‘కేంద్రం లేబర్‌ కోడ్స్‌ మాకొద్దు’.. అందులో ఏముంది? | why Kerala openly refused to implement new labour codes know the reason | Sakshi
Sakshi News home page

‘కేంద్రం లేబర్‌ కోడ్స్‌ మాకొద్దు’.. అందులో ఏముంది?

Nov 27 2025 6:56 PM | Updated on Nov 27 2025 7:21 PM

why Kerala openly refused to implement new labour codes know the reason

కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన లేబర్ కోడ్స్‌ను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని కేరళ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న మొత్తం నాలుగు లేబర్ కోడ్స్‌ను ఇటీవల నోటిఫై చేసింది. దశాబ్దాలుగా ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొచ్చారు.

లేబర్‌ కోడ్స్‌లో చేసిన ముఖ్యమైన మార్పులు

  • తొలిసారిగా గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం.

  • దేశవ్యాప్తంగా కార్మికులందరికీ చట్టబద్ధమైన కనీస వేతనాలు అమలు.

  • ఉద్యోగులందరికీ తప్పనిసరి నియామక పత్రాలు.

  • అన్ని రంగాల్లో ఏకరీతి వేతన చెల్లింపు నియమాలు తీసుకురావడం.

కేరళ వైఖరి

కేరళ కార్మిక శాఖ మంత్రి వి.శివన్ కుట్టి కేంద్ర కార్మిక కోడ్స్‌ను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు. కేరళ ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న సీపీఐ(ఎం) ఈ కోడ్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ కోడ్స్‌ కార్మికుల దీర్ఘకాలిక హక్కులు, రక్షణలను పలుచన చేసేలా ఉన్నాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఈ కోడ్స్‌ కంపెనీల యజమానులకు అనుకూలంగా ఉండేలా రూపొందించినట్లు చెబుతోంది.

  • ఈ కోడ్‌లు ఉపాధిని పెంచుతాయనే కేంద్ర ప్రభుత్వ వాదనను కేరళ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ కోడ్స్‌ లక్ష్యం కార్మిక హక్కులను రద్దు చేయడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం అని పేర్కొంది.

  • ఈ కోడ్స్‌ కార్మికులు సమ్మె చేసే హక్కును హరించడానికి ప్రయత్నిస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా మంత్రి శివన్ కుట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక వైఖరిని తీసుకోదని తెలిపారు. కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం జరుపుతున్నట్లు చెప్పారు. డిసెంబర్ మూడో వారంలో తిరువనంతపురంలో కార్మిక సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు.

లేబర్ కోడ్స్‌పై నిపుణులు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కార్మిక సంఘాలు, కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.

తొలగింపు నియమాలు సడలింపు

300 మంది వరకు కార్మికులు ఉన్న సంస్థలకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే లే-ఆఫ్‌లు లేదా తొలగింపు చర్యలు తీసుకోవడానికి అనుమతిస్తుంది. గతంలో ఈ పరిమితి 100 మంది కార్మికులుగా ఉండేది. దీనివల్ల సంస్థలు ఇష్టానుసారం ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది.

సమ్మె హక్కుపై పరిమితులు

సమ్మెకు వెళ్లే ముందు 14 రోజుల నోటీసు తప్పనిసరి. ఈ నియమాలు సమ్మె హక్కును పరిమితం చేస్తాయని కార్మిక సంఘాల సామూహిక బేరసారాల శక్తిని బలహీనపరుస్తాయని ఆందోళన వ్యక్తం అవుతోంది.

సామాజిక భద్రతపై అస్పష్టత

గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తున్నప్పటికీ ఈ నిధుల్లో కంపెనీల విరాళం చాలా తక్కువ (ఆదాయంలో 1-2%) ఉంది. ఇది వారి అవసరాలకు సరిపోదని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.

పని గంటలు

ఈ కోడ్ పని గంటలను రోజుకు 8 నుంచి 12 గంటలకు పెంచడానికి అనుమతిస్తుంది (వారానికి మొత్తం పని గంటల్లో మార్పు లేకపోయినా). ఇది కార్మికుల ఆరోగ్యం, శ్రేయస్సుకు హానికరం.

స్థిర కాల ఉపాధి

ఉద్యోగులను ఏ రకమైన పనికైనా నిర్దిష్ట కాలానికి నియమించడానికి ఈ కోడ్‌లు అనుమతిస్తాయి. దీనివల్ల సంస్థలు రెగ్యులర్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు (గ్రాట్యుటీ, పెన్షన్ వంటివి) ఎగవేసి, ఎక్కువ మంది కార్మికులను తాత్కాలికంగా నియమించుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: రిచ్‌గా కనిపిస్తున్నారా? రిచ్‌గా మారుతున్నారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement