అమెరికా ఆంక్షలు అమల్లోకి రాకముందే నవంబర్ నెలలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి ముడి చమురు సరఫరాలను భారీగా పెంచాయి. దీని ఫలితంగా నవంబర్ 2025లో రష్యా నుంచి భారతదేశం ముడి చమురు దిగుమతులు రోజుకు సగటున 1.9 మిలియన్ బ్యారెల్స్‌తో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
గ్లోబల్ రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ ప్రొవైడర్ కెప్లెర్ (Kpler) వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 2025లో రష్యా అతిపెద్ద ముడి చమురు కొనుగోలుదారుగా భారత్ నిలిచింది. ఈ నెలలో ఇప్పటివరకు కార్గోలు సగటున రోజుకు 1.886 మిలియన్ బ్యారెల్స్ చమురు దిగుమతి చేసుకున్నాయి.
గణనీయ పెరుగుదల
నవంబర్ 2025లో చమురు దిగుమతులు అంతకుముందు నెలతో పోలిస్తే 17 శాతం పెరిగాయి. 2024లో ఇదే నెలతో పోలిస్తే దాదాపు 6 శాతం అధికమయ్యాయి. అలాగే 2023లో ఇదే నెలతో పోలిస్తే 12 శాతం పెరిగాయని కెప్లర్ డేటా వెల్లడించింది. నవంబర్ 21లోపు కొనుగోళ్లు పెరగడంతో భారతదేశానికి రష్యన్ క్రూడ్ దిగుమతి 5 నెలల గరిష్టానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే, నవంబర్ 21 నుంచే రోస్‌నెఫ్ట్(Rosneft), లుకోయిల్ (Lukoil)పై అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అంతకుముందే భారీగా క్రూడ్‌ను దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తుంది.
తగ్గుముఖం పట్టే అవకాశం
నవంబర్ 21 తర్వాత రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఇది తాత్కాలికంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది సరఫరా గొలుసులను పునర్వ్యవస్థీకరించడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: నిచ్చెన ఎక్కితేనే బ్యాంకులోకి ప్రవేశం..


