అమెరికా-ఇజ్రాయిల్ లు సంయుక్తంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనీ మృతిచెందిన తర్వాత యుద్ధ తీవ్రత మరింత ముదిరింది. తన శత్రు దేశాలుగా భావిస్తున్న వాటిపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ప్రధానంగా ఇజ్రాయిల్‌ను టార్గెట్ చేసి ఇరాన్ ప్రతీకార దాడులను తీవ్రతరం చేసింది. ఈరోజు(మార్చి 2వ తేదీ) ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహూ టార్గెట్‌గా ఇరాన్ దాడులు క్షిపణులతో దాడులకు దిగింది. తాము ఇజ్రాయిల్ ప్రధాని టార్గెట్‌గా దాడి చేసిన విషయాన్ని ఐఆర్‌జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) ప్రకటించింది. ఇజ్రాయిల్ ప్రధాని ఆఫీస్‌పై క్షిపణులతో దాడి చేశామని, కానీ నెతాన్యాహూ ఎక్కడ ఉన్నారో స్పష్టత లేదని స్పష్టం చేసింది. అయితే తాము జరిపిన దాడుల్లో ఇజ్రాయిల్‌కు చెందిన పలువురు కమాండర్లు హతమయ్యారని ఐఆర్‌జీసీ వెల్లడించింది.
ఒమన్ మా లక్ష్యం కాదు..
ఇదిలా ఉంచితే, ఇరాన్ చేస్తున్న యుద్ధంలో పలు దేశాలకు భారీ నష్టం వాటిల్లితోంది. అరబ్ దేశాలపై కూడా ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది. దానిలో భాగంగా ఒమన్‌పై కూడా ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ రెండు డ్రోన్లతో ఒమన్‌లోని డుక్మ్ వాణిజ్య పోర్ట్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఒక డ్రోన్ కార్మికుల నివాస ప్రాంతాన్ని తాకగా, ఒక విదేశీయుడు గాయపడ్డాడు. మరొక డ్రోన్ ఇంధన నిల్వ ట్యాంకుల దగ్గర పడింది కానీ పెద్ద నష్టం జరగలేదు.
దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ మాట్లాడుతూ.. ‘ మా చాయిస్ ఒమన్ కాదు. కానీ దాడులు జరిగాయి. మేము మా సైనికులకు ఇప్పటికే చెప్పాం. మన లక్ష్యం మీద మాత్రమే మన గురి ఉండాలనే విషయం చెప్పాం. కానీ ఒమన్‌పై దాడి జరిగింది. మా సైనిక విభాగాలు ఇప్పుడు, వాస్తవానికి, స్వతంత్రంగా, మరొకవైపు వేరుపడిన స్థితిలో ఉన్నాయి. అవి ముందుగానే ఇచ్చిన సాధారణ సూచనల ఆధారంగా పనిచేస్తున్నాయి’ అని తెలిపారు.
వారిని హతమార్చాం: ఇజ్రాయెల్
ఇరాన్ ఇండిలిజెన్స్ వ్యవస్థకు సంబంధించిన కీలక అధికారులను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఆ దేశ ఇంటిలిజెన్స్ డిప్యూటీ మంత్రి సయ్యద్ యాహ్యా హమీది, ఇంటెలిజెన్స్ చీఫ్ జలాల్ పౌర్ హుస్సేన్‌లతో పాటు ఇతర అధికారులు హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.


