రష్యా, చైనాలు ఆక్రమించుకోకుండా నిరోధించాలి
వీలైతే సులభంగా.. లేకపోతే కఠిన మార్గంలో విలీనం తథ్యం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పషీ్టకరణ
వాషింగ్టన్: అరుదైన ఖనిజాలు, చమురు, సహజ వాయువు నిల్వలతో కూడిన గ్రీన్‌లాండ్‌ను సాధ్యమైనంత త్వరగా అమెరికాలో విలీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తహతహలాడుతున్నారు. గ్రీన్‌లాండ్‌ను రష్యా, చైనాలు ఆక్రమించుకోక ముందే సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అమెరికన్లకు ఆయన తేల్చిచెప్పారు. ట్రంప్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గ్రీన్‌లాండ్ విషయంలో తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టారు.
వీలైతే సులభమైన మార్గంలో.. లేకపోతే కఠినమైన మార్గంలో ఆ ప్రాంతాన్ని అమెరికాలో కలిపేయక తప్పదని ఉద్ఘాటించారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తాము అనుకున్నది చేసి తీరుతామన్నారు. త్వరలో ఏదో ఒకటి చేయక తప్పదని వెల్లడించారు. గ్రీన్‌లాండ్ రక్షణ బాధ్యత తమపై ఉందన్నారు. లీజుకు తీసుకున్న ప్రాంతంపై యాజమాన్య హక్కుందని ఎలా అంటారని డెన్మార్క్‌పై అసహనం వ్యక్తంచేశారు. లీజు ఒప్పందాలతో ఎలాంటి ఉపయోగం ఉండదని, చట్టబద్ధంగా యాజమాన్య హక్కులు ఉండాలని వ్యాఖ్యానించారు.
విలీనాన్ని ఎవరూ ఆపలేరు
చైనా ప్రజలను, రష్యా ప్రజలను తాను చాలా అభిమానిస్తానని.. కానీ, వారు గ్రీన్‌లాండ్‌లో అమెరికాకు పొరుగువారిగా ఉండిపోవడం తమకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. అలా జరగనివ్వబోనని పేర్కొన్నారు. ఈ విషయం అర్థం చేసుకోవాలని నాటోకు సూచించారు. మొత్తానికి గ్రీన్‌లాండ్ అనేది అమెరికాలో అంతర్భాగం కావడం తథ్యమని, అలా జరగడం ఎవరూ ఆపలేరని ట్రంప్ పరోక్షంగా స్పష్టంచేశారు.
అమెరికా జాతీయ భద్రతకు గ్రీన్‌లాండ్ అత్యంత కీలకమని ట్రంప్ పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ రష్యా, చైనా నౌకలు పాగా వేస్తున్నాయని, అది తమ భద్రతకు విఘాతం కలిగిస్తోందని అంటున్నారు. గ్రీన్‌లాండ్ వాయవ్య భాగంలో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇది ఏర్పాటయ్యింది. ప్రస్తుతం అక్కడ 100 మందికిపైగా అమెరికా జవాన్లు విధులు నిర్వర్తిస్తున్నారు.
అమ్మకానికి లేదు
గ్రీన్‌లాండ్ ప్రస్తుతం డెన్మార్క్‌లో భాగంగా కొనసాగుతోంది. పాక్షికంగా స్వయం ప్రతిపత్తి హోదాను అనుభవిస్తోంది. ఇక్కడి ప్రజలకు డెన్మార్క్ పౌరసత్వం ఉంది. డెన్మార్క్ నుంచి ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నారు. గ్రీన్‌లాండ్‌ను డబ్బుతో కొనాలన్న ఆలోచన ఉన్నట్లు అమెరికా శ్వేతసౌధం అధికారులు ఇటీవలే ప్రకటించారు. ఆ ప్రయత్నం విఫలమైతే బలప్రయోగం తప్పదన్న సంకేతాలు ఇచ్చారు.
సైన్యాన్ని రంగంలోకి దించాల్సి ఉంటుందని వెల్లడించారు. అమెరికా దురాక్రమణ ప్రయత్నాల పట్ల డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదని, డబ్బుతో కొనేయాలన్న ఆలోచన ఉంటే మానుకోవాలని డెన్మార్క్ నేతలు తేల్చిచెప్పారు. ఒకవేళ అమెరికా గనుక సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ‘నాటో’అంతమవుతుందని అన్నారు.
పార్లమెంట్‌లో తీర్మానం
అమెరికాలో తాము అంతర్భాగంగా మారే ప్రసక్తే లేదంటూ గ్రీన్‌లాండ్ పార్లమెంట్‌లో శుక్రవారం తీర్మానం చేశారు. పార్లమెంట్‌లోని అన్ని పారీ్టలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నాయి.
గ్రీన్‌లాండ్ ఎప్పటికీ గ్రీన్‌లాండర్స్‌దే
గ్రీన్‌లాండ్ ప్రధానమంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్‌తోపాటు అధికార, ప్రతిపక్ష నాయకులు శుక్రవారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అమెరికా పౌరులుగా లేదా డెన్మార్క్ పౌరులుగా మారాలన్న కోరిక తమకు లేదని తేల్చిచెప్పారు. తమ దేశాన్ని స్వాహా చేయాలన్న ప్రయత్నాన్ని పక్కనపెట్టాలని అమెరికాను కోరారు. ఎప్పటికీ గ్రీన్‌లాండ్ పౌరులుగానే ఉంటామని, అందులో మరో మాటకు తావులేదని వెల్లడించారు.
విలీనం వెనుక ఎన్నో సవాళ్లు
బల ప్రయోగంతో గ్రీన్‌లాండ్‌ను విలీనం చేసుకోవాలన్న ఆరాటం ట్రంప్‌లో ఉన్నప్పటికీ అది అనుకున్నంత సులభం కాదని నిపుణులు అంటున్నారు. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని చెబుతున్నారు. సైనిక చర్యకు దిగితే అంతర్జాతీయ సమాజం వ్యతిరేకించే అవకాశం ఉంది. అమెరికాతో సంబంధాల విషయంలో విదేశాలు పునరాలోచించుకోవచ్చు. మొదట ‘నాటో’కూటమిలో సంక్షోభం తలెత్తుతుంది.
కూటమి విచి్ఛన్నమైనా ఆశ్చర్యం లేదు. కొన్ని దేశాలు గ్రీన్‌లాండ్ రక్షణ కోసం ముందుకు రావొచ్చు. గ్రీన్‌లాండ్ సమీపంలో ఇప్పటికే రష్యా, చైనాల జలాంతర్గాములు, నౌకలు ఉన్నాయి. ఉమ్మడిగా సైనిక విన్యాసాలు కూడా నిర్వహిస్తున్నాయి. గ్రీన్‌లాండ్‌కు మద్దతుగా ఆ రెండు దేశాలు అమెరికాతో తలపడే అవకాశాలు లేకపోలేదు. అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం వినాశనానికి దారితీయవచ్చు.
మొదట కాల్పులు, తర్వాతే మాటలు
గ్రీన్‌లాండ్‌పై ఎవరైనా దండయాత్ర చేస్తే కచి్చతంగా తిప్పికొడతామని డెన్మార్క్ హెచ్చరించారు. దురాక్రమణదారులపై తొలుత కాల్పులు జరుపుతామని, ఆ తర్వాతే చర్చిస్తామని పేర్కొంది. ఈ మేరకు డెన్మార్క్ ప్రభుత్వం తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది.
గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికా దూకుడుగా ముందుకెళ్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, అమెరికాను ఢీకొట్టగల శక్తి డెన్మార్క్‌కు లేదు. వెనెజువెలా తరహా సైనిక ఆపరేషన్‌ను తట్టుకొనే బలం కూడా లేదు. అమెరికా భూభాగంలో డెన్మార్క్ పరిమాణం 0.44 శాతమే. సైనిక శక్తి అంతంతమాత్రమే. సైనిక సిబ్బంది వేల సంఖ్యలోనే ఉన్నారు. కానీ, నాటో సభ్యదేశాలపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.


