వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ పాస్‌లు ఉన్నవారిని మాత్రమే శబరిమలలోకి అనుమతించాలని కేరళ హైకోర్టు పేర్కొంది. అలాగే పాస్‌లోని తేదీ, సమయాన్ని అనుసరించాలని జస్టిస్ వి రాజా విజయరాఘవన్, జస్టిస్ కే వి జయకుమార్‌లతో కూడిన దేవస్వం బెంచ్ కూడా ఆదేశించింది. అధిక రద్దీ కారణంగా ఏదైనా అనుచిత ఘటన జరిగితే సహించబోయేది లేదని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డుని, పోలీసులను గట్టిగా హెచ్చరించింది ధర్మాసనం.
పరిపాలన నిర్లక్ష్యం లేదా అమలులో లోపాల కారణంగా నివారించదగిన అత్యవసర పరిస్థితులకు లక్షలాదిమంది యాత్రికులును బలి చేయకూడదని స్పష్టం చేసింది. అలాగే నకిలీ పాస్‌లతో వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని కూడా ఆదేశించింది. కనీసం తేదీని పాటించకుండా వచ్చేవారిని సన్నిధానంలోకి కూడా అనుమతించకూడదని స్పష్టం చేసింది. ముఖ్యంగా బుకింగ్ విధానాన్ని తూచా తప్పకుండా పాటించాలని పేర్కొంది.
నిజానికి వర్చువల్ క్యూ ద్వారా బుకింగ్‌లపై ఆంక్షలు ఉన్నప్పటికీ గత కొన్ని రోజులుగా సుమారు లక్ష మంది యాత్రికులు పుణ్యక్షేత్రానికి చేరుకున్నారనే శబరిమల స్పెషల్ కమిషనర్ నివేదిక ఆధారంగా కోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఇలా ఆదేశాలు జారీ చేసింది. అదీగాక హైకోర్టు కూడా యాత్రికుల సంఖ్యపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే వర్చువల్ క్యూ బుకింగ్‌లు 70,000, స్పాట్ బుకింగ్‌లు 5000 వద్ద ఉన్నాయని, కానీ తనిఖీ చేసేటప్పుడూ..సుమారు 7877 పాస్‌లపై స్పష్టమైన సమాచారం లేదని, స్పెషల్ కమిషనర్ హైకోర్టుకి నివేదించారు.
అలాగే కొందరు నకిలీ పాస్‌లతో వస్తున్నట్లుకూడా హైకోర్టుకి సమాచారం అందింది. ముఖ్యంగా గుంపులు గుంపులుగా వచ్చే చాలామంది యాత్రికుల వద్ద పాస్‌లు లేవని, అమికస్ క్యూరీ తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే కేరళ హైకోర్టు స్వయంగా ఈ కేసుని పరిగణలోనికి తీసుకుని విచారించి ఇలా ఆదేశాలు జారీ చేసింది.
(చదవండి: పంపా నుంచి అంతర్రాష్ట్ర కేఎస్‌ఆర్టీసీ సేవలకు అనుమతి)


