నాలుగేళ్ల నరమేధం... తెర పడేదెప్పుడు?  | Ukraine-Russia War completed Four Years | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల నరమేధం... తెర పడేదెప్పుడు? 

Feb 23 2026 6:27 AM | Updated on Feb 23 2026 6:27 AM

Ukraine-Russia War completed Four Years

ఉక్రెయిన్‌–రష్యా యుద్ధానికి నేటితో నాలుగేళ్లు 

ఇరువైపులా లక్షల మంది సైనికుల దుర్మరణం 

దేశాలన్నింటిపైనా యుద్ధ ప్రతికూల ప్రభావం 

పెద్దగాపురోగతి లేని సయోధ్య యత్నాలు

చేష్టలుడిగి చోద్యం చూస్తున్న ఐక్యరాజ్యసమితి

కీవ్‌: ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో కొనసాగుతున్న సుదీర్ఘ యుద్ధంగా గత నెలలోనే చెత్త రికార్డును మూటగట్టుకున్న పోరు. ప్రపంచమంతటా ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ యుద్ధానికి మంగళవారంతో నాలుగేళ్లు నిండనున్నాయి. ఈ పోరు ఇంకెంతకాలం కొనసాగుతుందోనంటూ ప్రపంచ దేశాలన్నీ నిటూర్పు విడుస్తున్నాయి. 

ఇరువైపులా లక్షలాది మంది సైనికులు సమరంలో సమిధలుగా నేలకూలినా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దురాక్రమణ దాహం తీరడం లేదంటూ ప్రపంచ దేశాలు ఆగ్రహిస్తున్నాయి. కానీ ఈ పోరును ఆపలేక చేష్టలుడిగి చూస్తున్నాయి. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి విఫలమై చోద్యం చూస్తోంది. ఉక్రెయిన్‌ రణక్షేత్రంలో రక్తధారాలు ఆగి శాంతి కపోతం ఎగురుతుందా అనే ప్రశ్నకు ప్రస్తుతానికి ఎవరూ బదులు చెప్పలేని పరిస్థితి! 

ఉక్రెయిన్‌పై తక్షణం యుద్ధం ఆపకపోతే రష్యాపై మరిన్ని అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవలే హెచ్చరించారు. అందుకు జూన్‌ దాకా గడువువిధించారు. ఆలోపు పుతిన్‌ వైఖరి మారేనా? యుద్ధానికి తెర దించేందుకు అంగీకరిస్తారా? బదులుగా ఉక్రెయిన్‌లోని కీలక డోన్బాస్‌ ప్రాంతాన్ని రష్యాకు వదులుకునేందుకు అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరిస్తారా? ఇవి ప్రస్తుతానికి ట్రిలియన్‌ డాలర్ల ప్రశ్నలుగానే మిగిలాయి. 

2022 ఫిబ్రవరి 24న మొదలు... 
2014లో ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకున్నాక కూడా రష్యా దురాక్రమణ దాహం తీరలేదు. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా దండెత్తింది. నాటి నుంచీ పోరాడుతున్నా ఉక్రెయిన్‌ నుంచి 20 శాతం భూభాగాన్ని మాత్రం ఆక్రమించుకోగలిగింది. ఈ క్రమంలో ఇరువైపులా ఏకంగా 20 లక్షల మంది సైనికులు చనిపోయారని వార్తలొచ్చాయి! అయితే 3,25,000 మంది రష్యా సైనికులు చనిపోయారని, మొత్తంగా 12 లక్షల మంది గాయపడ్డారని వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ సంస్థ ప్రకటించింది. 

ఉక్రెయిన్‌ వైపు 140,000 మంది సైనికులు చనిపోయారని, 6 లక్షల మంది గాయపడ్డారని తెలిపింది. రష్యా ఆక్రమణ వేగం నత్త కన్నా మెల్లగా ఉందని నాటో ప్రధాన కార్యదర్శి మార్క్‌ రుట్టే ఎద్దేవా చేశారు. ఐరోపా దేశాల ఆయుధ, ఆర్థికబలంతో రష్యాపై ఉక్రెయిన్‌ భీకరంగా పోరాడుతోంది. అందుకే నాలుగేళ్లలో డోనెట్స్క్‌ ప్రాంతంలో రష్యా కేవలం 50 కిలోమీటర్లు మాత్రమే ముందుకు రాగలిగిందని అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. ఇటీవల తాము ఆక్రమించిన నాలుగు ప్రాంతాలపై ఉక్రెయిన్‌ హక్కులు వదలుకోవాలని, ముఖ్యంగా కీలక డోన్బాస్‌ ప్రాంతాన్ని తమకు అప్పగించాలని రష్యా డిమాండ్‌ చేస్తోంది. అందుకు జెలెన్‌స్కీ ససేమిరా అంటున్నారు.

డ్రోన్లదే కీలక పాత్ర 
గతంలో ఏ యుద్ధంలోనూ వాడనంతగా ఈ యుద్ధంలో డ్రోన్లును ఇరుదేశాలూ విచ్చలవిడిగా వాడుతున్నాయి. రష్యా యుద్ధ ట్యాంక్‌లను ఉక్రెయిన్‌ డ్రోన్లు విజయవంతంగా పేల్చేశాయి. జామర్‌లకు దొరక్కుండా రష్యా ఆప్టికల్‌ ఫైబర్‌ డ్రోన్లను రంగంలోకి దింపింది. దీంతో ప్రత్యక్ష దాడి పరిధి ఏకంగా 50 కిలోమీటర్లకు పెరిగింది. దీంతో ఇరువైపులా ప్రాణనష్టం అధికంగా ఉంది. డ్రోన్ల సాయంతో ఉక్రెయిన్‌ విద్యుత్‌ వ్యవస్థలను రష్యా ధ్వంసంచేసింది. 

దీంతో చలికాలంలో గట్టకట్టే చలిలో ఉక్రేనియన్లు హీటింగ్‌ వ్యవస్థలు విఫలమై తీవ్ర అవస్థలు పడ్డారు. దీనికి ప్రతిగా చమురు నిల్వ కేంద్రాలపై ఉక్రెయిన్‌ గురిపెట్టి కొంతమేర సఫలమైంది. దీంతో ఆయిల్‌ రిఫైనరీలు తగలబడి రష్యా ఆదాయానికి భారీగా గండిపడింది. నల్లసముద్రంలో పెద్ద సంఖ్యలో రష్యా యుద్ధనౌకలను ఉక్రెయిన్‌ సముద్ర డ్రోన్లు పేల్చేసి జలసమాధి చేశాయి. స్పైడర్‌వెబ్‌ కోడ్‌నేమ్‌తో రష్యా వైమానిక స్థావరాల సమీపానికి డ్రోన్ల దండును పంపి మెరుపుదాడి చేసి యుద్ధ విమానాలను ఉక్రెయిన్‌ నాశనంచేసింది.

ఒత్తిడి పెంచుతున్న ట్రంప్‌ 
ఎన్నో యుద్ధాలను ఒంటి చేత్తో ఆపానని గొప్పలు చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఉక్రెయిన్‌ యుద్ధం కొరకరాని కొయ్యగా తయారైంది. పట్టువదలని విక్రమార్కుడిలా పుతిన్, జెలెన్‌స్కీల వెంటబడుతూ సయోధ్యకు కృషిచేస్తున్నారు. సరిహద్దు వెంట కాల్పుల విరమణకు జెలెన్‌స్కీ పట్టుబడుతుండా సమగ్ర శాంతి ఒప్పందం కుదరాలని పుతిన్‌ వాదిస్తున్నారు. 

నాటోలో చేరకుండా తటస్థ దేశంగా ఉక్రెయిన్‌ ఉండిపోవాలని పుతిన్‌ డిమాండ్‌చేస్తున్నారు. అలాస్కా సదస్సులో పుతిన్, ట్రంప్‌ మధ్య శిఖరాగ్ర చర్చలు జరిగినా ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. మరోవైపు జూన్‌లోపు యుద్ధాన్ని ఆపి ఆ ఘనతను తన ఖాతాలో వేసుకుని అమెరికాలో మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించాలని ట్రంప్‌ ఆశపడుతున్నాడు. ట్రంప్‌ ఆశ ఫలిస్తుందో, పుతిన్‌ దురాక్రమణ స్వప్నం నెరవేరుతుందో, నాటో కూటమి సాయంతో జెలెన్‌స్కీ సేనలు విజయం సాధిస్తాయో తెలియాలంటే ఇంకొన్ని నెలలు వేచి ఉండక తప్పదేమో.  

Advertisement
 
Advertisement
Advertisement