మధ్యంతర ప్రభుత్వం నుంచి మార్కెట్ ధరకే కొనుగోలు చేస్తాం
రోజుకు 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల బ్యారెళ్లు దిగుమతి చేసుకుంటాం
డబ్బును రెండు దేశాల ప్రజలకు మేలు జరిగేలా ఖర్చు చేస్తాం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టీకరణ
కారకాస్: వెనెజువెలాలోని అపారమైన చము రు నిల్వలను దోచుకోవడానికే ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులను అక్రమంగా నిర్బంధించారంటూ ప్రపంచమంతటా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వెనెజువెలా చమురు తమదేనని తేల్చిచెప్పారు. అయితే, మార్కెట్ ధరకే కొనుగోలు చేయబోతున్నామని వెల్లడించారు.
30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల బ్యారెళ్ల అత్యధిక నాణ్యత కలిగిన చమురును వెనెజువెలా మధ్యంతర ప్రభుత్వం నుంచి స్వీకరిస్తామని తెలిపారు. ఈ మేరకు ట్రంప్ మంగళవారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఎలాంటి ఖర్చు లేకుండా బలప్రయోగంతో చమురును సొంతం చేసుకోవడానికి ట్రంప్ కుట్రలు సాగిస్తున్నారంటూ వస్తున్న విమర్శలను పరోక్షంగా ఖండించారు. ‘‘స్టోరేజీ నౌకల్లో చమురును వెనెజువెలా నుంచి నేరుగా అమెరికాలోని అన్‌లోడింగ్ కేంద్రాలకు తరలిస్తాం. అమెరికా అధ్యక్షుడిగా నా నియంత్రణలో ఉన్న డబ్బును వెనెజువెలా, అమెరికా ప్రజలకు కచి్చతంగా మేలు జరిగేలా ఖర్చు చేస్తాం’’ అని ట్రంప్ తేల్చిచెప్పారు.
గొప్ప పని చేశావంటూ క్రెడిట్ ఇస్తారు
వెనెజువెలాపై దాడి చట్టవిరుద్ధం, అన్యాయం అంటూ ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను ట్రంప్ తిప్పికొట్టారు. డ్రగ్స్ టెర్రరిజం కేసులో నికోలస్ మదురోను అరెస్టు చేయాలని మాజీ అధ్యక్షుడు బైడెన్ ఆదేశించినట్లు గుర్తుచేశారు. తాను చేసింది తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. వాషింగ్టన్‌లో ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు.
వెనెజువెలాపై విజయవంతంగా సైనిక ఆపరేషన్ నిర్వహించినందుకు తనను ప్రశంసించాల్సిందిపోయి తప్పుపట్టడం సరైంది కాదని అన్నారు. మదురోను చట్టబద్ధమైన అధ్యక్షుడిగా అమెరికా ప్రభుత్వం ఏనాడూ గుర్తించలేదని వెల్లడించారు. ప్రతిపక్ష నాయకులు ఏదో ఒకరు తనను పొగిడేస్తారని, గొప్ప పని చేశావంటూ క్రెడిట్ ఇస్తారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ హెచ్చరికలను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్స్ కొట్టిపారేశారు. తన విధిని నిర్ణయించేది భగవంతుడే తప్ప మరొకరు కాదని స్పష్టంచేశారు. తనను బెదిరించేవారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని ఆమె అన్నారు.
బ్యారెల్‌కు 56 డాలర్లు?
వెనెజువెలా చమురును అమెరికా సర్కార్ బ్యారెల్ 56 డాలర్ల ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ చెప్పినట్లుగా రోజుకు సగటున 20 మిలియన్ల బ్యారెల్స్ కొనుగోలు చేయొచ్చు. 2.8 బిలియన్ డాలర్ల విలువైన చమురు, చమురు సంబంధిత ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకోనుంది. అంతా అనుకున్నట్లు జరిగితే రోజువారీ అవసరాల కంటే ఎక్కువ చమురే వెనెజువెలా నుంచి దిగుమతి కానున్నట్లు యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మిని్రస్టేషన్ తెలియజేసింది.

రేపు వైట్‌హౌస్‌లో కీలక భేటీ!
వెనెజువెలా చమురును అమెరికాకు తరలించే ప్రక్రియ ఊపందుకుంటోంది. వెనెజువెలా చమురు కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో కీలక సమావేశం జరగనున్నట్లు సమాచారం. స్వయంగా అమెరికా ప్రభుత్వమే ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా చమురు దిగ్గజ సంస్థలు ఎక్సాన్, చెవ్రాన్, కొనాకోఫిలిప్స్ ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. వెనెజువెలా, అమెరికా మధ్య చమురు వాణిజ్యంపై ఈ సమావేశంలో చర్చిస్తారని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అయితే తమ రాజధాని కారకాస్‌పై ఈ నెల 3న అమెరికా నిర్వహించిన దాడిలో కనీసం 24 మంది భద్రతా సిబ్బంది మరణించారని వెనెజువెలా అధికారులు వెల్లడించారు. అలాగే 32 మంది క్యూబా సైనికులు, పోలీసు అధికారులు మృతిచెందినట్లు తెలియజేశారు.


