చిత్తశుద్ధి లేని అరకొర ప్రయత్నాలు | Telangana panchayat elections reflect on BC Reservations | Sakshi
Sakshi News home page

చిత్తశుద్ధి లేని అరకొర ప్రయత్నాలు

Nov 30 2025 1:23 AM | Updated on Nov 30 2025 1:23 AM

Telangana panchayat elections reflect on BC Reservations

తెలంగాణలోని వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వే షన్లు ఇస్తామంటూ కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం రెండేళ్లపాటు నమ్మబలికి ఇప్పుడు నట్టేట ముంచింది. స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్య, ఉద్యోగాల్లో కూడా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ ఎంతో ఆర్భాటం చేసింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఇదివరకు అమలు చేసిన రిజర్వేషన్ల శాతం కంటే మరింత తగ్గించి బీసీలను నిలువునా ముంచేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన ఉన్నప్పుడు... వ్యూహాత్మక కార్యాచరణ ఏమైంది? కేవలం ఆర్భాటం చేస్తూ బిల్లులు రూపొందించి అసెంబ్లీలో ఆమో దింపజేయడం, ఆ తర్వాత హడావిడిగా ఆర్డినెన్స్‌ ఇవ్వడం, వాటికి దిక్కులేకపోవడంతో జీఓ జారీ చేయడం అంతా ఒక కల్పనగానే ఉంది. ఇప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వకుండా... పార్టీ పరంగా ఇస్తామంటూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం చూస్తుంటే నాటకీయంగా తప్పించుకున్నట్లు స్పష్టమైంది. పంచాయతీ ఎన్ని కలు పార్టీ గుర్తుతో జరగనప్పుడు, పార్టీ అభ్యర్థులుగా ఎలా ఎంపిక చేస్తారు?

ఉత్తుత్తి ప్రయత్నం...
రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రచార అస్త్రంగా వాడుకున్నారు. తొలి వంద రోజుల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, మూడు నెలల తర్వాత కుల సర్వేపై నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్‌లో ప్రణాళికా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత రాష్ట్ర బీసీ కమిషన్‌ ఆధ్వర్యంలో కుల సర్వే అని, ఆ తర్వాత డెడికేటెడ్‌ బీసీ కమిషన్‌ ఏర్పాటు చేస్తామని, చివరకు వన్‌  మ్యాన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సమగ్ర సర్వే చేసి వాటి వివరాలను లోతుగా అధ్యయనం చేసేందుకు ముందుగా డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్‌  పూర్తిగా అధ్యయనం చేయడం, లోతుగా సర్వే చేపట్టిన నివే దికల ఆధారంగా చర్యలు తీసుకోవాలి. 

కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ ప్రమాణాలు పాటించలేదు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ ఆమోదించి రాష్ట్రపతికి పంపాలి. అక్కడ ఆమోదం పొందితేనే అవి చెల్లుబాటు అవుతాయి. తమిళనాడు నమూనా ప్రకారం 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుంది. ఇందుకు కేంద్రంపైన ఒత్తిడి తీవ్రతరం చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపైన ఒత్తిడి చేయకుండా ‘జంతర్‌మంతర్‌’లో ధర్నా చేసి చేతులు దులుపుకొంది.
కేంద్రంలో 243 మంది ఎంపీలున్న ఇండియా కూటమి పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టి చర్చకు ప్రయత్నం చేయలేదు. కనీసం తెలంగాణ ఎంపీలు సైతం పార్లమెంటులో ఈ ఊసే ఎత్తలేదు. ముఖ్యమంత్రి ఎన్నోసార్లు ప్రధానమంత్రి మోదీని కలిశారు. 

మరి బీసీ రిజర్వేషన్ల గురించి ప్రధానితో సంప్రదింపులు ఎందుకు చేయలేదు? తమిళనాడు తరహా అఖిలపక్ష పార్టీలతో సమావేశాలు నిర్వహించలేదు. ఢిల్లీకి అఖిలపక్ష పార్టీలను తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేదు. కేంద్ర స్థాయిలో పరపతి లేని అనామకులు మాత్రమే ‘జంతర్‌మంతర్‌’ వద్ద ధర్నాలు, నిరసనలు చేస్తారు. అన్ని రకాల అధికారాలున్న కాంగ్రెస్‌... బీసీ రిజర్వేషన్ల పట్ల కపటప్రేమను ప్రదర్శించింది. ఆర్డినె¯Œ ్స జారీ చేసి గవర్నర్‌ ఆమోదించలేదంటూ... చివరకు ఎలాంటి ఆధారాలూ లేకుండా జీఓలు జారీ చేసి బీసీ రిజర్వే షన్లు పెంచుతున్నామని చెప్పుకొంది. కానీ ఆ ఉత్తర్వులు న్యాయవ్యవస్థ ముందు నిలవలేదు.

ఐక్యతే అసలు మంత్రం...
కామారెడ్డిలో నిర్వహించిన బీసీ ఆక్రోశ సభలో మూడు తీర్మానాలు చేయించాను. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లులను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలనీ; కేంద్ర ప్రభుత్వం శీతాకాల సమా వేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను పార్లమెంట్‌లో పాస్‌ చేసి రాష్ట్రపతి ఆమోదంతో తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్పించాలనీ; స్థానిక రిజర్వేషన్‌ బిల్లును తొమ్మిదో షెడ్యూ ల్‌లో చేర్చి,  చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా 42 శాతం రిజర్వేషన్‌ కల్పించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలనీ తీర్మానాలు చేయించాను.

ఇప్పుడు గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ రిజర్వేషన్లు ఏ ప్రాతి పదికన ఖరారు చేశారో ప్రజలకు ప్రభుత్వం స్పష్టం చేయాలి. గతంలో 20 శాతానికి పైగా రిజర్వేషన్లు దక్కితే ఇప్పుడు అందులోనూ కోత పెట్టారు. శాస్త్రీయత లేకుండా, ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా ఉత్తర్వులు ఇస్తే అవి చెల్లుబాటు కావు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను హర్షిస్తూ బీసీ సంఘాలు పాలాభిషేకాలు, పూలాభిషే కాలు చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యలపై కనీసం ఆలోచన చేయలేని స్థితిలో సంఘాలున్నాయి.  బీసీ రిజర్వేషన్లకు కోతపెట్టి మరీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ అంశంపై ఉద్యమాలు, ఆందోళనలు చేయాల్సిందే! రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాలు అన్నీ ఒక్కతాటిపైకి వచ్చి వ్యూహా త్మకంగా పంచాయతీలను విభజించుకుని దళిత, గిరిజన, బీసీలను సర్పంచులుగా గెలిపించుకోవాలి.


జస్టిస్‌ వి. ఈశ్వరయ్య
ఉమ్మడి ఏపీ హైకోర్టు యాక్టింగ్‌ సీజే, ఎన్సీబీసీ మాజీ చైర్మన్‌ 

Advertisement
 
Advertisement
Advertisement