బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం వల్ల సామాన్యులు వీటిని కొనుగోలు చేయడానికి వెనుకడుకు వేస్తున్నారు. అయితే ధైర్యం చేసి కొనుగోలు చేసినవారికి మాత్రం మంచి లాభపడ్డారు. 2025లో అమాంతం పెరిగిన గోల్డ్, సిల్వర్ రేటు 2026లో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తాయా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం అయింది.
నిజానికి 2026 ప్రారంభమై 10 రోజులు పూర్తి కావొచ్చింది. ఈ మధ్యలోనే 10 గ్రాముల గోల్డ్ రేటు భారతదేశంలో రూ.5000 పెరిగింది. దీంతో పసిడి ధర రూ. 1.40 లక్షలు దాటేసింది. ఇదిలాగే కొనసాగితే.. రాబోయే జూన్ నాటికి గోల్డ్ రేటు రూ.2 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు బంగారం ధరలు భారీ మొత్తంలో పెరగడం బహుశా ఇదే మొదటి సారి అని కూడా చెబుతున్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు గోల్డ్ రేటు 140 శాతం పెరిగింది.
వెండి ధరల విషయానికి వస్తే.. 2025 ప్రారంభంలో దాదాపు రూ. 90వేలు వద్ద ఉన్న సిల్వర్ రేటు.. 2026లో రూ.2.75 లక్షల వద్దకు చేరింది. ఇది త్వరలోనే మూడు లక్షల రూపాయలకు చేరే అవకాశం ఉందని కొందరి అంచనా.
బంగారం రేటు పెరగడానికి కారణాలు!
భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్స్. కొత్త టారిఫ్ ప్లాన్స్ వల్ల పెట్టుబడిదారుల్లో కొంత భయం మొదలైంది. దీంతో చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపారు. అమెరికా డాలర్ విలువ కొంత తగ్గడం, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల.. మన దేశంలో కూడా గోల్డ్ రేట్లు పెరగడానికి కారణం అయింది.
మన దేశంలో కూడా పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో మాత్రమే కాకుండా.. బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా కొంత నష్టాలు రావొచ్చు.. కానీ బంగారం మాత్రం ఎప్పుడూ పెరుగుతూ ఉంటుందనే కారణంగానే ఇన్వెస్టర్లు ఇటువైపు తిరుగుతున్నారు. ఇది కూడా బంగారం ధర పెరగడానికి కారణం అవుతోంది.
భారతదేశంలో గోల్డ్ రేటు పెరగడానికి మరో కారణం ఏమిటంటే పండుగ సీజన్స్. పండుగల సమయంలో బంగారం కొంటే మంచిదని చాలామంది సెంటిమెంట్‌గా భావిస్తారు. దీంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది, ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా బంగారం ధరలకు ఆజ్యం పోసినట్లే అయింది.
వెండి ధరలు పెరగడానికి కారణాలు
వెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు.


