చెన్నై: తమిళనాట రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. కరూర్ తొక్కిసలాట (Karur stampede) కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ (Actor Vijay).. రేపు సీబీఐ(CBI) విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ అవుతారా? అని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే, కరూర్ తొక్కిసలాట ఘటనలో సీబీఐ (CBI) మూడు రోజుల క్రితమే విజయ్‌కు సమన్లు జారీచేసింది. తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన బస్సును కూడా సీబీఐ అధికారులు సీజ్ చేశారు. కరూర్ సభ జరిగిన రోజు వాహనం ప్రయాణ వివరాలు, అనుమతులు వంటి అంశాలను నిర్ధారించుకునేందుకు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. బస్సు డ్రైవర్‌ను కూడా ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు విజయ్ హాజరు అవుతుండటం చర్చకు దారి తీసింది.
కాగా, విచారణలో భాగంగా విజయ్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలనే ప్లాన్ జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. విజయ్.. తమిళనాడులో కాంగ్రెస్‌తో పొత్తు విషయమై అనుకూలంగా ఉన్నట్టు ఇప్పటికే టీవీకే పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. బీజేపీ కూడా విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఇలాంటి తరుణంలో సీబీఐ విచారణ జరగడం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా.. గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ పట్టణంలో విజయ్ ప్రచార ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 110 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇక మూడు రోజుల క్రితం విజయ్‌కి సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 12న తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులలో ఆదేశించింది. దేశ రాజధాని ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్‌లో విజయ్‌ని విచారించనున్నట్లు తెలిపింది. అదేవిధంగా సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని కూడా నియమించింది.


