ప్రముఖ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్' బెర్క్‌షైర్ హాత్‌వే సీఈఓగా వైదొలగిన తరువాత.. 'గ్రెగ్ అబెల్' బాధ్యతలు స్వీకరించారు. ఈయన కేవలం బఫెట్ వారసుడిగానే మాత్రమే కాకుండా.. అమెరికాలో అత్యధిక పారితోషికం పొందుతున్న ప్రముఖులలో ఒకరుగా నిలిచారు.
2026 సంవత్సరానికి అబెల్ వార్షిక వేతనం 25 మిలియన్ డాలర్లు. ఇది 2024లో తీసుకున్న వేతనం కంటే 19 శాతం ఎక్కువ. అంతే కాకుండా ఈ జీతం వారెన్ బఫెట్ వేతనం కంటేఎక్కువ కావడం గమనార్హం.
95 సంవత్సరాల వయసులో.. వారెన్ బఫెట్ పదవీ విరమణ చేసిన తరువాత, ఈ ఏడాది జనవరి 1 నుంచి గ్రెగ్ అబెల్ అధికారికంగా సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన సీఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు.. బెర్క్‌షైర్ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. అంతే కాకుండా కంపెనీకి చెందిన నాన్ ఇన్సూరెన్స్ ఆపరేషన్స్‌ను కూడా పర్యవేక్షించారు.
కెనడాలోని ఎడ్మంటన్‌లో జన్మించిన గ్రెగ్ అబెల్, బఫెట్‌కు అత్యంత సన్నిహిత సహాయకుడిగా పేరుపొందారు. ఆయన వద్ద ప్రస్తుతం సుమారు 171 మిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ షేర్లు ఉన్నాయి. 2022లో బెర్క్‌షైర్ హాత్‌వే ఎనర్జీలో తన 1 శాతం వాటాను కంపెనీకే విక్రయించి 870 మిలియన్ డాలర్లు పొందారు. ఇప్పుడు సీఈవోగా బాధ్యతలు చేపట్టిన గ్రెగ్ అబెల్, బెర్క్‌షైర్ హాతవేను కొత్త యుగంలోకి నడిపించడమే కాకుండా.. అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోలలో ఒకరిగా నిలిచారు.
ఇదీ చదవండి: 2026లో ఊహించని స్థాయికి బంగారం, వెండి!


