స్పోర్ట్స్ కారు, ఖరీదైన వాచ్, చేతి నిండా షాపింగ్ బ్యాగ్‌లు.. బయటికి చూస్తే అతడు కోటీశ్వరుడు! కానీ తన క్రెడిట్ కార్డు బిల్లులు, బ్యాంకు రుణాల చిట్టా చూస్తే మాత్రం కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. రిచ్‌గా కనిపించడానికి భారీగా అప్పు చేశాడు. మరోవ్యక్తి అనవసర ఆండంబరాలకు పోకుండా మంచి పెట్టుబడి సాధనాల్లో పొదుపు చేస్తూ దీర్ఘకాలంలో భారీ సొమ్ము పోగు చేశాడు. తర్వాత తన అవసరాలకు ఖర్చు చేస్తున్నాడు. నేటి సమాజంలో నిజంగా ధనవంతులుగా మారడానికి ప్రయత్నించే వారి కంటే, అప్పుల ఊబిలో కూరుకుపోయి ధనవంతులుగా నటించే వారే ఎక్కువైపోతున్నారు. పొరుగువారిని మెప్పించాలనే ఉద్దేశంతో లేనిపోని ఖర్చులు చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
రిచ్‌గా కనిపించడానికి చేసే ఖర్చులు కొన్ని..
చాలామంది వ్యక్తులు ఇతరుల దృష్టిలో ధనవంతులుగా, విజయవంతమైనవారిగా కనిపించడానికి తమ సంపాదనలో సింహభాగాన్ని ఖర్చు చేస్తారు. ఈ ఖర్చులు సాధారణంగా అప్పులు లేదా అధిక వడ్డీకి దారితీయవచ్చు.
అవసరం లేకపోయినా కేవలం స్టేటస్ సింబల్ కోసం ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌లు, బట్టలు, యాక్సెసరీలు కొంటారు. ఇవి ఆస్తులు కావు, విలువ కోల్పోయే వస్తువులని గుర్తుంచుకోవాలి.
స్తోమతకు మించిన లగ్జరీ కార్లు కొనడం, వాటి ఈఎంఐలు, నిర్వహణ ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతుంటారు. కారు విలువ తగ్గుతూ ఉంటుంది, కానీ అప్పు భారం మాత్రం పెరుగుతూనే ఉంటుంది.
నిత్యం ఖరీదైన రెస్టారెంట్లు, పబ్‌లు, విదేశీ పర్యటనలకు వెళ్లడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఇతరుల నుంచి ప్రశంసలు పొందాలని ఆశిస్తారు.
అవసరం కంటే పెద్ద ఇల్లు కొనడం లేదా అద్దెకు తీసుకుంటారు. కేవలం రిచ్ ఏరియాలో నివసించాలనే ఉద్దేశంతో అధిక అద్దె చెల్లిస్తారు.
నిజంగా రిచ్‌గా మారాలంటే అనుసరించాల్సిన మార్గాలు
నిజమైన సంపద అంటే బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో డబ్బు, నిరంతరాయంగా వచ్చే ఆదాయ వనరులు కలిగి ఉండటం. నిజమైన ధనవంతులు ఖర్చు చేయడంలో కాకుండా సంపద సమకూర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు.
ఇతరులను మెప్పించడం అనే ఆలోచనను వదిలి తమ వ్యక్తిగత ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టాలి.
ఎంత సంపాదించినా దానికి తగినట్టుగా ఖర్చును పెంచకుండా, ఒక కచ్చితమైన బడ్జెట్‌ను అనుసరించాలి.
వెంటనే వచ్చే సంతృప్తి (Instant Gratification) కంటే దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ఆదాయం, ఖర్చులను ట్రాక్ చేసి ప్రతి నెలా కచ్చితమైన బడ్జెట్‌ను అనుసరించాలి.
అధిక వడ్డీ ఉండే క్రెడిట్ కార్డు అప్పులు, వ్యక్తిగత రుణాలను ముందుగా తీర్చేయాలి.
జీతం రాగానే ఖర్చు చేయడానికి ముందే, కొంత మొత్తాన్ని నేరుగా పొదుపు ఖాతాలోకి లేదా పెట్టుబడిలోకి మళ్లించాలి.
ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు


