను పక్కన పెట్టి, విదేశీ ట్రయల్‌ డేటాకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల భారత వాతావరణానికి సరిపోని వెరైటీలు వేగంగా మార్కెట్లోకి రావచ్చు. ఇది విత్తన స్వావ లంబనకు ముప్పు. జన్యుమార్పిడి పంటలు (జీఎం) లేదా ‘ప్రొప్రై టరీ హైబ్రిడ్స్‌’ నిర్బంధం లేకుండా ప్రవేశించే పరిస్థితి వస్తుంది. కమ్యూనిటీ విత్తన వ్యవస్థలు, ఇప్పటికీ అనేక పంటలలో ప్రధాన విత్తన వనరుల గురించి బిల్లులో కేవలం ప్రస్తావన స్థాయిలోనే చూపారు. రైతు–బ్రీడర్ల హక్కులు, ఎఫ్‌పీఓలు చేసే స్థానిక విత్తన వ్యాపారం, కమ్యూనిటీ సీడ్‌ బ్యాంకులు–వీటిని బలపరచడంలో బిల్లు పూర్తిగా విఫలమైంది. కాంట్రాక్ట్‌ ఆధారంగా విత్తనాలు ఉత్పత్తి చేసే విత్తన రైతుల హక్కులను కూడా పూర్తిగా పట్టించుకోలేదు.

పాలనా నిర్మాణం అంతా కూడా కేంద్రీకృతమైపోయింది. రైతుల ప్రతినిధులు సెంట్రల్‌ కమిటీలో కొన్ని రొటేటింగ్‌ సీట్లు పొందినా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ లేదా గ్రీవెన్స్‌ రిడ్రెస్సల్‌ వ్యవస్థల్లో వారికి ప్రత్యక్ష పాత్ర లేదు. దీని వల్ల పెద్ద కంపెనీలు వ్యవస్థను సులభంగా తమ వైపు తిప్పుకోగలవు. చిన్న డీలర్లు, చిన్న కంపెనీలు మాత్రమే నియంత్రణ బరువును మోస్తాయి.

మరి బిల్లు ఎలా ఉండాలి?
నిజమైన రైతు కేంద్రీకృత విత్తన చట్టం ఎలా ఉండాలంటే:
1. నష్ట పరిహారం ఆటోమేటిక్‌ కాల పరిమితితో, పంట నష్టానికి అనుసంధానంగా ఉండాలి. కంపెనీల నుంచే సీడ్‌ లయబిలిటీ ఫండ్‌ ఏర్పడాలి. 
2. విత్తన ధరలు, రాయల్టీలను శాశ్వతంగా నియంత్రించే స్వతంత్ర సంస్థ ఉండాలి. అందులో రైతులు, రాష్ట్రాలు, శాస్త్రవేత్త లకు  భాగస్వామ్యం ఉండాలి. 
3. స్థానిక అవసరాల ప్రకారం విత్తన రకాలను అనుమతించడానికి/నిరాకరించడానికి రాష్ట్రాలకు పూర్ణ అధికారం ఉండాలి. 
4. రైతు బ్రీడర్లను, కమ్యూనిటీ సీడ్‌ వ్యవస్థలను  బలపరచాలి. 
5. సీడ్‌ ప్రొడ్యూసర్‌ రైతులకు న్యాయమైన కాంట్రా క్టులు, కచ్చితమైన చెల్లింపులు, రక్షణ ఇవ్వాలి. 
6. లెసెన్సింగ్, ట్రేస బిలిటీ రెండూ తప్పనిసరి కావాలి. 
7. జెర్మినేషన్, పేరెంటేజ్, రాయల్టీ, రిజిస్ట్రేషన్‌ వివరాలపై పూర్తి పారదర్శకత ఉండాలి.
8. ‘పీపీవీ అండ్‌ ఎఫ్‌ఆర్‌’ చట్టంలోని రైతుల హక్కులు బలపడాలి తప్ప  బలహీనపడకూడదు. ‘విత్తనాల బిల్లు 2025’ భారత విత్తన వ్యవస్థను సమానత్వం, ప్రతిస్పందనశీలత, స్వావలంబన దిశగా మలిచే అవకాశం. కానీ బిల్లు రైతుల రక్షణ కంటే వ్యాపార నిర్వహణ సులభతరంపై ఎక్కువ దృష్టి పెట్టినట్లయితే, ఆ అవకాశం వృథా అవుతుంది. బిల్లుకు తుది రూపం దిద్దేముందు రైతు సంఘాలు, రాష్ట్రాలు, శాస్త్ర సమాజం, ప్రజా పరిశోధనా సంస్థలతో కేంద్రం అర్థవంతమైన సంప్రదింపులు జరపాలి. విత్తనం వేస్తున్న రైతు ప్రమాదం భరించాల్సిన చివరి వ్యక్తి కాకుండా ఉండేలా చట్టాన్ని పునర్నిర్మించాలి. 
 


డా. జి.వి.రామాంజనేయులు 
వ్యాసకర్త ‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ 

Advertisement
 
Advertisement
Advertisement