ఇరాన్‌పై దాడులు.. నెతన్యాహు ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్..! | Story On Trump Bows To Netanyahus Pressure In Iran Strikes | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై దాడులు.. నెతన్యాహు ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్..!

Mar 2 2026 6:27 PM | Updated on Mar 2 2026 8:53 PM

Story On Trump Bows To  Netanyahus Pressure In Iran Strikes

ఇరాన్‌పై దాడుల వెనక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒత్తిడి ఉందా? నిజానికి చర్చలతో ఇరాన్‌ను దారికి తీసుకువద్దామనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం నెతన్యాహు ఒత్తడికి తలొగ్గాడా? తాను సంయమనం పాటిద్దామనుకున్నా.. నెతన్యాహు ఆగేలా లేడని తెలిసి.. అతనికి జైకొట్టాడా? గడిచిన నెల రోజుల్లో మారిన పరిణామాలన్నీ ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం చెబుతున్నాయి. అసలు ఏం జరిగింది? ఉన్నఫళంగా ఇరాన్‌పై ఉరుము ఉరిమినట్లుగా ఫైటర్ జెట్లు విరుచుకుపడడం.. సుప్రీంలీడర్ ఖమేనీని అంతమొందించడం వెనక అసలు వ్యూహం ఎవరిది? 

నోబెల్ శాంతి బహుమతి కోసం తహతహలాడుతున్న ట్రంప్.. చర్చల ద్వారా ఇరాన్‌ను దారికి తీసుకురావాలనుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చెలరేగినప్పుడు.. ట్రంప్ నిరసనకారులకు బేషరతుగా మద్దతిచ్చారు. నిరసనలను అణిచివేస్తే.. ఇరాన్‌పై దాడి చేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. ఫలితంగా.. ఉరిశిక్ష పడ్డ పలువురు ఆందోళనకారులకు ఆ శిక్ష నుంచి విముక్తి లభించింది. గత ఏడాది జూన్‌లో అమెరికా దళాలు ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు జరిపిన విషయం తెలిసిందే..! అదే సమయంలో ఇజ్రాయెల్‌తో కలిసి.. ఇరాన్ అగ్రశ్రేణి జనరల్స్‌ను హతమార్చింది. ఈ నేపథ్యంలో.. ట్రంప్ కన్నెర్ర చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఊహించిన పశ్చిమాసియాలోని గల్ఫ్ దేశాలు దౌత్యపరమైన పరిష్కారం కోసం ముందుకు వచ్చాయి.

నిజానికి ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైన ఇరాన్‌లో ప్రజాందోళనలతో పరిస్థితులు దిగజారాయి. దాంతో.. ఇప్పటికిప్పుడు ఇరాన్ నుంచి ఇటు అమెరికాకు గానీ, అటు ఇజ్రాయెల్‌కి గానీ ముప్పు లేదని ట్రంప్‌కు తెలుసు. అందుకే ట్రంప్ దౌత్య మార్గంలో వెళ్దామని భావించారు. ఇరాన్ నేతలు తెరవెనక నుంచి అమెరికాలో ట్రంప్, ఇజ్రాయెల్‌లో నెతన్యాహు ప్రభుత్వాలను కూల్చివేసేందుకు కుయుక్తులు పన్నుతున్నా.. ఇజ్రాయెల్‌లో ఈ ఏడాది చివర్లో జరగనున్నఎన్నికల్లో నెతన్యాహును దింపేందుకు వ్యూహాలు చేస్తున్నా.. ట్రంప్ మాత్రం చర్చల వైపే మొగ్గుచూపారు. 

గత నెల 26న స్విట్జర్లాండ్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు కొంత వరకు పురోగతిని సాధించాయనే చెప్పవచ్చు. దీంతో.. వచ్చేవారం వియన్నాలో చర్చలకు షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇందుకు ఒమన్ మధ్యవర్తిత్వం వహించింది. 

చర్చల వైపు ట్రంప్ మొగ్గుచూపుతూ.. ముందుకు సాగుతుంటే.. ఇజ్రాయెల్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఏ క్షణమైనా దాడి చేద్దామంటూ అమెరికాపై నెతన్యాహు ఒత్తిడి పెంచారు. ఇరాన్‌తో దౌత్యం సరికాదంటూ నచ్చజెబుతూ వచ్చారు. ఇరాన్ వైఖరిలో ఏమాత్రం మార్పు రాదని.. గత ఏడాది జూన్‌లో అణుకేంద్రాలపై దాడులు చేసినా.. ఇప్పుడు మళ్లీ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌లను కొనసాగిస్తోందని హెచ్చరించారు. ఇజ్రాయెల్ దూకుడుతో ట్రంప్ ముందస్తు రక్షణ ఏర్పాట్లు చేశారు. ఇజ్రాయెల్‌కు అండగా.. గత నెల 24న యూఎస్ నేవీ ఏవియేషన్‌ను ఇజ్రాయెల్‌కు పంపారు. యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌ను అరేబియా సముద్రంలో మోహరించారు. 

అమెరికా ఇంతలా సహకరించినా.. ఇజ్రాయెల్ మాత్రం తనకు ఇరాన్ బద్ధశత్రువని.. గుణపాఠం చెప్పాల్సిందేనని భీష్మించుకుంది. ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్‌లో యుద్ధాలు తగదని చరిత్ర చెబుతున్నా.. నెతన్యాహు తన మొండిపట్టును వీడలేదు. చివరికి శుక్రవారం అర్ధరాత్రి దాటాక.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ వాయుసేన భీకర దాడులు జరిపింది. ఆ తర్వాత పెద్దన్న అమెరికా కూడా యుద్ధంలో జతకట్టక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత ఇజ్రాయెల్ దాడులు జరిపాకే.. అమెరికా ఈ యుద్ధంలో పాల్గొనడం గమనార్హం..! అయితే.. అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మాత్రం.. అమెరికా వ్యూహంలో భాగంగానే ఇజ్రాయెల్ తొలి దాడి చేసినట్లు చెబుతున్నారు. ఎందుకంటే.. ఇరాన్ ప్రతిదాడి నేరుగా పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపైనే ఉంటుంది. 

ఈ నేపథ్యంలో తప్పించక తానొవ్వక అన్నట్లుగా వ్యవహరించాలనేది ట్రంప్ వ్యూహమని వివరిస్తున్నారు. ఏది ఏమైనా.. అటు ఇజ్రాయెల్.. ఇటు అమెరికా ఆశించిన ఫలితాలను ఈ దాడులు అందజేశాయి. ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా ఖమేనీతోపాటు.. మాజీ అధ్యక్షుడు అహ్మదీ నేజాద్, ఇతర మిలటరీ నాయకులు కూడా ఈ దాడులతో నేలకొరిగారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement