- రెండు చమురు నౌకలను దిగ్బంధించిన అమెరికా
- వెనెజువెలావే అని వాదన
- తమవేనంటున్న రష్యా
- అమెరికా ఓ సముద్రపు దొంగ అంటూ ధ్వజం
- అగ్రరాజ్యాల నడుమ కాక రేపుతున్న ఉదంతం
- యూఎస్‌కు సహకరించిన బ్రిటన్ నావికా దళం
వాషింగ్టన్: ఉరుముల్లేని పిడుగులా అమెరికా, రష్యా మధ్య ఉన్నట్టుండి నిప్పు రాజుకుంది. చమురే ఇందుకు నిమిత్తంగా మారడం విశేషం. వెనెజువెలాకు చెందినవిగా భావిస్తున్న రెండు నిషేధిత చమురు నౌకలను అమెరికా బుధవారం దిగ్బంధించింది. వీటిలో ఒకదానిని ఉత్తర అట్లాంటిక్, మరోదాన్ని కరీబియన్ సముద్ర జలాల్లో పట్టుకున్నట్టు అధికారులు బుధవారం వెల్లడించారు. అయితే అవి తమవేనని రష్యా పేర్కొనడం సంచలనం రేపింది.
తొలుత వాటిలో ఒక ట్యాంకరే తమదని రష్యా చెప్పినట్టు వార్తలొచ్చినా, రెండూ తమవేనని కాసేపటికే రష్యా పేర్కొంది. ‘‘అమెరికా ఓ సముద్రపు దొంగ. నిబంధనలను ఉల్లంఘిస్తూ మా నౌకలను దిగ్బంధించింది’’ అంటూ మండిపడింది. అంతేగాక వాటి రక్షణ నిమిత్తం రష్యా హుటాహుటిన జలాంతర్గాములను తరలిస్తున్నట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
ఇది ఎటు తిరిగి చివరికి ఎలా పరిణమిస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా పట్టుకున్న రెండు నౌకల్లో ఒకటి బెల్లా1, రెండోది సోఫియా. బెల్లా1ను అమెరికా నిషేధాంక్షలను ఉల్లంఘించి తిరుగుతోందనే అభియోగాలపై నెల రోజులుగా అమెరికా నావికా దళం వెంటాడుతూ వస్తోంది. దాన్ని ఎట్టకేలకు ఉత్తర అట్లాంటిక్ జలాల్లో అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది. అందుకు బ్రిటన్ నావికా దళం సాయపడటం గమనార్హం.
గగనతల నిఘా సాయం అందించడమే గాక బెల్లా1ను పట్టుకునేందుకు తమ యుద్ధ నౌకను బ్రిటన్ పంపింది. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ ధ్రువీకరించారు. దానిని ఒక ‘ధూర్త నౌక’గా ఆయన అభివరి్ణంచారు. సోఫియాను కరీబియన్ జలాల్లో పట్టుకున్నట్టు హోంలాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ నోయెమ్ వెల్లడించారు. ఈ రెండు చమురు నౌకలూ చివరిసారిగా వెనెజువెలాలోనే లంగరు వేశాయని చెప్పుకొచ్చారు.
అవి ఆ దేశానికి చెందినవి కాకుండాపోయే ఆస్కారమే లేదన్నారు. హెజ్బొల్లా ఉగ్రముఠాకు చెందిన సరుకును రవాణా చేస్తోందంటూ బెల్లా1పై 2024లోనే అమెరికా నిషేధాంక్షలు విధించింది. ‘‘గత డిసెంబర్‌లోనే కరేబియన్ దీవుల్లో దాన్ని నిలువరించేందుకు అమెరికా తీరరక్షక దళం ప్రయతి్నంచింది. కానీ ఒడ్డుకు చేరేందుకు బెల్లా1 నిరాకరించి ముందుకు సాగింది. అనంతరం మారినెరా అని పేరు మార్చుకోవడమే గాక డాక్‌యార్డుపై రష్యా జెండాను ఎగురవేసింది.
ముందు భాగానికి రష్యా పతాకపు రంగులు పూసుకుంది’’ అని హోంలాండ్ విభాగం అధికారులు తెలిపారు. మరోవైపు రష్యా మాత్రం బెల్లా1 అనేది తమ చమురు నౌకేనని చెబుతుండటం విశేషం. అమెరికా జలాలకు ఏకంగా 4,000 కి.మీ.ల దూరంలో ఆ దేశ తీరరక్షక దళం తమ నౌకను అక్రమంగా నిర్బంధించిందని ఆరోపించింది. తర్వాత కాసేపటికే సోఫియా కూడా తమ నౌకేనని రష్యా పేర్కొంది. అమెరికా చర్య పట్ల తీవ్ర ఆగ్రహం వెలిబుచి్చంది.
‘‘1982 నాటి ఐరాస ఒప్పందం మేరకు అంతర్జాతీయ జలాలు స్వేచ్ఛాయుత నౌకాయానానికి నెలవు. ఇతర దేశాల్లో నమోదైన నౌకల్ని దిగ్బంధించే అధికారం ఎవరికీ లేదు’’ అంటూ రష్యా రవాణా శాఖ ఘాటు పదజాలంతో ప్రకటన జారీ చేసింది. నౌకల రక్షణ నిమిత్తం జలాంతర్గాములను కూడా రష్యా రంగంలోకి దించినట్టు చెబుతున్నారు. తమ నౌకను అమెరికా నావికా దళం అనవసరంగా లక్ష్యంగా చేసుకుని వెంటాడుతోందని మంగళవారం సాయంత్రమే రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. అయితే యూరప్ దేశాలు మాత్రం అమెరికా చర్యను స్వాగతిస్తుండటం విశేషం.


