వాషింగ్టన్: అతనో గూఢచారి. పని చేసింది అలాంటిలాంటి సంస్థలో కాదు. అగ్ర రాజ్యం అమెరికా అత్యంత గర్వంగా చెప్పుకునే నిఘా సంస్థ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)లో. అంతటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేస్తూ సొంత దేశపు రహస్యాలన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రత్యర్థి దేశం రష్యాకు చేరవే స్తూ వచ్చాడు. కర్మ కాలి ఓ దుర్దినాన దొరికి పోయాడు.
సాక్ష్యాలన్నీ స్పష్టంగా ఉండటంతో విచారణ కూడా అవసరం లేదంటూ నేరాలన్నీ తనే ఒప్పేసుకున్నాడు. అతని పేరు ఆల్డ్రిచ్ ఏమ్స్. అలా 1994 నుంచీ ఆజన్మ ఖైదు అనుభవిస్తున్న ఆ సీఐఏ డబుల్ ఏజెంట్ 84 ఏళ్ల వయసులో మేరీలాండ్ జైల్లో ఇటీ వలే కన్నుమూశాడు. బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ సోమవారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
ఖతర్నాక్ ఖిలాడీ
ఆల్డ్రిచ్ సీఐఏలో చిన్నాచితకా ఏజెంటు కాదు. ఏకంగా 31 ఏళ్లపాటు సంస్థలో ‘నమ్మకంగా’పని చేశాడు. ఏళ్ల తరబడి ఇటలీ తదితర దేశాల్లో సీఐఏ నిఘా కార్యకలాపాల్లో కీలకంగా కూడా వ్యవహ రించాడు. అలాంటివాడు తీవ్రంగా అప్పులపాలై, ఆ ఊబి నుంచి బయటపడేందుకు కిందా మీదా అవుతున్న రోజుల్లో, అంటే 1985లో సోవియట్ యూనియన్ గూఢచార సంస్థ కేజీబీ అతన్ని అప్రోచ్ అయింది.
ఎందుకంటే అప్పుడతను పని చేస్తున్నది వర్జీనియాలోని సీఐఏ ప్రధాన కార్యాలయంలో సోవియట్/తూర్పు యూరప్ విభాగంలోనే! డబ్బుల కోసం మనవాడు వెంటనే అమ్ముడుపోయాడు. అవి ప్రచ్ఛన్న యుద్ధం రోజులు కావడంతో నిఘా సమాచారానికి అత్యంత ప్రధాన్యత ఉండేది. దాంతో ఆల్డ్రిచ్‌కు సోవియట్ ఏకంగా 25 లక్షల డాలర్లు ముట్టజెప్పిందట.
అలా స్వదేశం అమెరికాకు అతను చేసిన నష్టం అంతా ఇంతా కాదు. అతనిచ్చిన సమాచారంతో రష్యా తమ దేశంలోని సీఐఏ ఏజెంట్లను చాలావరకు ఏరిపారేసింది. అంతేగాక సీఐఏ దశాబ్దాల తరబడి కష్టించి మరీ తమ దేశంలో ఏర్పాటు చేసుకున్న సమాచార తదితర వ్యవస్థలను కూడా చాలావరకు తుంచేయగలిగింది. ఇదంతా ఎలా జరుగుతోందో అర్థం కాక విస్తుపోవడం అమెరికా వంతుగా మారింది. అంతేకాదు, సీఏఐకు సమాచారం చేరవేస్తున్న 10 మంది రష్యా డబుల్ ఏజెంట్ల గురించి కూడా ఉప్పందించి వారి మరణాలకు కారకుడయ్యాడు ఆల్డ్రిచ్.
అంతేగాక రష్యాకు వ్యతిరేకంగా అమెరికా తలపెట్టిన మరెన్నో ఉపగ్రహ నిఘా ఆపరేషన్లు తదితరాల గురించి కూడా ఎప్పటికప్పుడు సమాచారమిచ్చేవాడు. 1985 నుంచి 1994లో పట్టుబడేదాకా, అంటే ఏకంగా తొమ్మిదేళ్లపాటు మనవాడి వ్యవహారం నిర్నిరోధంగా సాగిపోయింది. ఇంతా చేసి, తనవల్ల అమెరికాకు పెద్దగా నష్టమంటూ ఏమీ జరగలేదంటూ వాషింగ్టన్ పోస్ట్‌కు ఆల్డ్రిచ్ ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం రేపింది. సొంత దేశంపై అతడి నిఘా కార్యకలాపాలకు సహకరించిన భార్య రొసారియో కూడా కటకటాలపాలైంది.


